ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Sunday, November 11, 2012

వేయి పిర్రల సముద్రం



(స్మైల్‌ కి తత
ఈ పద్యం మీకిష్టం కనుక)
ఊగుతోంది వేయిపిర్రల సముద్రం
ప్రియా, నిర్ణిద్రం
లాగుతోంది స్మృతినౌకను ఉప్పాడకు
ప్రియా, నీ జాడకు
మొగ్గి చూస్తోంది రెప్పలేని కన్ను
ప్రియా, మిన్ను
సిగ్గు లేని సాగరం వర్తించు నగ్నంగా
ప్రియా, ఉద్విగ్నంగా
పాదుకొన్నాయి మనలో కడలిఊడలు
ప్రియా, మన నాడులు
ఈదు నిశ్శబ్దపు చేపలు రొదనిచీలుస్తో
ప్రియా, నను పిలుస్తో
నురుగులుకక్కే సాగరతీరాన
ప్రియా, రతీవరాన
విరగనితరగలం మనంమాత్రం
ప్రియా, విచిత్రం
ఎండ్రకాయల్ని తోలే ఏటవాలు సూర్యుడు
ప్రియా, అనార్యుడు
పండువంటి నీమేను స్పృశిస్తాడు
ప్రియా, కందిస్తాడు
అల్లుతోంది అలలపై చంద్రుని సాలీడు
ప్రియా, తనగూడు
అందుకో ఆహ్వానం ప్రవేశించు జాలంలో
ప్రియా, ఇంద్రజాలంలో
చుట్టుకుపోయిన నరాలతో
ప్రియా, కరాలతో
పెట్టుతోంది సంద్రం నిరంతరం రొద
ప్రియా, విను దానిసొద
చుట్టుకుపోయే శంఖాన్నడుగు
ప్రియా, ఎదనడుగు
చూరుకింద చుట్టుకునే హోరుగాలి చెప్పదా
ప్రియా, మనకథ విప్పదా
వేగలేను కడలిమ్రోల అహరహం
ప్రియా, నీ విరహం
ఊగుతోంది వేయిపిర్రల సముద్రం
ప్రియా, నిర్ణిద్రం.
కాకినాడ
23-9-1970

No comments:

Post a Comment