ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Saturday, November 3, 2012

5 of 9

ఆరుబైట
తువాలు ఆరేస్తే
మబ్బుల్లో నేస్తం కట్టింది.

--------

ఒడ్డుకేసి
తల బాదుకుంటుంది
పిచ్చి సముద్రం.

--------

కాలవలో ములిగి
ఒళ్ళు తోమించుకునే
గేదె బతుకే మధురం!

--------

మబ్బుల మాగన్ను వేసి
ఆకాశం
కలవరిస్తోంది.

--------

కప్పలాగుండి
కోయిలలా పాడుతోంది: ఇది వింటే,
గాడిదలా తంతుందేమో!

--------

ప్రతి ఉదయం
ఒక కొత్త కవిత:
ఈ కావ్యం అనంతం.

--------

పెచ్చులూడిన గోడ తప్ప
పలకరించడానికేమీ లేవు
పాపం, ఈ కిటికీకి.

--------

ప్రతిపనికీ అడ్డంగా
తలూపుతాడీయన:
అచ్చు మా పాత గోడ గడియారం.

--------

వడియాలు ఎండపడితే
మబ్బులు తప్పక వస్తాయని
మా ఆవిడ కనిపెట్టింది.

--------

మన నీడ కూడా
మనల్ని అనుసరించదు:
అప్పుడప్పుడు ముందు నడుస్తుంది.

--------

నేలపై జామిపిందెలు:
తలెత్తి చూస్తే
చెట్టునిండా చిలకలు.

--------

రాత్రి సందులన్నీ వెతికి
మిత్రుని ఇల్లు పట్టుకున్నాను
చంద్ర శకలం సహాయంతో.

--------

వాన వెలిసిందని
పెరట్లో కెడితే
టపటపా తడిపేసింది చెట్టు.

--------

No comments:

Post a Comment