ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Saturday, November 3, 2012

శ్రీ విద్యారణ్య కాంలేకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ.


( 25-9-1989 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురితం.)
ప్ర: కళ కళ కోసమేఅన్న వాదన మళ్ళీ ఎదో వొక రూపంలో బహిర్గతమవుతుంది. కారణం? “శుద్ధకళావాదన మనుగడకు పరిస్థితులున్నాయా?
జ. కళ కళ కోసమేఅనే వాదన తలెత్తిందని నేననుకోను. ఈ మధ్య నేను ఎక్కడా వినలేదు. కళ కళ కోసమేఅనే వాదనా, “కళ సాంఘిక రాజకీయ ప్రయోజనాల కోసంఅనే వాదనా - రెండూ అతి వాదాలే! ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఏదీ వుండదు. ఐతే దేని ప్రయోజనం దానికుంటుంది. ఇది గుర్తించడం ముఖ్యం. ప్రపంచాన్ని అవగాహన చేసికోవటమూ, తద్వారా ప్రపంచంతో అనుభౌతిక అనుసంధానం (emotional adjustment) సాధించటమూ - అనాది నుంచీ కళా ప్రయోజనమని అనుకుంటున్నాను.
ప్ర: శ్రీ శ్రీ ముందూ వెనకా శూన్యం. అభ్యుదయ కవులంతా శ్రీశ్రీని పట్టుకొని వేళ్ళాడుతున్నవారేఅంటున్నారు కొందరు. మీరేమంటారు?
జ : మొదటి వాక్యం అబద్ధం. రెండో వాక్యం నిజం.
ప్ర: సాహిత్యంలో నిబద్ధత సృజనాత్మకతని చంపుతుందా?
జ: దేనికి నిబద్ధత? సాహిత్యం అసూయాపరురాలైన భార్య వంటిది. ఆమెకు పూర్తిగా నిబద్ధులమైతే కాని ప్రసన్నురాలు కాదు. అసలు సృజనాత్మకతకి మూలమేమిటి? కవి యొక్క దర్శనం (vision). ఇది పూర్తిగా వైయక్తికమైనది. ఏ కవి దర్శనం వానిది. దీన్నించే అతని కవిత్వం ఉద్భవిస్తుంది. కనక, కవి నిబద్ధుడై ఉండవలసింది తన సొంత దర్శనానికే!
ప్ర: శ్రీశ్రీ నిబద్ధతను అంగీకరించకుండా, ఆయన కవిత్వాన్ని మాత్రమే భుజాల మీద మోస్తున్నారు కొందరు. అసలు ఈ అర్హత వారికుందా? శ్రీశ్రీ లక్ష్యమూ, కవిత్వమూ వేర్వేరా?
జ: ఇక్కడ నిబద్ధత అనే మాట వేరే అర్థంలో వాడారు మీరు. మీరు మాట్లాడేది శ్రీ శ్రీ రాజకీయ అభిప్రాయాల గురించి. శ్రీ శ్రీ కవిత్వం ఆస్వాదించటానికి అతని రాజకీయ అభిప్రాయాలని అంగీకరించనఖ్ఖర్లేదు. కవిత్వం వేరు, రాజకీయాలు వేరు. కవిత్వం హృదయానికి సంబంధించింది. రాజకీయ అభిప్రాయాలు మేధకి సంబంధించినవి. కవి నిజమైన కవిత్వం రాసినప్పుడు, సంకుచితమైన మేధాపరిధిని దాటిపోతాడు. కవిత్వం చెప్పినప్పుడు అతని చేతనలు (sensibilities) అన్నీ తీవ్రీకరించి ఏకాగ్రతని తాలుస్తాయి. దీన్నే కవి దర్శనం(poet’s vision) అంటాము. ఆ స్థితిలో కవి తన సంకుచితమైన సాంఘిక, రాజకీయ అవధుల్ని దాటి సార్వత్రికమైన సత్యాన్ని దర్శించగలడు. ఏ మహారచయితని తీసుకున్నా, ఇటువంటి విచిత్ర ఘట్టాలు మనకు ఎదురవుతాయి, గురజాడ అప్పారావు గారినే తీసుకొండి. కన్యాశుల్కంరచించటంలో ఆయన తలపెట్టిందేమిటి? రాసిందేమిటీ? మధురవాణి, గిరీశం పాత్రలు వొక సంఘసంస్కర్త చిత్రించవలసినవేనా? ఆ పాత్రల్లో ఆయన ఎంత జీవాన్ని నింపాడంటే ఆయన్నీ ఆయన సంస్కరణ భావాల్నీ ధిక్కరించి, వాటి సొంత బతుకు అవి బతికేశాయి. అంత సజీవమైన పాత్రలు మన తెలుగు సాహిత్యంలో అరుదు. వాటి సజీవతకి కారణం అప్పారావుగారి మేధోగత సంస్కరణాభిప్రాయాలు కావు. వాటిమూలం సృజనాత్మకమూ సార్వజనీనము ఐన ఆయన దర్శనంలో వుంది. రచయిత దర్శనానికి అతని సంకుచిత అభిప్రాయాల్ని దాటి విస్తరించే శక్తి వుందని మార్క్స్, ఏంగెల్స్ కూడా ఒప్పుకున్నారు. ఈ ప్రాతిపదికమీదే వారి రాజకీయ అభిప్రాయాలు ఎటువంటివైనా, డాంటే, షేక్స్‌పియర్, గెటె, బాల్జాక్‌లు మహాకవులని ఏంగెల్స్ వాదించాడు. కనుక, శ్రీశ్రీ అభిప్రాయాలూ, కవిత్వమూ వేరైతే ఆశ్చర్యపడవలసిందేమీ లేదు.
ప్ర: తెలుగు కవిత్వంలో సర్రియలిస్టు ధోరణులు? నిజంగా సర్రియలిస్టులు తెలుగు కవిత్వంలో వున్నారా? అధివాస్తవిక ధోరణుల ప్రభావం ఆధునిక కవిత్వంపై వుందా?
జ: ఇప్పుడు తెలుగులో పూర్తి సర్రియలిస్టు ధోరణిలో రాస్తున్నవాడు మోహన్‌ప్రసాద్ వొక్కడే కనిపిస్తున్నాడు. కానీ, సర్రియలిస్టు ప్రభావం ప్రపంచంలో దాదాపు అందరు కవులమీదా వుంది. సర్రియలిస్టు ప్రభావం తమపై వుందని చాలా మందికి తెలియదు. 1920లలో సర్రియలిస్టు ఉద్యమం వచ్చి కవులకి ఐంద్రజాలిక మంజూషాలను తెరిచింది, అద్భుతమైన పదచిత్రాల ఇంద్రధనుష్కోటిని చూపించింది. భావనా స్వాతంత్ర్యానికి అవధుల్లేవని నిరూపించింది. అప్పట్నించీ అది తొడిగిన రెక్కల్తోనే కవులు ఎగురుతున్నారు. అధివాస్తవిక కవిత్వం ఇప్పుడెవరూ (మోహన్ ప్రసాద్ తప్పించి) రాయకపోయినా, దాని ప్రభావం మాత్రం అందరి మీదా వుంది.
ప్ర: కవిత్వంలో స్తబ్ధత ఏర్పడిందనీ, అసలు ఏర్పడలేదనీ వాదోపవాదాలు జరుగుతున్నాయి. నిజంగా అలాంటిదేమైనా ఉందా?
జ: స్తబ్ధత సంగతి ఎత్తారు కనక చెబుతున్నాను. తెలుగు కవిత్వంలో స్తబ్ధత రాజకీయ కవితోద్యమాల కాలంలో, అంటే 1950, 60, 70ల కాలంలో కనిపించింది. రాజకీయ ఉద్యమాల నీడలో బోలెడు అకవిత్వం పుట్టుకొచ్చింది. అదీ స్తబ్ధతంటే.
వాళ్ళ ప్రభావం తగ్గాక 1980 తర్వాత మంచి కవిత్వమే వస్తోంది.
ప్ర: మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ తెలుగులో ఎలా ప్రవేశించింది?
జ: దొడ్డి దారిన.
ప్ర: అంటే?
జ: కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రవేశపెట్టారు.
ప్ర: మార్క్సిస్టు సాహిత్య విమర్శ సమీక్షా స్థాయినుంచి ఎదగలేదనే అభిప్రాయమొకటుంది. అవునా?
జ: అసలు ఆ స్థాయికి కూడా ఎదగలేదు.
ప్ర: ఆధునిక కవిత్వంపై శ్రీశ్రీ ప్రభావమెన్నడో పోయిందంటున్నారు శేషేంద్ర. నిజమా?
జ: శ్రీ శ్రీ ని అనుకరించే వారు లేకపోవచ్చును. అంతమాత్రాన శ్రీశ్రీ ప్రభావం లేదని కాదు. నామీద శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి ఇద్దరి ప్రభావం వుంది. వాళ్ళని నేననుకరించకపోయినా. తెలుగుసాహిత్యం బతికున్నంతకాలం, వారిద్దరి ప్రభావమూ ప్రసరిస్తూనే వుంటుంది.
ప్ర: తెలుగులో అస్పష్ట కవిత్వం రాస్తున్నవారెవరైనా వున్నారా?
జ: అస్పష్ట కవిత్వం రాస్తున్నవారు లేరు. అకవిత్వం రాస్తున్నవారున్నారు.
ప్ర: మిమ్మల్ని అనుభూతి కవి అంటున్నారు. మీరేమంటారు?
జ: లేబిల్స్ అనవసరం. స్వయంగా ఆలోచించలేని బలహీనులకు మాత్రమే లేబిల్స్ ఉపయోగపడతాయి. కవిత్వమంతా వొక్కటే!
ప్ర: ఇవాళ కొత్తగా దూసుకువస్తున్న కవులకు మీ సలహా ఏమిటి?
జ: దూసుకు రావద్దని. రష్యన్ కవి పాస్టర్‌నాక్ కవిత్వం రెండు విధాలన్నాడు. ఊటలాగో, జలపాతంలాగో ధారా ప్రవాహంగా దూసుకొచ్చేదొకటి. స్పాంజిలాగా వొకచోటకూచొని తన పరిసరాలను పీల్చుకునేది రెండోది. రెండో రకమే తనకిష్టమన్నాడు. నాకూ అంతే! కవి అనుభవాల్ని తనలో ఇంకించుకుని, అంతర్దర్శి ఐననాడే మంచి కవిత్వం జనిస్తుంది.
25-9-89

No comments:

Post a Comment