ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Sunday, November 11, 2012

సంజ నారింజ



తొలిసంజ నారింజ ఎవరు ఒలిచేరు
తెలియెండ తొనలను ఎవరు వంచేరు?
దినపు రేకలపై వాలెను
ఇనుని సీతాకోక చిలక.
పిట్టపాటలు నీడఊటలు
చెట్టులను చేరు కృశించి.
నీడ మహాప్రేమి, వీడ
లేడు గౌరాంగి గోడను,
చుట్టిన నిశ్శబ్దపు స్ప్రింగు
చూరుకింద చేరు కుక్క.
నీడ తొడిమ తొడుగుపువ్వు
వాడనడచు పిల్లనువ్వు.
అందమైన బుగ్గపైన
బ్రాంది చుక్క పిలిచింది,
డెందమందు చిందు రాగ
బిందువొకటి ఒలికింది.
గులకరాళ్ళ పిట్టలతో
కులుకు తరుశాఖ యేరు,
వొంగిన సాయంత్రపు
రంగుల ధనస్సు
విసిరే గాలిబాణం తతత
వీటికిమల్లే
శాంతిని చల్లే
ఎండచట్రంలో
వెండిపిల్ల.
నెత్తురంటిన రోడ్డుబాణం
ఎత్తుకపోతోంది ప్రాణం.
అయ్యయో జారుతోంది రోజనే అపరంజిపండు
నుయ్యేదీ చేదేదీ, అందుకో చేతైతే.
వెలుగునీడలల్లి ఇలచుట్టు వలపన్ని
విధిమీనమును పట్టు వీలైతే.
కాకినాడ
ఫిబ్రవరి, 1960

No comments:

Post a Comment