ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Saturday, November 3, 2012

7 of 9

వెల్లగోడ మీద
ఎండ పొడలు
కలలు కంటున్నాయి.

--------

చెట్టు కింద వాన
చెడ్డ చిరాకు:
నేరుగా తడవటం నయం.

--------

ఉత్తరం రాసేందుకు
కార్డుముక్క చాలు:
జీవితం కార్డంత కురచ.

--------

అంతా బానిసలమే.
మీరు డబ్బుకైతే
నేను ప్రేమకి.

--------

సముద్ర ఘోషని
నిత్యం మోస్తుంది
నత్త.

--------

పచ్చటి పొదలు:
ఒకటకి పోయా
లనిపించింది.

--------

జ్ఞాన వృక్షానికి
దిగిన ఊడలు-
గెడ్డాలకు నమస్కారం.

--------

గదిలో ఎండపొడ.
కాస్సేపు కన్ను తెరిచి
వెంటనే కన్ను మూసింది.

--------

నేనొక గబ్బిలాయిని.
పాత స్నేహాల చూర్లు
పట్టుకు వెళ్ళాడతాను.

--------

సముద్ర తీరం:
జనసంచారం మణిగాక
పీతల సంచారం.

--------

పులీ
కవీ-
ఎప్పుడూ పొంచి ఉంటారు.

--------

తేలిపోయే పడవ కింద
పొంచి చూసే
సముద్రపు కన్ను.

--------

పిట్టల్ని లెక్క పెట్టినా
చుక్కల్ని లెక్క పెట్టినా
ఒక్కటే.

--------

No comments:

Post a Comment