ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...
Showing posts with label హైకూలు. Show all posts
Showing posts with label హైకూలు. Show all posts

Thursday, January 19, 2012

వలసపాకల హైకూలు (12/12)

వెలుతురు చీపురు
వృక్షాగ్రాన్ని తుడిచింది :
కారు హెడ్ లైట్.
------
సాయంత్రపు కిటికీ :
సూర్యుడితో పాటు
అస్తమించింది.
------
రాత్రులు
వాన పడెల్లో
వెలుగు చిమ్మే కొత్త కిటికీలు.
------
కప్పల్లో కూడా
పార్టీలున్నాయి :
ఎవరి నినాదం వారిది !
------
మా ఆవిడ
నీలం చీర ఆరేస్తే
ఆకాశం మరింత నీలమెక్కింది.
------
సూర్యుని పిట్ట
అద్దాల కిటికీలో
చిక్కుకుంది.
------

Wednesday, January 18, 2012

వలసపాకల హైకూలు (11/12)

దీర్ఘ వర్షా సంధ్య :
ఈ చిన్ని సన్నజాజి పూవే
నాకు తోడు.
------
తెల్లారాక చూస్తే
మా ఇంటి ముందు
కొత్త చెరువు మొలిచింది.
------
రాత్రి వాన
మెత్తటి పదాలతో
నా నిద్రలోకి నడిచింది.
------
దొరువులు మబ్బులతోనూ
మబ్బులు కప్పల బెకబెకలతోనూ
నిండిపోయాయి.
------
వంట పాత్రలతో
కొత్త సంగీతం సృష్టిస్తున్నాడు
వంటింట్లో దూరిన పిల్లాడు.
------
రాత్రి హోరున వర్షం.
ఉదయం లేచి చూస్తే
ఎదురింటాయనకు రెండు మేడలు!
------

Monday, January 16, 2012

వలసపాకల హైకూలు (10/12)

హృదయం ఒక కుక్క :
ఆకాశానికి మొరెత్తి
రాత్రల్లా ఏడ్చింది.
------
ఇక్కడ బాట చీలింది.
ఏ బాటపైనా ఎవరూ లేరు :
ఎందుకు చీలినట్లు ?
-----
గుండె బీటలు పడితే
దిగుళ్ళు తప్ప
అన్నీ కారిపోతాయి.
------
మబ్బు పట్టిన సాయంత్రం
ఎదురింటి కిటికీలు మెరిసాయి :
సూర్య దర్శనం !
------
హటాత్తుగా వచ్చిన వాన
నా ఒళ్లో పిల్లాడి కళ్ళనీ
చెట్ల ఆకుల్ని మెరిపించింది.
------
ఊరంతా బురద :
సరీసృపంగా నన్ను సృజించనందుకు
దేముడికి కృతజ్ఞతలు.
------

Friday, January 13, 2012

వలసపాకల హైకూలు (9/12)

పాడటానికి
లంచ మడగలేదు
పిట్ట :
------
బొడ్డులో గరిమనాభి
తొణకదు, బెణకదు :
మా డైనింగ్ టేబుల్.
------
అప్పుడప్పుడూ కాంతిని
అధికంగా చీకటినీ
పంచుతోంది లైట్ హౌస్.
------
ఆకాశాన్ని,
పిట్టల పాటల్నీ
వడబోస్తోంది చెట్టు.
------
రెండు ఏకాంతాలు
కలిస్తే
పెళ్లి.
------
డాబా కింద పూలచెట్లు.
డాబాపై ఆరేసిన చీరలు :
ఎవరెవరికి అనుకరణ ?
------

Thursday, January 12, 2012

వలసపాకల హైకూలు (8/12)

నా లాగే
దాచుకోవటం తెలీదు :
అందుకే పగిలింది గ్లాసు.
------
వెల్లువలా
తెల్లారింది :
ప్రపంచం కొట్టుకొచ్చింది.
------
పక్షుల భాష
నేర్వాలంటే
పక్షిలా ఎగరాలి.
------
ఈ పిల్ల లిప్ స్టిక్ కి
మరింత ఎర్రబడింది
సంధ్య.
------
ఈ కాకి
రోజూ మా ఇంటికొస్తుంది :
పేరడగలేదు.
------
వాన వచ్చి
అన్నీ తలకిందులు చేసింది :
మెరిసే రోడ్డూ, నల్లటి నింగీ.
------

Tuesday, January 10, 2012

వలసపాకల హైకూలు (7/12)

కిటికీలో తొంగిచూసి
పలకరించే చెట్టుంది :
ఇంకెవరు కావాలి ?
------
గిల్టు ప్రేమ
పెచ్చులు పెచ్చులుగా
ఊడుతోంది.
------
తన రాక వినిపించి
తర్వాత కనిపిస్తుంది
పొద్దు.
------
కాంతిని తోసుకుంటూ
కారు చీకటిని కక్కుతూ
కారు ముందుకు సాగింది.
------
నూతి చుట్టూరా చెట్లు
నూతిలో ఆకాశం :
ఎప్పుడైనా చంద్రోదయం.
------
నిద్ర లేస్తూనే
నీళ్ళ గొంతుక వింటే
ఎంత హాయి.
------

Saturday, January 7, 2012

వలసపాకల హైకూలు (6/12)

మా ఇంటి ముందు
మగతాళ్ళూ, ఆడతాళ్ళూ :
ఇవి ఎలా ప్రేమించుకుంటాయి?
------
ఆషాడంలో రా.
మెరుపంచుల మబ్బుశాలువా
కప్పుతాను.
------
ఎంతకాలం ప్రయాణించినా
ఎడమెడం గానే :
ఆకాశంలో చుక్కల్లా.
------
ఆడదీ మగాడూ :
రెండే పాత్రలతో
ఎన్ని నాటకాలు !
------
వెన్నెలా
వెల్లగోడా :
ఒకర్ని మించి ఒకరు.
------
వర్షపు దారం :
ఇది తెగదు
దుఃఖంలా
------

Friday, January 6, 2012

వలసపాకల హైకూలు (5/12)

పాత స్మృతుల్ని రాల్చి
కొత్తవి తొడిగితే బావుణ్ణు :
చెట్టులా.
------
ఉదయించే చంద్రుడి బెలూన్ :
తాటిమోవ్వుకి తగిలి
పగుల్తుందని భయం.
------
ఎండకే
మెరుగు పెడుతుంది
వెల్లగోడ.
------
సందేహిస్తూ ఉదయిస్తాడు :
పిట్టల పాట విన్నాక
వెనెక్కి పోలేడు సూర్యుడు.
------
కిటికీ
ఎక్కడుంటే
అక్కడాకాశం.
------
పైన ఉరిమే మబ్బులు
కింద తరిమే సముద్రం :
మధ్య సన్నటి తెరచాప.
------

Thursday, January 5, 2012

వలసపాకల హైకూలు (4/12)

అర్ధరాత్రి చీకట్లో
కుక్కలు పలకరించుకుంటున్నాయి :
మనిషోక్కడే ఏకాకి.
------
సంజేవేళ :
పెరట్లో గేదెలు
చీకట్లో కరిగిపోయాయి.
------
లోకులతో కన్నా
తనతో తాను బతకడం
చాలా కష్టం.
------
తెల్లకాగితం చూస్తే జాలి.
కవిత్వమెక్కుతుందో
కిరాణా లిస్టు ఎక్కుతుందో .
------
తమ ప్రతిబింబాల్ని తాము
లంఘిస్తున్నారు జనం :
రోడ్డు నిండా పడేలు.
------
రాత్రికి
ఎన్నో దీపాలంకరణలు :
పగటికి సూర్యుడోక్కడే.
------

Monday, January 2, 2012

వలసపాకల హైకూలు (3/12)

కుక్క నన్ను చూసి
ప్రేమతో తోకూపింది :
నాకూ తోకుంటే బావుణ్ణు.
------
చీకట్లో మెరిసే
వింత కీటకం
ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ.
------
దేనికోసం బతకడం?
పూలనడిగి
తెలుసుకో !
------
కాకు లేగిరిపోయాయి
నల్లటి నిశ్శబ్దాన్ని
వదిలి.
------
పగలు కురిసిన వానకు
రాత్రి రోడ్డు
ఎం మెరిసిందని !
------
తన దీపం వెలిగించుకుని
కారు వెడుతోంది :
రెట్టింపు చీకటి వదుల్తూ.
------

వలసపాకల హైకూలు (2/12)

ఆకుల చాటున మినికే దీపం :
కాస్త వెలుగూ,
కాస్త చీకటీ.
------
బైట వాన
లోపల వాన :
విముక్తి లేదు.
------
కాకి ఆశాజీవి.
ఉదయం కాకమునుపే
ఉదయాన్ని ఆహ్వానిస్తుంది.
------
కప్పల బెక బెక :
వానలో తడిసిన
అనుభూతి.
------
చంద్రుడి నిండుసున్నా :
మనస్సులో దిగుళ్ళ పక్కన
సున్నాలు చేరుస్తుంది.
------
సంజెవేళ.
దీపాలు వెలిగించారు :
ఎవరి దీపం వారిది.
------

Saturday, December 31, 2011

(1/12) వలసపాక హైకూలు...

చంటాడి చిరునవ్వు
కొండంత ఏకాంతాన్ని
పటాపంచలు చేసింది.
-------
చీకటి పడ్డాకే
మల్లెలూ, దీపాలు
వికసిస్తాయి.
------
ఇద్దరికీ సంబరమే :
సముద్రపొడ్డున జనానికి,
జనాల ఒడ్డున సముద్రానికీ.
------
కాకి పిల్ల
నాకూ
ముద్దుగా వుంది.
------
ఇన్నాళ్ళకి
కప్పల బెక బెక
నిజమైన వర్షాకాలం.
------
ఊరినిండా తమాల ద్రుమాలు
ఐతే, రాధాకృష్ణుల బదులు
బ్యాంకుల క్లర్కులు.

Friday, December 30, 2011

తంకాలు

స్టేషన్ రద్దీలో
బెంచీపై కూచుని
ముసిలాల్లు ముచ్చటిస్తున్నారు.
ప్రవహించే ఏటిలో
ప్రవహించని నీడలు.

13.12.1998
------

గోడకు వేలాడతీసి
గడియారాన్ని బంధించాం.
అది కాలాన్ని బంధించింది.
కాలం మనల్ని
తిరిగి బంధించింది.

06.08.1989
------

ఈ బొగెన్ విలియా
ఎర్రటి నినాదాల్ని
విప్లవ కవిలా విరగబూసింది
ఐనా, ఒక్క పిట్టా
దీనిపై వాలదు.

31.03.1999
------

Thursday, December 29, 2011

ఆనంద యోగి

ఆనందం తనని ముంచెత్తితే
అది నాకు కాస్త పంచాలని
ఈ పాప
ఆడుతూ నా చుట్టూ
ఆనంద వలయం చుట్టింది :
ఇప్పు డీ గదిలో
ఇద్దరు ఆనంద యోగులు.

Wednesday, December 28, 2011

లాండ్రి

చల్లటి బల్బు కాంతిలో
తెల్లటి దుప్పట్లు పరిచిన
ఇస్త్రీ బల్లతో
మా వీధి చివర లాండ్రి
మాటి మాటికి నన్ను
ఆహ్వానిస్తోంది.

పాల తరకల దుప్పటితో
పలకరించే ఇస్త్రీ బల్లపై
పరిగెత్తుకుపోయి
పవ్వళించా లనుంటుంది.

అప్పుడు లాండ్రీ అతను
చప్పున నను సరిదిద్ది
నడతలో నా వంకర్లనీ
ముడతలు పడ్డ ఆలోచనల్నీ
ఇస్త్రీ పెట్టెతో రుద్ది
శాస్త్రీయంగా సాపు చేసి
నీటుగా నన్ను మడతపెట్టి
దీటుగా హేంగరుకు తగిలించి
మోసుకుపోయి నన్ను
మా ఆవిడ కప్పగించి
'ఇదిగో నమ్మా తీసుకో
ఇస్త్రీ చేసిన నీ భర్త' అంటే
ఎంత సంతోషిస్తుందో ఆమె,
ఇంతింతని చెప్పలేం.

పిల్లి

ఒకరు చెబితే వినను,
ఒకరికి చెప్పను,
మాటలు వ్యర్ధం,
మౌనం నా సంకేతం;
మూషికాల సంగతంటారా?
ముడుచుకుని, కళ్ళు
మూసుకు పడుకుని
కలల్లో పారాడే
ఎలకల్ని వేటాడటంలో
మాధుర్యం మీ కేం తెలుసు ?

కళ్ళల్లో కత్తులు

అరణ్యంలో వేటకై పొంచున్నది పులి
కాగితంపై కవితకై పొంచున్నాడు కవి :
కళ్ళల్లో సానబెట్టిన
కత్తుల మెరుపులు.

Monday, December 26, 2011

గాలి

చెట్టుకి తల నిండా పిట్టలు
రాత్రికి తల నిండా చుక్కలు :
నాకేమీ వద్దు ;
గాలిలా
రికామీగా ఎగురుతాను.

Sunday, December 25, 2011

నేను

నేను
సముద్ర ప్రియుణ్ణి :
సముద్ర ఘోషని
నత్తలా
నిత్యం
నా మూపున
ధరిస్తాను.

Saturday, December 24, 2011

పల్లెలో మా పాత ఇల్లు

మనుషులు మారిపోయారు,
మన్ను మాత్రం మారలేదు.
గోడ కూలిపోయాక
చెట్లు మొలిచాయి.
చెట్టుని వాటేసుకుని
పట్టు వదలని తీగ :
మా తాత గారి ఆత్మ !