ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...
Showing posts with label నత్త ప్రణయయాత్ర - హైకూల సంపుటి. Show all posts
Showing posts with label నత్త ప్రణయయాత్ర - హైకూల సంపుటి. Show all posts

Saturday, November 3, 2012

9 of 9

ఫ్యానుగాలికి రాత్రంతా
పోటెత్తింది
క్యాలెండరు సముద్రం.

--------

నిద్దట్లో కళ్ళు తెరిచి
నన్ను చూసినట్లు కలగని
తిరిగి నిద్దరోయింది పాప.

--------

ఆధునిక చిత్రకళ
నాకిష్టం: వాంగో అంటే
చెవికొసుకుంటాను.

--------

అన్నిటికన్నా చవకైంది
హృదయం:
ఎన్నిమార్లు తిరిగొచ్చిందో!

--------

ముడ్డికి చుక్కాని తాటించి
పడవ నడిపాడు సిరంగు:
మహాత్ములకి ఉపకరణం కాదు ముఖ్యం.

--------

ప్రేమంటే
పడిచస్తారు:
అంతటి క్రూరమృగం లేదు!

--------

మా బోగెన్ విలియా
సూర్యుడస్తమించాక
ఎండకాస్తుంది.

--------

నత్త
ప్రియురాలి ఇల్లు చేరేటప్పటికి
ముసలిదైపోతుంది!

8 of 9

పశ్చిమాన్నించి తూర్పుకి
నీడ పాకింది
అందంగా.

--------

భూమి కోసం తన్నుకుంటున్నారు:
ఆకాశాన్ని
నాకు వదిలినందుకు ధాంక్స్!

--------

కాకి బాల్చి మీద వాలి
ఒక చుక్క నీరు తాగింది:
ఎండాకాలం.

--------

ఎర్రచీర కట్టుకుని
ఇంటి మూలల్నే కాదు,
మనసు మూలల్నీ వెలిగించింది.

--------

అక్షరారణ్యాలని
విస్తరింపచేసాడీ కవి:
ఒక్క మొక్క నాటితే సంతోషిద్దును.

--------

అరచేయంత కిటికీ
అనంతమైన ఆకాశాన్ని
ఆహ్వానించింది.

--------

కాకి
బాల్చీ మీద వాలి
నీడ చూసుకుంది.

--------

తెల్లారకట్ట రైలు
యువదంపతుల్ని లేపుతుంది:
రెండో మన్మధుడు!

--------

7 of 9

వెల్లగోడ మీద
ఎండ పొడలు
కలలు కంటున్నాయి.

--------

చెట్టు కింద వాన
చెడ్డ చిరాకు:
నేరుగా తడవటం నయం.

--------

ఉత్తరం రాసేందుకు
కార్డుముక్క చాలు:
జీవితం కార్డంత కురచ.

--------

అంతా బానిసలమే.
మీరు డబ్బుకైతే
నేను ప్రేమకి.

--------

సముద్ర ఘోషని
నిత్యం మోస్తుంది
నత్త.

--------

పచ్చటి పొదలు:
ఒకటకి పోయా
లనిపించింది.

--------

జ్ఞాన వృక్షానికి
దిగిన ఊడలు-
గెడ్డాలకు నమస్కారం.

--------

గదిలో ఎండపొడ.
కాస్సేపు కన్ను తెరిచి
వెంటనే కన్ను మూసింది.

--------

నేనొక గబ్బిలాయిని.
పాత స్నేహాల చూర్లు
పట్టుకు వెళ్ళాడతాను.

--------

సముద్ర తీరం:
జనసంచారం మణిగాక
పీతల సంచారం.

--------

పులీ
కవీ-
ఎప్పుడూ పొంచి ఉంటారు.

--------

తేలిపోయే పడవ కింద
పొంచి చూసే
సముద్రపు కన్ను.

--------

పిట్టల్ని లెక్క పెట్టినా
చుక్కల్ని లెక్క పెట్టినా
ఒక్కటే.

--------

6 of 9

ఎవరో తలుపు తట్టారు.
ఎవరో తలుపు తీసారు:
మగత నిద్ర.

--------

బంతులంటే
పిల్లలకిష్టం:
ఇద్దరూ గెంతుతారు.

--------

వాన వెనుక
ఎండకాస్తే
రెంటికీ అందం.

--------

వీణ్ణి సభకి పిలిస్తే
కవిత్వానికి
తద్దినం పెట్టేస్తాడు.

--------

నీడవల్లే
ఎండకు
అందం.

--------

భూమి
ఊరకే ఉండదు:
గడ్డయినా మొలుస్తుంది.

--------

నాయకుల విగ్రహాలు
పెంటకుప్ప మీద
కోడిపుంజులు.

--------

అందగత్తెలు
ఇందరు ఎదురయ్యారు:
ఎవరూ నాకేసి చూడరు.

--------

నీడని పరుచుకుని
ఎండని కప్పుకుని
పడుకుంది రాలిన ఆకు.

--------

ఎవరికీ స్వేచ్చ లేదు;
చివరికి పక్షికి కూడా.
అది ఆకాశానికి బానిస.

--------

ఊళ్లోకి కోతులొచ్చి
ఊరి పిల్లల్ని
కోతులుగా మార్చాయి.

--------

పొద్దున లేచి చూస్తే
నూతికి కడుపైంది:
రాత్రి వచ్చిన రహస్యపు వాన.

--------

పిట్టలా ఎగుర్తాను.
ఎక్కడికి?
తిరిగి ఇక్కడికే!

--------

జపానీ హైకూ కవి కోసం
ఈ రొయ్య
చెరువులో పెరుగుతోంది.

--------

5 of 9

ఆరుబైట
తువాలు ఆరేస్తే
మబ్బుల్లో నేస్తం కట్టింది.

--------

ఒడ్డుకేసి
తల బాదుకుంటుంది
పిచ్చి సముద్రం.

--------

కాలవలో ములిగి
ఒళ్ళు తోమించుకునే
గేదె బతుకే మధురం!

--------

మబ్బుల మాగన్ను వేసి
ఆకాశం
కలవరిస్తోంది.

--------

కప్పలాగుండి
కోయిలలా పాడుతోంది: ఇది వింటే,
గాడిదలా తంతుందేమో!

--------

ప్రతి ఉదయం
ఒక కొత్త కవిత:
ఈ కావ్యం అనంతం.

--------

పెచ్చులూడిన గోడ తప్ప
పలకరించడానికేమీ లేవు
పాపం, ఈ కిటికీకి.

--------

ప్రతిపనికీ అడ్డంగా
తలూపుతాడీయన:
అచ్చు మా పాత గోడ గడియారం.

--------

వడియాలు ఎండపడితే
మబ్బులు తప్పక వస్తాయని
మా ఆవిడ కనిపెట్టింది.

--------

మన నీడ కూడా
మనల్ని అనుసరించదు:
అప్పుడప్పుడు ముందు నడుస్తుంది.

--------

నేలపై జామిపిందెలు:
తలెత్తి చూస్తే
చెట్టునిండా చిలకలు.

--------

రాత్రి సందులన్నీ వెతికి
మిత్రుని ఇల్లు పట్టుకున్నాను
చంద్ర శకలం సహాయంతో.

--------

వాన వెలిసిందని
పెరట్లో కెడితే
టపటపా తడిపేసింది చెట్టు.

--------

4 of 9

హడావిడి మబ్బొచ్చి
పెళ్లి చుట్టాల్ని
ఇంట్లోకి తరిమింది

--------

గేదెల్ని కడుగుతూ
కాలవలో ఈతకొట్టే పిల్లలు
ఎంత అదృష్టవంతులు!

--------

చెట్టుని కూల్చితే
ఆకాశంలో
పెద్ద గొయ్యి.

--------

పది బారల ప్రయాణంలో
పది మొహాలు మార్చింది
ఈ మబ్బుతునక.

--------

మా చిన్నప్పటి ఫోటోలు:
కాలం ఆత్మకి అప్పిచ్చి
దేహాన్నించి వసూలు చేసింది.

--------

హోరున వర్షం:
దండెం మీద కాకీ,
గదిలో నేనూ.

--------

ఉదయాన్ని సృష్టించడానికి
ఆకాశం
ఎన్ని కవితలు రాయాలో

--------

పిల్లలకీ
చినుకులకీ
ఏమిటి అనుబంధం!

--------

ఈమెను ప్రేమిస్తున్నానని
అడుగడుక్కీ రుజువు చెయ్యాలి:
బతుకంతా పరీక్షే!

--------

పెరట్లో బట్టలూ
పైన మబ్బులూ ఆరేశారు:
రెండూ నీల్లోడుతున్నాయి.

--------

పిట్టలు వాలే
చెట్టులా
బతకాలని కోరిక.

--------

ప్రేయసి బాల్యం ఫోటో:
ప్రేమించుకునే రోజులు
ఇంకా ముందున్నాయి.

--------

బాతులా నా ప్రతిబింబాన్ని
చీల్చాలని కోరిక.
--------

వీళ్ళకి చాతవక్కానీ
నీలాకాశాన్ని కత్తిరించి
సంచీలు కుట్టి అమ్మేస్తారు.

--------

గోడ మీద
నా నీడ చూపించి
పిల్లలు ఒకటే నవ్వు.

--------

నింగిలా
నీలంగా, విశాలంగా
నవ్వే వాళ్లెవరున్నారు?

--------

3 of 9

చంద్రుడు
కొలను మీద
సంతకాలు అభ్యసిస్తున్నాడు.

--------

మగపిల్లలు యుద్ధాలాట,
ఆడపిల్లలు పెళ్ళాట ,
రెండూ ఒకటేనేమో!

--------

పీత
సముద్రఘోష వింటూ
నిద్ర జోగుతుంది.

--------

ఎన్ని చినుకులు పడితే
ఒక వర్షమౌతుంది ?
ఒకటి, రెండు, మూడు...

--------

ఇంటికి రిపేర్లు
చేయించి, చేయించి,
ఇపుడిల్లు గుర్తుపట్టలేను.

--------

పిల్లల ప్రపంచం
పిల్లలే సృష్టించుకుంటారు:
పెద్దవాళ్ళకది చాతకాదు.

--------

నత్త
ప్రియురాలి ఇంటికి
మెరిసే రోడ్డు వేసింది

--------

మబ్బొకటి
పొంచి చూస్తోంది:
ఇంకా బడి విడిచిపెట్టలేదు.

--------

చిరకాలం తలపోసి
కప్ప
ఒక గెంతు గెంతింది.

--------

గేదెలూ,
పిల్లకాయలతో
కాలవ అందగించింది.

--------

తెల్లారింది.
పిట్ట పాడింది.
ఇంకేం కావాలి!

--------

తమ్ముడి తొలి షేవ్ ని
అక్క
ఆశ్చర్యంగా చూస్తోంది.

--------

2 of 9

పెళ్ళిలో సంబరమంతా
పిల్లలదే.
పాపం, పెళ్ళికొడుకు!

--------

తుఫాను హడావుడితో
పాప ఒక్కర్తే అడిగింది
చంద్రుడేమయ్యాడని .

--------

కాకుల సంత:
ఏమి అమ్మినట్లు,
ఏమి కొన్నట్లు!

--------

ఆమెకు కుక్కపిల్లలంటే ఇష్టం:
కుక్క పిల్ల స్థాయికి ఎదగాలని
ప్రస్తుతం నా ప్రయత్నం.

--------
అదృష్టమంటే పీతది :
తప్పించుకోవటానికి
ఎన్ని కన్నాలో !

--------

పిల్లలు
పగలు ఉత్తుత్తి యుద్ధాలు,
కలల్లో నిజం యుద్ధాలు చేస్తారు.

--------

మా ఆవిడ
చీర ఆరేసింది గాలిలో:
పెరటినిండా సీతాకోకచిలకలు.

--------

మెట్లు
దిగింది
కప్ప.

--------

లోతుగా ఆలోచించి,
లోతందక,
చివరికి మరణించాడు.

--------

1 of 9

నత్త
నత్తగుల్లలో దూరి
ఏమి తలపోస్తుంది చెప్మా !
 --------
ఆరుసార్లు గెంతి
అరుగెక్కింది కప్ప
అక్కడేమీ లేదు !
 --------
కుడి కంటితో ఓసారి
ఎడం కంటితో ఓసారి
పరీక్షించింది కాకి నన్ను.
 --------
పకోడీ పొట్లం :
పాత వార్తలు నంజుకుంటే
పకోడీలకు మజా .
 --------
పిల్లి నీ కాళ్ళ కడ్డపడ్డా
నీవు పిల్లి కాళ్ళ కడ్డపడ్డా
నువ్వే పడతావు.
 --------
పాప
తాయిలం కోసమేడిస్తే
తల్లి చంద్రుణ్ణి చూబెడుతోంది.
 --------
మా ఆవిడ
కాకుల్ని తిడుతుంటే
కాకి శ్రద్దగా వింటోంది.
 --------
పాపకు నా పద్యమిస్తే
రుచి చూసి
వెగటుగా పెట్టింది మొహం !
 --------
కంటి కొసకి మాత్రమే
కనిపించేది
ఎలక.
 --------
పేపర్ లో ‘కాశీ’ ఫోటో
నవ్వుతూ పలకరించింది
కింద నిర్వాణవార్త !
 --------
కురిసిన వాన చినుకులు
పైకేగిరే ప్రయత్నమా ?
నేలంతా చిరు కప్పలు !
 --------
చెట్టున వేలాడుతోంది దారం,
ఒక కొసన గాలిపటం :
రెండో కొసన పిల్లలేరీ ?
 --------
అరచేయంత మబ్బొచ్చి
ఆకాశం మొత్తం
ఆక్రమించింది.
 --------
గడియారం
తిరిగి, తిరిగి
మొదటి చోటుకే చేరుతుంది.