ఇస్మాయిల్ గారు వివిధ సందర్భాలలో వెలువరించిన అభిప్రాయాలు
•క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా
తాకే అనుభవాలూ, వాటి
స్పందనలూ, జీవితాన్ని
జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం?
•అనుభూతి ఎప్పుడూ వైయక్తికమే.
అనుభవ వస్తువు ఒకటైనా, ఎవరి
అనుభూతి వారిది. అది ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఒకరి అనుభూతిలా మరొకరి అనుభూతి
ఉండదు. ఈ నవనవోన్మేషమైన అనుభూతిని ఆవిష్కరించటమే కవి కర్తవ్యం
•కవి అనుభవాల్ని తనలో
ఇంకించుకుని, అంతర్దర్శి
ఐననాడే మంచి కవిత్వం జనిస్తుంది.
•అనుభూతులు శబ్ద ప్రపంచానికి
చెందినవి కావు. ఈ నిశ్శబ్దాన్ని శబ్దంలోకి ప్రవేశపెట్టటమే కవిత్వం విశిష్ట లక్షణం.
కవిత్వానికి శబ్దమెంత ముఖ్యమో నిశ్శబ్దం కూడా అంతే.
•పదచిత్రమనేది ఐంద్రియకం (sensuous).
ఇంద్రియ
జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. హేతుబుద్ధికి సంబంధించింది కాదు. లోతైన అనుభూతుల్నీ(feelings),
భావాల్నీ(emotions)
ఆవాహించే
శక్తి పదచిత్రానికుంది.
•లేబిల్స్ ఉపయోగించడం నాకిష్టం
లేదు. అందుకనే నా కవిత్వానికి పేరు పెట్టనీయలేదు
•ప్రస్తుతం తయారవుతున్న
కవిత్వాన్ని రెండు రకాలుగా విశాలంగా వర్గీకరించవచ్చు ననుకుంటాను. poetry
of ideas (అభిప్రాయ
కవిత్వం), poetry of experience (అనుభవ కవిత్వం).
•మినీ కవిత్వం రాస్తున్న
యువకవులు చమత్కారమే కవిత్వం అనుకుంటున్నారు. చమత్కారం వేరు, కవిత్వం వేరు.
•కవిత్వం వల్ల కొంపలు కాల్తాయి.
విప్లవాలు వస్తాయి అని మీరనుకున్నట్టయితే నిరాశ కోసం సిద్ధపడండి. అది చేసే పనల్లా
చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది.
తన మనస్సులో వెలిగిన
దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది. ఫలానా దారినే నడవమని
ఒకరు చెబితే వినడు మనిషి. అది తనకు తోచాలి. తన దారేదో తను నిర్ణయించుకోవాలి. ఈ
నిర్ణయానికి కవిత్వం తోడ్పడుతుంది.
•బ్రహ్మాండం బద్దలయ్యే సంఘటనలకి
బ్రహ్మాండం బద్ధలయే కవిత్వం పుడ్తుందని ఆశించడం అమాయకత్వం.
•ప్రతిదేశంలోనూ అభ్యుదయం పేరనో, విప్లవం పేరనో రచయితల సంఘాలు
ఏర్పరచి, రాజకీయ
ప్రయోజనాలకు ఉపయోగపడని సాహిత్యం పనికిమాలినదని యువ రచయితలకు నూరి పోసి వాళ్ల చేత
నినాద ప్రాయమైన శుష్కరచనలు రాయించి పార్టీ ప్రచారం చేయించుకొంటున్నారు. సాహిత్యంలో
రాజకీయ కాలుష్యాన్ని మొదట్నించీ ఎదిరిస్తూ వచ్చాను. కమ్యూనిష్టు ప్రభావం వల్ల ఎంతో
మంది యువరచయితలు, జబ్బుపడి
సాహిత్యపరంగా శవ ప్రాయులయ్యారు. ఆ అకవిత్వ కల్మషం దేశమంతా అలముకొంది. ఈ వెల్లువ
ఇంకా తగ్గినట్టు లేదు. దీనికి వ్యతిరిక్తంగా, అంటే సాహిత్యంలో స్వేచ్ఛకోసమూ, రచయితల వ్యక్తి ప్రాధాన్యాన్ని
ఉగ్గడిస్తూనూ, నలభైయ్యేళ్ల
బట్టి పోరు సాగిస్తున్నాను.
•కవిత్వం హృదయ సంబంధి. ఆలోచనా
వ్యవస్థ బుద్ధికి సంబంధించినది. కవిత్వాన్ని బుద్ధి (Reason)
శాసించలేదు.దాని
సామ్రాజ్యమే వేరు.
•కవిత్వమనేది కవి సంపూర్ణ
అస్తిత్వంలోంచి ఉద్భవిస్తుంది. నేను బ్రాహ్మణుణ్ణి లేదా దళితుడిని అని జీవితాన్ని
కుంచింపజేసుకున్నవాడు కవిత్వమేం రాయగలడు?
•జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని
ఆవిష్కరించడమే కవిత్వం పని. ఈ విధంగా మన చేతనని సుసంపన్నం చేస్తుంది కవిత్వం.
No comments:
Post a Comment