ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Saturday, November 3, 2012

శ్రీ సతీష్ చందర్ చేసిన ఇంటర్వ్యూ


(చెట్లు తమవేళ్ళతో ప్రహరీ గోడల్ని కూల్చేస్తున్నాయ్. లోపల తెరిచిన హృదయాల్లా వెల్లకిలా పడుకొన్న సిమెంటు సోఫాలు. వాటి మధ్య నుంచి నడిచిపోతే - ఓ పాత కాలం పెంకుటిల్లు. వరండాలో నిలబడితే ఎవరో వచ్చి లోపల కూర్చోమన్నారు. విశాలంగా వున్న కుర్చీలో కూర్చొని చూస్తే ఎదురుగా ఉన్నా టీపాయ్ పిల్లల కోడిలా ఉంది. కింద మరో నాలుగు పిల్ల టీపాయ్‌లు ఉన్నాయి. గోడమీద కృష్ణశాస్త్రి బోసినోరు విప్పకుండా నవ్వుకుంటున్నాడు. బాధను రుద్దినట్టే ప్రపంచం మీద ఆనందాన్ని కూడా రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో నడయాడే సరుగుడు చెట్టులా ప్రక్క గదిలోంచి వచ్చారు ఇస్మాయిల్. సముద్రపు గట్టున వున్నట్లనిపించింది. - వచ్చిన పని చెప్పాను. ప్రశ్నలు మూటగట్టుకొచ్చారా? అన్నారు. లేదు వాటంతటవే పుడతాయి అన్నాను. తన గదిలోకి తీసుకువెళ్ళారు. )

ప్ర. మీరు కవిత్వం ఎందుకు రాస్తారు?
జ. (నవ్వుతూ) ఎందుకు రాస్తాను? రాయకుండా వుండలేను కనుక రాస్తాను.

ప్ర. ఎందుకు రాయకుండా వుండలేరు?
జ. స్వీయానుభవాల్ని అర్థం చేసుకునేందుకు చేసే ప్రయత్నమే కవిత్వం. ఐతే ఇందుకోసమే కవిత్వం రాయాలా? మరో విధంగా ఇది సాధ్యం కాదా? అంటే కాదనిపిస్తుంది. ఇటువంటి అనుభవం మరొక విధంగా అభివ్యక్తం కాదు కనుక. కవిత్వం ద్వారానే అది సాధ్యం కనుక. కవిత్వమే రాయాలనిపిస్తుంది.

ప్ర. అనుభవం, అనుభూతి రెండూ ఒకటేనా?
జ. కాదు. అనుభవ పదాన్ని ఇంగ్లీషులో experience అనే అర్థంలోనూ, అనుభూతి అనే పదాన్ని feeling అనే అర్థంలోనూ వాడుతున్నాం. అనుభవాన్నించి కవిత్వం పుడుతుంది. కవిత్వ ప్రతిఫలం పాఠకునిలో రేకెత్తే అనుభూతి.

ప్ర. మిమ్మల్ని అనుభూతి కవుల్లో లెక్కవేస్తారు కదా? మీరు అనుభూతి కవేనా?
జ. అనుభూతి కవిత్వమనే పేరు మొదట తిట్టుగా వాడారు రాజకీయ కవులూ, విమర్శకులూ. నిజానికి కవిత్వానికి లేబిల్స్ అంటించడం నాకిష్టం ఉండదు. ఆలోచన నుంచి తప్పించుకొనే మార్గాలు లేబిల్స్. అర్థం చేసుకొనే కష్టానికి పాల్పడకుండా, తేలిగ్గా కొట్టిపారెయ్యడానికి లేబిల్స్ ఉపయోగిస్తారు. ‘బూర్జువా, శ్రామికవర్గం, రివిజనిస్టు లాంటి లేబిల్స్ అంటించి ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మానేయవచ్చు. లేబిల్స్ ఉపయోగించడం నాకిష్టం లేదు. అందుకనే నా కవిత్వానికి పేరు పెట్టనీయలేదు.

ప్ర. ఐతే మీ కవిత్వం అనుభూతి కవిత్వంలోకి రాదన్నమాట?
జ. శ్రీకాంత శర్మనీ, శ్రీమన్నారాయణనీ, నన్నూ అనుభూతి కవులంటున్నారు. అందరం తలోరకంగా రాస్తున్నాం. అందరి కవిత్వాన్ని గుదిగుచ్చి ఒకలాంటిదేనని ఎలా చెబుతాం? మా కవిత్వానికి అంత దగ్గిర పోలికలున్నాయా? (ఆలోచనలో పడ్డారు). ఒక విధంగా చూస్తే మేమందరమూ ఇమీడియట్ ఎక్స్‌పీరియెన్స్‌కి అంటే ప్రత్యక్ష అనుభవానికి రియాక్టయి రాస్తున్నాం. అంతమాత్రాన ట్రేడ్ మార్క్ లేబిల్ చీట్లు మా వీపుల మీద అంటించక్ఖర్లేదు.

ప్రస్తుతం తయారవుతున్న కవిత్వాన్ని రెండు రకాలుగా విశాలంగా వర్గీకరించవచ్చుననుకుంటాను. poetry of ideas (అభిప్రాయ కవిత్వం), poetry of experience (అనుభవ కవిత్వం). నా కవిత్వంలో అభిప్రాయాలు ముఖ్యం కాదు. అది ప్రబోధాత్మకంగా ఉండదు. నేనే విధమైన statements చెయ్యను. నేను కవిత్వాన్ని అనుభవించి రాస్తాను.

ప్ర. అంటే, experiencesలో ideas అంతర్లీనంగా వుండవంటారా?
జ. అంతర్లీనంగా వుంటాయి. అనుభవం ముఖ్యం. ఆ అనుభవాన్ని వ్యక్తం చేసే ప్రయత్నమే కవిత్వం. ఈ అభివ్యక్తి తన ఇంద్రియాలను స్పర్శించే పదచిత్రాల ద్వారా జరుగుతుంది.
ప్ర. కేవలం అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారన్నారు కదా! అలాంటప్పుడు అది కవిత్వమౌతుందా?
జ. కేవలం అభిప్రాయాలుంటే అది కవిత్వం కాదు.

ప్ర. అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం - కవిత్వమని ఒప్పుకుంటారా?
జ. వాటిల్లో కవిత్వం అనిపించుకునేవి చాలా తక్కువగా ఉన్నాయి. రాజకీయ అభిప్రాయాల పొలిమేరలు దాటి కవి వైయక్తిక అనుభవాన్ని స్పర్శించిన చోట్ల కవిత్వం ఉద్భవించింది.

ప్ర. శ్రీశ్రీ గారి ప్రతిజ్ఞ ఉందనుకోండి. లండన్ అభ్యుదయ కవుల మేనిఫెస్టో చదివాక రాసింది కదా. అంటే అభిప్రాయాల మీద రాసింది. మీరు దాన్ని కవిత్వం కాదంటారా
జ. దాన్లో కవిత్వేతరమైంది చాలానే ఉంది. అలాంటివి తీసేస్తే శ్రీశ్రీ గొప్ప కవిత్వం చాలా రాశాడు.

ప్ర. రాజకీయాలు జీవితంలో భాగమేగా? అప్పుడు అనుభవంలో రాజకీయాలు కూడ మిళితమై ఉన్నట్లేగా?
జ. అవును.

ప్ర. అప్పుడు కవిత్వంలో పరోక్షంగా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయిగా?
జ. కవిత్వమనేది కవికీ, ప్రపంచానికీ మధ్య ఏర్పడే సంబంధం. కవి చేతనా (sensibility), భౌతికమైన విషయాలు ఒకదాని మీద ఒకటి రియాక్టయితే కవిత్వం పుడుతుంది. అటువంటప్పుడు విప్లవం వర్ధిల్లాలి, వర్గరహిత సమాజం ఏర్పడాలి అంటే కవిత్వమెలా అవుతుంది? అవి అభిప్రాయాలే అవుతాయి. అందులో కవి చేతనకీ సంబంధమేమీ లేదు.

ప్ర. మీ “చిలకలు వాలిన చెట్టు” కవితా సంకలనంలో “కవిత్వం” అనే ఖండిక ఉంది. అందులో సుందరి ఇచ్చిన విత్తనాన్ని నాటితే పుట్టిన మొక్క మహావృక్షమైతే ఆ వృక్షమెక్కి మళ్ళీ అదే సుందరిని అన్వేషించినట్లు రాశారు. ” కళ కళ కోసం” అన్న భావంతో అలా రాశారా?

జ.”కళ కళ కోస”మని కాదు. అందులో కవిత్వ బీజం ఉద్భవించడం, అది పెరగడం, అది తాల్చే చరమరూపం దాని వల్ల కలిగే ప్రయోజనమూ - ఇవన్నీ గమనిస్తే చాలా అద్భుతంగా (miraculous) తోస్తాయి. అంచాతనే కాశీ మజిలీ కథ గుర్తుకొచ్చింది. సుందరిని కవి వెతుక్కూ వెడతాడంటే కవిత్వం ఎప్పుడూ అన్వేషణే అని నా అభిప్రాయం. కవిత్వం అనే అద్భుతాన్ని అభివ్యక్తం చేయటానికి కాశీ మజిలీ కథ symbol గా తీసుకున్నాను.

ప్ర. అంటే, ఇక్కడ కవిత్వానికి ఫలితం ఏమై ఉంటుంది?
జ. ఫలితం అన్వేషణ. కవిత్వం ఎప్పుడూ అన్వేషణే ప్రతి అన్వేషణా కొత్తగానే ఉంటుంది. అంచేత, ప్రతి కావ్యమూ కొత్తగానే ఉంటుంది.

ప్ర. మీరు కవిత్వాన్ని ” poetry of ideas”, “poetry of experience” అని రెండు రకాలుగా వర్గీకరించారు. ఐతే, ఐడియాలను కూడా తమ ఎక్స్పీరియన్స్‌లోకి తెచ్చుకొని మంచి కవిత్వం రాస్తున్నవాళ్ళు ఇప్పుడెవరైనా ఉన్నారా? అదే, మీరు చెప్పినట్లు, శ్రీ శ్రీ లాగా రాసేవాళ్ళు, లేక అందరూ నినాదాలే రాస్తున్నారంటార?
జ. ఎందుకు లేరు? ఐతే, వారు ఎక్కువభాగం నినాదప్రాయంగానే రాస్తున్నారు. కాని మంచి కవిత్వం రాస్తున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఐతే వీళ్ళలో ఎక్కువమంది ఒకే ఐడియాకు కట్టుబడి, రాసిందే రాయడం వల్ల, వీళ్ళ కవిత్వంలో పునరుక్తి(repetition) ఎక్కువ కనిపిస్తుంది.

ప్ర. ఎందుచేతంటారు?
జ. ఒకే ఐడియాను ఎన్ని విధాలుగా చెప్పగలరు? అందుకని వీళ్ళలో చాలా మందిలో రిపిటీషన్ కనిపిస్తుంది. కొత్తదనం ఉండదు. కవికి స్వేచ్ఛ అవసరం. కవి మనసుని ఎగరనివ్వాలి. భావనని మార్క్సిస్టు పంజరంలో పెట్టి బంధించకూడదు.

ప్ర. మార్క్సిస్టు దృక్పథంలో కవిత్వం రాస్తున్నవాళ్ళు ఎక్కడున్నా ఇలాగే ఉంటారా? మీరు చెప్పింది విదేశీ కవులకు కూడా వర్తిస్తుందా? ఉదాహరణకి జర్మన్ కవి బ్రెహ్ట్ ఉన్నాడు. అతని కవిత్వంలో రిపిటీషన్ కనిపిస్తుందా?
జ. పార్టీ రాజకీయాల కన్నా కవిత్వమే బ్రెహ్ట్‌కి ముఖ్యం. తనకు నచ్చని చోట కమ్యూనిస్టు పార్టీని వ్యతిరేకించడానికి అతడు జంకలేదు. రాజకీయ అభిప్రాయాలకు అంతగా కట్టుబడలేదు. మన శ్రీ శ్రీ కి కూడా మహాప్రస్థానం గేయాలు రాసేనాటికి అంత నిబద్ధత లేదు. అది అతని మానసిక స్వేచ్ఛ నుంచి, తిరుగుబాటు తత్వం నుంచి పుట్టుకొచ్చాయి. ఈ విషయం మర్చిపోకండి.

ప్ర. అంటే, నిబద్ధత పాలు ఎక్కువైనప్పుడు కవిత్వాంశ తగ్గుతుందన్నమాట?
జ. అవును. అలా జరగడం చూస్తున్నాం.
( ఇంకా చెబుతారని ఎదురుచూస్తే, ఆయన అడగని ప్రశ్నకి సమాధానమివ్వడానికి ఉపక్రమించారు.)
జ. నేను కవిత్వంలో ఒక ముఖ్యమైన పని చేయడానికి పూనుకున్నాను. భాషని శుభ్రపరచడానికి ప్రయత్నించాను. చాలా మాటలకు మాసిన రంగులు, పాత వాసనలు ఉంటాయి. అలాంటి మాటల్ని కవిత్వంలో వాడలేదు. పాత కావ్యాల్లోనివి, పురాణాల్లోని పదాలు, సమాసాలు, పేర్లూ, కథలూ నా కవిత్వం జోలికి రాకుండా జాగ్రత్తపడ్డాను.
నా స్వంతమైన, సరికొత్త అనుభవాల్ని వ్యక్తపరచటానికి, వ్యావహారికప్రపంచంలోని సరికొత్త మాటల్నే కోసుకొచ్చి వాడుకున్నాను.

ప్ర. శ్రీ శ్రీ అలాంటి పాత పదాల్నే ఎక్కువగా వాడారంటారా?
జ. శ్రీ శ్రీ కవిత్వంలో పాత వాసన చాలా ఉంది. అందుకే అతని కవిత్వం ఛాందసపండితులకు కూడా నచ్చుతుంది.

ప్ర. ఇలా భాషను శుభ్రపరచే ప్రయత్నం చేసిన వాళ్ళలో మీరే తెలుగులో ఆద్యులా?
జ. మొదట చలం ఆ ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో నేను చలాన్ని అనుసరించాలనుకుంటున్నాను.

ప్ర. మీరు “చెట్టు” ఇస్మాయిల్‌గా పాపులర్ అయ్యారు. అసలు చెట్టుకూ, మీకూ ఇంత గట్టి సంబంధం ఎలా ఏర్పడింది?
జ. చెట్టంత అందమైన వస్తువేముంది? చెట్టు ఉపయోగపడ్డట్టుగా ఏది ఉపయోగపడుతుంది? చెట్టు పూలు పూస్తుంది. అంత అందమైన పని అదొక్కటే చేయగలదు. అందుకే “చెట్టు నా ఆదర్శం”లో అన్నాను.
“ధరను చొచ్చి, దివిని విచ్చి, విరులు తాల్చు తరువు”
వేర్లు సంప్రదాయానికి, కొమ్మలు స్వేచ్ఛా చింతనకి ప్రతీకలు.

ప్ర. సంప్రదాయం అంటే ఏ సంప్రదాయం?
జ. సారస్వత సంప్రదాయం.

ప్ర. గతంలో మనకి మంచి కవిత్వం వచ్చిందంటారా?
జ. (నవ్వి) వెనక్కి యాభై ఏళ్ళు దాటితే కవిత్వం ఎక్కడుంది? నన్నయ, తిక్కన లాంటి వారున్నారనుకోండి. వాళ్ళు బాగానే రాశారు. బాగా రాయటం వేరు, కవిత్వం రాయటం వేరు. వాళ్ళల్లో అక్కడక్కడ కవిత్వపు మెరుపులు మెరుస్తుంటాయి.

ప్ర. మీ కవిత్వం మీద మన తెలుగు కవుల ప్రభావం ఏమైనా ఉందా?
జ. నా మీద ఇద్దరి ప్రభావం ఉంది. ఒకరు కృష్ణశాస్త్రి. మరొకరు శ్రీ శ్రీ. కవి కాదలచినవాడు నేర్చుకోవలసింది అనుకరించటం కాదు. ఎలా రాయాలో నేర్చుకోవాలి. అంతకంటే, ఎలా రాయకూడదో నేర్చుకోవాలి.

ప్ర. చూడబోతే మీరు ఎలా రాయకూడదో ఎక్కువగా నేర్చుకున్నట్టున్నారే?
జ. (నవ్వి) నేనెలా రాయాలో, ఎలా రాయకూడదో ఎక్కువగా నేర్చుకున్నది కృష్ణశాస్త్రి నుంచే. అలాగే నాకు స్పానిష్ కవి లోర్కా అంటే ఇష్టం. జర్మన్ కవి రిల్కే అన్నానూ. ఇంకా చాలా మంది యూరోపియన్ కవులు నాకిష్టులు. ఈ మధ్య అమెరికన్ కవులకవిత్వాన్ని కూడా డిస్కవర్ చేశాను. ఇంగ్లాండ్లో యేట్స్, ఆడెన్, హ్యూ, ప్లాత్ వంటి మంచి కవులున్నా అమెరికన్ కవులే నాకు ఎక్కువ నచ్చుతున్నారు. వ్యావహారిక భాషలో రాస్తూ, వచనంలో ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళూ. నాలాగే అనుభవాత్మకమైన కవిత్వం రాస్తున్నారని అనిపించింది. ఐతే వాళ్ళని చదవకమునుపే ఇటువంటి ప్రయోగాలతో, ఇటువంటి కవిత్వం రాశాను కనుక వాళ్ళ ప్రభావం నా మీద ఏ మాత్రమూ లేదూ.

ప్ర. అమెరికన్ కవుల్లో ఎవరు మిమ్మల్ని బాగా ఆకర్షిస్తారు?
జ. విలియం కార్లోస్ విలియంస్, రాబర్ట్ ఫ్రాస్ట్, డెనిస్ లెవర్‌టాప్, రిచర్డ్ ఎబర్‌హార్ట్, రిచర్డ్ విల్బర్, లూయీ సింప్సన్.

ప్ర. భారతీయాంగ్ల కవులు ఎలా రాస్తున్నారిప్పుడు?
జ. మంచి కవిత్వమే రాస్తున్నారు. పార్థసారథి, రామానుజన్, నిసిం ఎజ్కియేల్, కొళాట్కర్, జస్సావాలా, దారూవాలా, ప్రీతిష్ నంది మొదలైన వాళ్ళు, ఐతే తెలుగులో లాగా వీళ్ళెవరూ సాహిత్యేతర ప్రయోజనాలకోసం రాయడం లేదు. తెలుగు దేశంలో కవిత్వం రాజకీయ ఊబిలో దిగబడిపోయింది. మన కవులకి కవిత్వానికి సంబంధించిన విషయాలకన్నా కవిత్వేతర విషయాల మీదే ఎక్కువ ఆసక్తి.

ప్ర. ఇప్పుడు రాస్తున్న యువకుల్లో శుద్ధకవిత్వం ఎవరు రాస్తున్నారు?
జ. రవూఫ్ బాగానే రాస్తున్నాడు. అతని “అంతర్నేత్రం” చూశారు కదా. అలాగే శిఖామణి, “మువ్వల చేతికర్ర” లో మంచి కవితలున్నాయి. గోదావరిశర్మ మంచి కవిత్వం రాస్తున్నాడు. అఫ్సర్ బాగా రాయగలడు నిబద్ధత సడలించుకోగలిగితే. శేషేంద్ర కొడుకు వనమాలి బాగానే రాస్తున్నారు.

ప్ర. శేషేంద్రంటే గుర్తొచ్చింది. ఆయన కవిత్వంలో అస్పష్టత ఉందంటారు, నిజమేనా?
జ. శేషేంద్ర కవిత్వంలో అస్పష్టత కంటే నాకు రిపిటీషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఆయన కవిత్వంలో చాలా కవితలు ఒకేలా ఉంటాయి. ఫిక్స్‌డ్ అయిడియాస్ వల్లననుకుంటాను.

ప్ర. వేగుంట మోహన ప్రసాద్ గారి మాటేమిటి?
జ. “చితి - చింత”లో చాలా మంచి కవితలున్నాయి. ఆయన సర్రియలిస్టు కవితలు నాకర్థం కావు.

ప్ర. తెలుగులో సర్రియలిస్టు కవిత్వం ఎలా ఉంటోంది?
జ. తెలుగులో సర్రియలిస్టు కవిత్వం రాసినవాళ్ళలో మొదటివాడు శ్రీ శ్రీ. అతనివి చాలావరకు అనువాదాలే. పోల్ ఎల్వార్, అంద్రె బ్రేతో లాంటి కవుల రచనల్ని అనువదించారు. ఐతే వాళ్ళది శుద్ధ సర్రియలిజం కాదు. శుద్ధ సర్రియలిజం ఫ్రాన్స్ లోనే నిలవలేదు. ఐతే, సర్రియలిస్టు ఉద్యమం ఒక మేలు చేసి పెట్టింది. భావనని ఆకాశమంత విశాలం చేసింది. “అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్” కు ఆస్కారం కలిగించింది. దాని ప్రయోజనం అంత వరకే. కానీ, మన మోహనప్రసాద్ మాత్రం శుద్ధ సర్రియలిజంలోకి వెళ్ళిపోతున్నాడు. కవిత్వంలో మానసిక విశృంఖలత పనికిరాదు. కవిత్వం ఒక ఆర్గనైజ్‌డ్ ఆక్టివిటీ. కంట్రోల్ వదిలేస్తే కవిత్వం దెబ్బతింటుంది.

ప్ర. కవిత్వం రాజకీయాలకు ఉపయోగపడుతుందా?
జ. ఉపయోగపడదు. కవిత్వం వల్ల ఒక్క వోటు కూడా రాదు.

ప్ర. రష్యా, చైనా విప్లవోద్యమాల కాలంలో పోరాటానికి ఉత్తేజితులై కొందరు కవిత్వం రాశారు. అది కవిత్వమని ఒప్పుకుంటారా?
జ. రష్యాలో కమ్యూనిస్టులైన కవులూ, కమ్యూనిస్టులు కాని కవులూ కూడా మంచి కవిత్వం రాశారు. అలెక్సాండర్ బ్లోక్, మయకోవ్‌స్కీలు విప్లవాన్ని సమర్థించారు. మయకోవ్‌స్కీ నిబద్ధత ఉన్నప్పటికంటే నిబద్ధత లేనప్పుడే మంచి కవిత్వం రాశారు. అతను చివర్లో విప్లవం పట్ల అసంతృప్తి చెందాడు. అతని ఆత్మహత్యకి అదే కారణమంటారు. కమ్యూనిస్టులు కాకుండా గొప్ప కవిత్వం రాసినవాళ్ళను సోవియట్ ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టింది. అన్నా అఖ్మతోవా, మెండెల్‌స్టాం, సవటయేవా, బోరిస్‌పాస్టర్‌నాక్ - వీళ్ళు నానా హింసలు పడి, అద్భుతమైన కవిత్వం రాశారు.

ప్ర. కొత్తగా కలాలు పట్టుకొని కవిత్వం రాస్తున్నవాళ్ళకి సూచన లాంటిది ఏమైనా చేస్తారా?
జ. ఏం చెబుతాను. బలవంతంగా రాయొద్దంటాను. రాయకుండా ఉండలేకపోతేనే రాయమంటాను. కవిత్వం బుద్ధి వల్ల కలగదని గ్రహిస్తే చాలు. మినీ కవిత్వం రాస్తున్న యువకవులు చమత్కారమే కవిత్వం అనుకుంటున్నారు. చమత్కారం వేరు, కవిత్వం వేరు. కవిత్వం చేతన (sensibility) కి సంబంధించినది. బుద్ధి(reason)కి కాదు. అంచేత, కవిత్వాన్ని కవిత్వం రాసుకుంటుంది. let the poem write itself.

....... జనవరి 18, 1988 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమయింది

1 comment:

  1. ఇస్మాయిల్ గారి అంతరంగం చూపించడమే కాకుండ,కవిత్వాల పరిధిలను తెలియజేసారు,కృతజ్ఞతలు.

    ReplyDelete