ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Saturday, December 31, 2011

(1/12) వలసపాక హైకూలు...

చంటాడి చిరునవ్వు
కొండంత ఏకాంతాన్ని
పటాపంచలు చేసింది.
-------
చీకటి పడ్డాకే
మల్లెలూ, దీపాలు
వికసిస్తాయి.
------
ఇద్దరికీ సంబరమే :
సముద్రపొడ్డున జనానికి,
జనాల ఒడ్డున సముద్రానికీ.
------
కాకి పిల్ల
నాకూ
ముద్దుగా వుంది.
------
ఇన్నాళ్ళకి
కప్పల బెక బెక
నిజమైన వర్షాకాలం.
------
ఊరినిండా తమాల ద్రుమాలు
ఐతే, రాధాకృష్ణుల బదులు
బ్యాంకుల క్లర్కులు.

Friday, December 30, 2011

తంకాలు

స్టేషన్ రద్దీలో
బెంచీపై కూచుని
ముసిలాల్లు ముచ్చటిస్తున్నారు.
ప్రవహించే ఏటిలో
ప్రవహించని నీడలు.

13.12.1998
------

గోడకు వేలాడతీసి
గడియారాన్ని బంధించాం.
అది కాలాన్ని బంధించింది.
కాలం మనల్ని
తిరిగి బంధించింది.

06.08.1989
------

ఈ బొగెన్ విలియా
ఎర్రటి నినాదాల్ని
విప్లవ కవిలా విరగబూసింది
ఐనా, ఒక్క పిట్టా
దీనిపై వాలదు.

31.03.1999
------

Thursday, December 29, 2011

ఆనంద యోగి

ఆనందం తనని ముంచెత్తితే
అది నాకు కాస్త పంచాలని
ఈ పాప
ఆడుతూ నా చుట్టూ
ఆనంద వలయం చుట్టింది :
ఇప్పు డీ గదిలో
ఇద్దరు ఆనంద యోగులు.

Wednesday, December 28, 2011

లాండ్రి

చల్లటి బల్బు కాంతిలో
తెల్లటి దుప్పట్లు పరిచిన
ఇస్త్రీ బల్లతో
మా వీధి చివర లాండ్రి
మాటి మాటికి నన్ను
ఆహ్వానిస్తోంది.

పాల తరకల దుప్పటితో
పలకరించే ఇస్త్రీ బల్లపై
పరిగెత్తుకుపోయి
పవ్వళించా లనుంటుంది.

అప్పుడు లాండ్రీ అతను
చప్పున నను సరిదిద్ది
నడతలో నా వంకర్లనీ
ముడతలు పడ్డ ఆలోచనల్నీ
ఇస్త్రీ పెట్టెతో రుద్ది
శాస్త్రీయంగా సాపు చేసి
నీటుగా నన్ను మడతపెట్టి
దీటుగా హేంగరుకు తగిలించి
మోసుకుపోయి నన్ను
మా ఆవిడ కప్పగించి
'ఇదిగో నమ్మా తీసుకో
ఇస్త్రీ చేసిన నీ భర్త' అంటే
ఎంత సంతోషిస్తుందో ఆమె,
ఇంతింతని చెప్పలేం.

పిల్లి

ఒకరు చెబితే వినను,
ఒకరికి చెప్పను,
మాటలు వ్యర్ధం,
మౌనం నా సంకేతం;
మూషికాల సంగతంటారా?
ముడుచుకుని, కళ్ళు
మూసుకు పడుకుని
కలల్లో పారాడే
ఎలకల్ని వేటాడటంలో
మాధుర్యం మీ కేం తెలుసు ?

కళ్ళల్లో కత్తులు

అరణ్యంలో వేటకై పొంచున్నది పులి
కాగితంపై కవితకై పొంచున్నాడు కవి :
కళ్ళల్లో సానబెట్టిన
కత్తుల మెరుపులు.

Monday, December 26, 2011

గాలి

చెట్టుకి తల నిండా పిట్టలు
రాత్రికి తల నిండా చుక్కలు :
నాకేమీ వద్దు ;
గాలిలా
రికామీగా ఎగురుతాను.

Sunday, December 25, 2011

నేను

నేను
సముద్ర ప్రియుణ్ణి :
సముద్ర ఘోషని
నత్తలా
నిత్యం
నా మూపున
ధరిస్తాను.

Saturday, December 24, 2011

పల్లెలో మా పాత ఇల్లు

మనుషులు మారిపోయారు,
మన్ను మాత్రం మారలేదు.
గోడ కూలిపోయాక
చెట్లు మొలిచాయి.
చెట్టుని వాటేసుకుని
పట్టు వదలని తీగ :
మా తాత గారి ఆత్మ !

20 of 20

బాజాలు బాత్తున్నారు.
తన గతీ అంతేనని తెలీని పెళ్ళికొడుకు
సంబరంగా తాళి కడుతున్నాడు.
------
టేబుల్ మీదుంచిన కొత్త ఫ్లవర్ వాజ్
గదిని శాసిస్తోంది.
ఇది నా గదేనా ?
------
రాబోయే వాని కన్న
గడిచిపోయినవి నా కిష్టం.
అందుకే రైల్లో వెనెక్కి తిరిగి కూచుంటాను.
------
కరెంటు పోయిందని
కొవ్వొత్తి వెలిగించిం దీవిడ.
కొవ్వొత్తి వెలుతురులో కొత్తందాలు.
------
అర్దరాత్రి వేళ
కప్పల నిశ్శబ్దానికి
హటాత్తుగా మెలకువొచ్చింది.
------

Thursday, December 22, 2011

19 of 20

ఒంటరి బాటపై
ఒంటరి చంద్రుడు
ఒకరి ఒంటరితనాన్ని ఒకరు హెచ్చవేస్తూ.
------
పాప నన్ను చూసి సిగ్గుపడి
అడ్డున్న గౌను కాస్తా ఎత్తి
మొహం కప్పుకుంది.
------
గోడెక్కి పిలుస్తుంది
పొరుగు చెట్టు క్కాసిన పువ్వు.
కోస్తే ఎవరి తప్పు ?
------
ఈ చెట్టు కింద రోజూ నిలబడతాను.
చెట్టుకి నా పేరు తెలుసా ?
నేను దాని పేరడిగానా ?
------
చిలకని పంజరంలో బంధిస్తే
అడివిని తన కూడా తెచ్చుకుంది.
ఇల్లంతా జామకాయల వాసన.
------

Wednesday, December 21, 2011

18 of 20

దుప్పటి కప్పుకోకపోతే
దోమల బాధ,
కప్పుకుంటే ఉక్క.
------
నా ఫోటో
నా కన్యాయం చేస్తుందని
నా కనుమానం !
------
రోడ్డు మీద ఆంబోతు తిష్టవేసింది.
పక్కనే ట్రాఫిక్ నడుపుతూ
ట్రాఫిక్ పోలీసు.
------
పెందలాడే నిద్దరోయి
పొద్దెక్కి లేస్తారు.
పిల్లల్ని చూస్తే నా కసూయ.
------
పిల్లి
రాత్రంతా రాసక్రీడలాడి వచ్చి
తలుపు తెరవమని గీరుతుంది.
------
చిల్లక్కి మా ఆవిడ మాటలు నేర్పుతుంది.
ఇప్పుడు మా ఇంట్లో
రెండు చిలకలు.
------

Tuesday, December 20, 2011

17 of 20

నీలాకాశ మంతా ఈది
ఇంకా తెల్లగానే వున్నాయి
తెల్ల కొంగలు.
------
బోటుని
దాని నీడకి కట్టేసి
పడవ సరంగు ఎటో పోయాడు.
------
పిట్టలు ఎగిరాక గాని
కళ్ళెంలో
పిట్టలు వాలినట్లు తెలీదు.
------
పౌర్ణమి చంద్రుణ్ణి
ఒక్కొక్కచెట్టుకు వేలాడదీస్తూ
తోటంతా తిరిగాను.
------
మన ల్నింతగా అలరించే పక్షులు
పక్షులుగా నటించడానికి
ఎంత కిరాయి తీసుకుంటున్నాయి ?
------
దుప్పటి కప్పుకోకపోతే
దోమల బాధ,
కప్పుకుంటే ఉక్క.
------

Monday, December 19, 2011

16 of 20

ఈ బాట మీద
ఎవ్వరూ నడవగా చూడలేదు
ఇదిక్కడికి ఎలా వచ్చింది ?
------
ఈ ఊళ్ళో
తాటిచెట్లు కూడా
వంకరే !
------
పిల్లి నిశ్చింతగా పడుకుంది.
దానికి తెలుసు
లేవగానే ఆహారం పంపిస్తాడని
పిల్లుల దేవుడు !
------
గొడుగులా ముడుచుకుని
ఎండాకాల మంతా
నిద్ద రోగలిగితే బాగుణ్ణు.
------
ఈ దేశంలో
నా కర్ధ మయేది
పక్షుల భాష ఒక్కటే
------
దుమ్ముతో చెట్లూ,
టీ కొట్టూ ఎర్రబడ్డాయి.
ఈ కూడా అదే రంగు.
-----

Sunday, December 18, 2011

15 of 20

కొత్త కోక కట్టు కొచ్చింది
సీతాకోక చిలక.
శ్రావణ మాసం కదా.
------
బుల్లోది బుల్లికాయ
బుల్లి చంద్రుడు.
రాత్రి దుప్పటి సరిగా తడవలేదు.
------
పొగచూరిన చిమ్నీలో
చిక్కుపడిన దీపశిఖ
పంజరంలో పక్షి.
------
పొద్దున్న లేస్తూనే
ఫర్నీచరునీ నన్నూ కలిపి
పాలిష్ చేస్తుంది మా ఆవిడ !
------
సూర్యుడు అస్తమిస్తుంటే
గుళ్ళో గంటలు
మేల్కొన్నాయి.
------
అలల చేత తాపులు తింటోంది
సముద్ర పొడ్డున ఒకే బండ
తోటి బండ లేమయాయి ?
------
ఆకాశంలో మునకవేసి
మరింత నీలంగా వాలింది
పాలపిట్ట.
------
అల్లరి చేసి, ఆపి,
తోచక తిరిగి అల్లరి చేస్తున్నాడు
ఒంటరి పిల్లాడు.
------
పిల్లి నా పక్క మీద
గాఢ నిద్ర పోతోంది.
దీన్నెలా లేపను!
------

Saturday, December 17, 2011

15 of 20

నిన్న రాత్రి
ఎంత వెన్నెల కాసింది !
కాకులు కూడా నిద్ర పోలేదు.
------
పడుకునే ముందు పిల్లలు
దెయ్యాల కధలు చెప్పుకుని
ఒకర్నొకరు భయపెట్టుకున్నారు.
------
కప్పలకి కీచురాళ్ళకి
సంగీత పోటీ !
వర్షా సంధ్య.
------
మా ఇంటికి
పేరంటాని కొచ్చింది కప్ప పిల్ల.
వాన లోచ్చిన సంబరం.
------
గోడ కూలిపోయింది.
చంద్రోదయం
ఎంచక్కా చూడొచ్చు ఇక మీదట.
------
చెట్టు కింద
సగం కొరికిన జామి పిందెలు.
పైకి చూస్తే చెట్టు నిండా చిలకలు.
------
జ్ఞాన ముద్రలో కూచున్న
బుద్ధుడు.
బోదురు కప్ప.
------
ఇంత వెన్నెల కాస్తున్నా
కాకి
నల్లగా అరుస్తోంది.
------
సముద్రం ఆవేశపడుతుంటే
నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది :
సాగరసంగమం.
------

14 of 20

వెన్నెట్లో మెరిసిన
కొబ్బరి ఈనెలు
ఇల్లు ఊడుస్తున్నా ఇప్పుడు.
------
చెట్టు మీంచి పిట్టపాట
చెట్టంతా వెతికాను.
పిట్ట కనిపించదు.
------
నీళ్ళ నిండా మబ్బు పింజెలు.
లంకల నిండా రెల్లు దుబ్బులు.
గొదావ రంతా తెల్లబడింది.
------
పిట్టల్ని తోలమని
పాపని కాపలా పెడితే
కాకుల్తో స్నేహం చేస్తోంది.
------
కొబ్బ రాకులికీ
పిల్లల ఆటలకీ
వెన్నెల మెరుగుపెట్టింది.
-------
చీకట్లో పట్టాలు మెరుస్తున్నాయి.
రైలొచ్చి,ఆగి,వెళ్ళింది.
తిరిగి పట్టాలు మెరుస్తున్నాయి.
------

Thursday, December 15, 2011

13 of 20

వాన కురుస్తున్న చప్పుడికి
ఒళ్ళు పులకరించింది
వాన కాదు, కొబ్బరాకుల్లో గాలి.
------
చీకటి స్టేషన్ లో రైలాగింది.
రైలు వెళ్ళాక మళ్ళి చీకటి.
స్టేషను పేరు తెలియదు.
------
రకరకాల శబ్దాలు
చేస్తోంది వాన.
ఏ మంటుందో తెలీదు.
------
మూల పడివుంది గొడుగు.
వానలోస్తే కాని
ఇది వికసించదు.
------
లాంతరు వెలుతుర్లో
పాప చదువుకుంటోంది
ఎవరు ఎవర్ని వెలిగిస్తున్నారు ?
------
కొండెక్కుతుంటే
తలకిందులుగా
కోయిల కూత.
------

Wednesday, December 14, 2011

12 of 20

మెట్ల పెదిమలపై
మెల్లగా విస్తరిస్తూ
వెన్నెల చిరునవ్వు
------
కాకినాడ ఆకాశంలో
విరిసింది సంజగులాబీ.
నగరవాసులే దీనికి ముళ్ళు.
------
మామిళ్ళు పూచాయి.
తోపు నిండా, కాపు తల నిండా
తుమ్మెద ఝంకారం.
------
వేసవి రాత్రులు వచ్చాయి.
చుక్కలు లెక్కిస్తూ
నిద్రలోకి జారుకోవచ్చు.
------
లక్ష నక్షత్రాలతో
గ్రీష్మ నిశీధాలు
నా పై ప్రవహించి పోనీ !
------
వేసవి రాత్రి.
ఆరుబైట ఎన్ని పక్కలు
ఆకాశంలో ఎన్ని చుక్కలు
------

11 of 20

కొబ్బరాకుల కొనలు
గాలి తలని దువ్వుతుంటే
నా కళ్ళు నిద్రజోగాయి
------
పదును బెట్టిన అంచుతో
తహ తహ లాడుతున్నాడు చంద్రుడు.
ఒక్క మబ్బుతునకా కనిపించదేం ?
------
వేసవి వచ్చింది కాని
కోయిల రాలేదు;
ఎండలకి విరుగుడేమిటి ?
------
ఆకాశం నిండా మబ్బు నురగలు
అరిగిపోయిన సబ్బు బిళ్ళ
అడుగున చంద్రుడు.
------
కాంతి పూర్తిగా ఎండిపోయినా
పస్చిమాకాశాన్ని వదలని
సూర్యుడి అవశేషం.
------
కొబ్బరాకుల్లో చిక్కుకున్న చంద్రబింబం.
ప్రియురాలి తలపోతలో ప్రియుడు.
ఎవరు ఎవర్ని వెలిగిస్తారు ?
------

Tuesday, December 13, 2011

10 of 20

తాచుపాములా మెలికలు తిరుగుతూ
రైలుబండిని తరుముతూ వచ్చి
కాలవలో దుమికింది బాట.
-----
తెల్లారకట్ట
చీకటి నోరు తెరిచింది.
కాకిపిల్ల.
------
అర్దరాత్రి వరకు వేచి
చంద్రవీర్యం పడగానే
పులకరించి పోయింది బావి.
------
టెలిగ్రాఫు తీగల మీద పిట్టలు.
కొన్ని ఎడమొహం, కొన్ని పెడమొహం.
చివరకి తీగలు మిగిలాయి.
------
ఎర్ర పిర్రల కోతులు గెంతుతున్నాయి .
నీ పిర్రలు ఎర్రబడితే
నువ్వూ గెంతుతావు.
------
బట్టల్ని ఉతికి ఆరేశారు.
ఎంత ఉజ్జ్వలంగా వుందో ప్రపంచం !
నా మనస్సు కూడా ఉతుక్కు పడినట్టుంది.
------

Monday, December 12, 2011

9 of 20

రైల్లో తిరిగొస్తుంటే
టెలిగ్రాఫ్ తీగలతో ఊగి ఊగి
కళ్ళు నిద్దరజోగాయి.
------
కోవెల గోపురం
కోనేట్లో
కుబుసం విడిచింది.
------
దారి పొడుగుతా
రైలు చక్రాలు
నీ పేరే ఉచ్చరించాయి.
------
వాన జల్లుకి
వంద గొడుగులు
వెంటనే వికసించాయి.
------
కబుర్లాడుతూ కూచున్నాం సాయంత్రం వేళ
క్రమంగా చీకటి పడింది.
నీ మోహ మొక్కటే మెరుస్తూ చీకట్లో.
------
పక్షు లెగిరిపోయాక రాత్రి
నక్షత్రాలని చేరదీస్తుంది
చెట్టు.
------

Saturday, December 10, 2011

8 of 20

ముందు మనస్సునీ
ఆ వెనక గదినీ
తర్వాత విశ్వాన్ని ఆవరించింది చీకటి.
------
కిలకిల మంటూ బడిలో పిల్లలు.
పిట్ట లన్నిటికీ ఒకే పాట నేర్పాలని
పట్టు పట్టిన మేష్టారు.
------
చెరువు.
చెరువులో ప్రతిబింబాలు.
వాటిని అనుసరిస్తూ గట్టుపై చెట్లు.
------
తలకి మబ్బూ
కాళ్ళకి సరస్సూ తోడుక్కోకపోతే
కొండ కొండే కాదు.
------
చెరువు లేకపోతే
చెట్ల నీడల్ని
ఎవరు చేరదీస్తారు ?
------
తెల్లారు ఝాము రైలు
తూర్పు దిగంతాన్ని చీలుస్తుంది.
అప్పుడు బైటపడతాడు సూర్యుడు.
------

Friday, December 9, 2011

7 of 20

తెల్లారుజాము నిద్దట్లో
రైలో, గేదో అరుస్తుంది.
లేస్తూనే పాలు సిద్దం.
------
పౌర్ణమి చంద్రుడు,
ఊరంతా వెన్నెల.
నిండుకుండ తోనక దంటా రేమిటి ?
------
నువ్వెళ్ళి పోయాక
అన్నీ అలాగే వున్నాయి, ఏమి మారలేదు.
అదే నా బాధ.
------
పిల్లి తోకకీ
పిల్లలకీ ఏమిటి ఆకర్షణ ?
పిల్లి తో కాడిస్తోంది.
------
రోము నగరాన్నించి
బొమ్మ పోస్టుకార్డు పంపించాడు మిత్రుడు.
ఈ వీధుల్లో ఎక్కడో తప్పిపోయినట్టున్నాడు.
------
ఇద్దరు చంద్రులతో
ఇంటికి తిరిగొచ్చా నివాళ సాయంత్రం.
ఆకాశంలో ఒకడు, కాలవలో ఒకడు.
------

Thursday, December 8, 2011

6 of 20

సీతాకోక చిలకలా
ఎగరటం నేర్చుకుంటాను ;
అన్ని దిక్కులకి ఒకేసారి.
------
కోనేట్లో దేవాలయ గోపురం
కలచకండి నీళ్ళని, జాగ్రత్త :
గోపురం కూలిపోగలదు.
------
ఊరు నిద్ద రోయాక
చెరువు మేల్కొంది.
తరువాత ఎవరికీ నిద్ర లేదు.
------
కోడి పుంజుల్ని
కోసుకు తినేసారు మా ఊరివాళ్ళు.
ఇక తెల్లారకట్ట రైలు మిగిలింది.
------
కాళ్ళకి కాళ్ళు తొడుక్కుని
నీళ్ళలో నించున్నాడు కుర్రాడు.
రెండు మొహాల్లోనూ ఆశ్చర్యం.
------
వీధి పొడుగునా
పిల్లంగోవి కిటికీలు,
ఒక కిటికీలో అమ్మాయి మొహం.
------

5 of 20

తన నీడని నిత్యం చూసుకుంటూ బతకమని
బోటుని గట్టుకు కట్టేయటం
ఎంత క్రూర శిక్ష !
------
వీధి గోడలకి
వెన్నెలంటే ఎంత ప్రేమో !
వెన్నెట్లో మెరిసిపోని గోడ వుందా ?
------
ఎర్రగా మండే ఎండాకాలంలో
ఈ గుల్ మొహర్ మంట లేమిటి !
మంటకి మంటే మందు.
------
పటిక బెల్లం తింటుంటే
పాప చూసి, ఆగింది
డానికి పెట్టాక ఇంకా తీపెక్కింది బెల్లం.
------
అర్దరాత్రి రైలు కిటికీలో
అకస్మాత్తుగా
చంద్రోదయం.
------
ఒక రాత్రి వేళ
సెలయేరు గలగల మంది.
ఎక్కడో కొండల్లో కురిసిన వర్షం.
------

Tuesday, December 6, 2011

4 of 20

ప్రపంచమంతా తిరిగాను కాని,
అంతరంగం అక్కడే వుంది.
సందె దీపమూ, అమ్మ పిలుపూ.
------
కొబ్బరాకుల మీద
వెన్నెల
పళ్ళిగిలించింది.
------
ఓరకంట చూసి
కాకి ఎగిరిపోయింది.
ఎందుకు చెప్మా !
------
చీకట్లో
మైళ్ళ కొద్దీ నడిచాక
అకస్మాత్తుగా చంద్రోదయం.
------
పసుపు రంగు దుస్తుల్తో
సైకిళ్ళు తొక్కుతూ ముగ్గురమ్మాయిలు.
బజారంతా చేమంతి తోట.
------
ఊపిరాడని వేసవి మధ్యాహ్నం
కోయిల కూసి
వాతావరణం మార్చేసింది.
------

Monday, December 5, 2011

3 of 20

విడవలేక, విడవలేక
విడవలేక వాన బొట్టు
చూరును విడిచింది.
------
కాజీపేట నించి కాకినాడ దాకా
ఒకటే వాన; దారిపొడుగునా
భూమ్మీద ఆరేసిన పాత ఆకాశాలు.
------
పచ్చిక మొలిచి
బాటని కప్పేసింది;
మళ్ళి ఎన్ని వందల కాళ్ళవసరమో !
------
ఒకమ్మాయి మెడ తిప్పి
ఎవర్నో చూసే నవ్వుతుంది.
ఆ 'ఎవరో' నేనైతే ఎంత బావుణ్ణు.
------
నువ్వెళ్ళి తొంగి చూస్తే
వానాకాలం బావి
జూమ్లెన్స్ తో ఫోటో తీస్తుంది.
------
ఎవరి కోసం వర్షిస్తాయి మేఘాలు,
పిల్లల కోసం కాకపోతే.
గొడుగులడ్డు పెట్టుకునే వాళ్ళ కోసమా ?
------

Saturday, December 3, 2011

2 of 20

వాన బ్రష్షు వచ్చి
ఆకాశాన్ని, చెట్టునీ, రోడ్డునీ,
రంగులు పులిమేసింది.

చేతనైనంత మట్టుకు
చిరువానల్ని సృష్టిస్తున్నారంతా,
చివరకి కాకి కూడా.

వాన వెలిశాక
మైదానం నిండా నీటి పడేలు,
పడేల్లో గెంతుతూ పిల్లల్లూ, మబ్బుపింజెలూ.

కొలనులోకి రాయి విసిరా రెవరో.
అలలు ఇంకా వ్యాపిస్తూనే వున్నాయి.
రాయేదీ ?

కొండ మీది కర్రి మబ్బూ
దండెం మీది కాకీ
రెక్కలు తెగ దులుపుకుంటున్నాయి.

దుకాణానికి వెళ్లి చిక్కుకున్నాను,
చినుకు దారాలతో వర్షం నన్ను
పొట్లం కట్టి పడేసింది.

Friday, December 2, 2011

1 of 20

వానలోచ్చాయి, నువ్వు రాలేదు.
రాత్రి తెల్లార్లూ
కప్పల బెకబెక.

కాలవ బలిసింది.
తన విధులు మరిచిపోయింది :
వంతెనకు నీడ చూపించటం లేదు.

కీచురాయి చప్పుడు తో
గదంతా నిండిపోయింది.
గదిలో నాకు చోటు లేదు.

..."కప్పల నిశ్శబ్దం" పుస్తకం నుంచి