ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Friday, January 27, 2012

శ్రీనివాస్ రాయప్రోలు గారి రచన - "ఈ పద్యం"

ఆడదాని అగూచర మర్మత్వం గురించి మాట్లాడను.
భగవంతుని దివ్య విగ్రహం గురించి కూడా మాట్లాడను –
ప్రేమ గురించీ, ప్రజల గురించీ మాట్లాడను –
నా గురించి అడిగేవా రెవరూ నాకు లేరు,
నా అవ్యక్తతో నే నేవర్నీ చేరుకోలేకపోయాను.
నా నాలుక దాటని, నా అసంతృప్తుల్ని తృప్తిపరచని
ఎకాంత శబ్దం గురించి మాట్లాడతాను.

ఈ శబ్దాని కవతల ఇంకా విషయా లున్నాయి.
నాకు తెలుసు –
పెరిగే కిరాణా కాతా, లేచే బజారు ధరలూ
నా సమయాన్ని, మనశ్శాంతినీ మింగేస్తాయి.
కాగితం పైన వాలక మునుపే
నా వ్యక్త భావాల్ని తన్నుకు పోతాయి.

ఇదీ నాకు తెలుసు –
ప్రేమే సర్వమని,
సత్యం, సుందరం, ఆత్మిక విలవలూ
నా కంకాళాన్ని దాటి జీవిస్తాయనీ.

నా ఏకాంత ఆత్మ సహాయంతో
మేజా మీది నారింజ అందాన్ని
పద్యంలో తేలే శబ్దం రామణీయకాన్ని
మాత్రమే చూస్తాను.

Thursday, January 26, 2012

శ్రీనివాస్ రాయప్రోలు గారి రచన - "ఎభైయో పడి సమీపించాక"


చాలా తోవ గడిచింది,
జీవిత మంటే కాస్త
అర్ధమైంది.

కాస్త చదివాను
కాస్త చూసాను
ప్రతీదీ

కాస్త అనుభవించాను.
కానీ, నిజంగా
నా కేమీ తెలీదు.

వృత్తం చుట్టి
మొదటికే
వచ్చాను.

కానీ, పసితనపు అద్భుతం
మళ్ళీ అందుకోలేకపోయాను.

Monday, January 23, 2012

శ్రీనివాస్ రాయప్రోలు గారి రచన - "దీపావళి రోజు"


వీళ్ళిద్దరూ
ఇంట్లో కూచునుంటారు
వీళ్ళిద్దరి మధ్యా
మాటామంతీ ఉండదు.
ఒకరికి వినిపించదు
ఒకరికి కనిపించదు.

రాలిపోయే ముందు
చెట్ల ఆకుల్లా
అల్లల్లాడుతూ
మా నాన్నా, అమ్మా.
వాళ్ళని ఒంటరిగా
వదిలేశాం.

పండగ రోజు
కొదుకులూ, కూతుళ్ళూ,
కోడళ్ళూ, మనమలూ,
అందరూ పోగవుతారు
ఆడవాళ్ళు వడ్డిస్తే
మగవాళ్ళు విందు గుడుస్తారు.

ఊసుపోక కబుర్లు తప్పించి
చెప్పుకోటాని కేమీ వుండదు.
కానీ, అందరికీ మనస్సులో
నేరభావమేదో కెలుకుతుంది.

కేరింతాలతో, కయ్యాలతో
పిల్లలకు గడిచిపోతుంది.

అమ్మా, నాన్నలకు మాత్రం
పిల్లల్నీ, మనమల్నీ చూసి
కళ్ళు బాష్పాలతోనూ
గుండెలు సంతృప్తి తోనూ
నిండిపోతాయి.
పెరట్లో మామిడి చెట్టు
పిట్టలతో నిండిపోతుంది.

సాయంత్ర మయాక
అంతా సెలవు తీసుకుంటారు.
మా గుండెలు
శూన్యంతో నిండిపోతాయి.
రేపటి సంగతి వేరు.
గోడల కేసి,
గోడల మీద పటాల కేసి చూస్తూ
ఒకరి కొకరు తోడుగా
ముసిలి వాళ్ళిద్దరూ
మిగిలిపోతారు చివరికి.

Sunday, January 22, 2012

శ్రీనివాస్ రాయప్రోల్ గారి రచన - "పద్యం"


మన దేశంలో
ఆడవాళ్ళు

ముసలి వాళ్లయే
పద్ద తొకటుంది

మచ్చుకి
మా అమ్మ.

గిన్నెలో పులుసు
కలియబెడుతూ

వందేళ్ళు
పొయ్యిముందు కూచుంది.

అప్పు డప్పుడూ
పెరట్లో వేపచెట్టుకేసి చూస్తూ

వందేళ్ళు
వంటగది గోడల మధ్య.

Thursday, January 19, 2012

వలసపాకల హైకూలు (12/12)

వెలుతురు చీపురు
వృక్షాగ్రాన్ని తుడిచింది :
కారు హెడ్ లైట్.
------
సాయంత్రపు కిటికీ :
సూర్యుడితో పాటు
అస్తమించింది.
------
రాత్రులు
వాన పడెల్లో
వెలుగు చిమ్మే కొత్త కిటికీలు.
------
కప్పల్లో కూడా
పార్టీలున్నాయి :
ఎవరి నినాదం వారిది !
------
మా ఆవిడ
నీలం చీర ఆరేస్తే
ఆకాశం మరింత నీలమెక్కింది.
------
సూర్యుని పిట్ట
అద్దాల కిటికీలో
చిక్కుకుంది.
------

Wednesday, January 18, 2012

వలసపాకల హైకూలు (11/12)

దీర్ఘ వర్షా సంధ్య :
ఈ చిన్ని సన్నజాజి పూవే
నాకు తోడు.
------
తెల్లారాక చూస్తే
మా ఇంటి ముందు
కొత్త చెరువు మొలిచింది.
------
రాత్రి వాన
మెత్తటి పదాలతో
నా నిద్రలోకి నడిచింది.
------
దొరువులు మబ్బులతోనూ
మబ్బులు కప్పల బెకబెకలతోనూ
నిండిపోయాయి.
------
వంట పాత్రలతో
కొత్త సంగీతం సృష్టిస్తున్నాడు
వంటింట్లో దూరిన పిల్లాడు.
------
రాత్రి హోరున వర్షం.
ఉదయం లేచి చూస్తే
ఎదురింటాయనకు రెండు మేడలు!
------

Monday, January 16, 2012

వలసపాకల హైకూలు (10/12)

హృదయం ఒక కుక్క :
ఆకాశానికి మొరెత్తి
రాత్రల్లా ఏడ్చింది.
------
ఇక్కడ బాట చీలింది.
ఏ బాటపైనా ఎవరూ లేరు :
ఎందుకు చీలినట్లు ?
-----
గుండె బీటలు పడితే
దిగుళ్ళు తప్ప
అన్నీ కారిపోతాయి.
------
మబ్బు పట్టిన సాయంత్రం
ఎదురింటి కిటికీలు మెరిసాయి :
సూర్య దర్శనం !
------
హటాత్తుగా వచ్చిన వాన
నా ఒళ్లో పిల్లాడి కళ్ళనీ
చెట్ల ఆకుల్ని మెరిపించింది.
------
ఊరంతా బురద :
సరీసృపంగా నన్ను సృజించనందుకు
దేముడికి కృతజ్ఞతలు.
------

Friday, January 13, 2012

వలసపాకల హైకూలు (9/12)

పాడటానికి
లంచ మడగలేదు
పిట్ట :
------
బొడ్డులో గరిమనాభి
తొణకదు, బెణకదు :
మా డైనింగ్ టేబుల్.
------
అప్పుడప్పుడూ కాంతిని
అధికంగా చీకటినీ
పంచుతోంది లైట్ హౌస్.
------
ఆకాశాన్ని,
పిట్టల పాటల్నీ
వడబోస్తోంది చెట్టు.
------
రెండు ఏకాంతాలు
కలిస్తే
పెళ్లి.
------
డాబా కింద పూలచెట్లు.
డాబాపై ఆరేసిన చీరలు :
ఎవరెవరికి అనుకరణ ?
------

Thursday, January 12, 2012

వలసపాకల హైకూలు (8/12)

నా లాగే
దాచుకోవటం తెలీదు :
అందుకే పగిలింది గ్లాసు.
------
వెల్లువలా
తెల్లారింది :
ప్రపంచం కొట్టుకొచ్చింది.
------
పక్షుల భాష
నేర్వాలంటే
పక్షిలా ఎగరాలి.
------
ఈ పిల్ల లిప్ స్టిక్ కి
మరింత ఎర్రబడింది
సంధ్య.
------
ఈ కాకి
రోజూ మా ఇంటికొస్తుంది :
పేరడగలేదు.
------
వాన వచ్చి
అన్నీ తలకిందులు చేసింది :
మెరిసే రోడ్డూ, నల్లటి నింగీ.
------

Tuesday, January 10, 2012

వలసపాకల హైకూలు (7/12)

కిటికీలో తొంగిచూసి
పలకరించే చెట్టుంది :
ఇంకెవరు కావాలి ?
------
గిల్టు ప్రేమ
పెచ్చులు పెచ్చులుగా
ఊడుతోంది.
------
తన రాక వినిపించి
తర్వాత కనిపిస్తుంది
పొద్దు.
------
కాంతిని తోసుకుంటూ
కారు చీకటిని కక్కుతూ
కారు ముందుకు సాగింది.
------
నూతి చుట్టూరా చెట్లు
నూతిలో ఆకాశం :
ఎప్పుడైనా చంద్రోదయం.
------
నిద్ర లేస్తూనే
నీళ్ళ గొంతుక వింటే
ఎంత హాయి.
------

Saturday, January 7, 2012

వలసపాకల హైకూలు (6/12)

మా ఇంటి ముందు
మగతాళ్ళూ, ఆడతాళ్ళూ :
ఇవి ఎలా ప్రేమించుకుంటాయి?
------
ఆషాడంలో రా.
మెరుపంచుల మబ్బుశాలువా
కప్పుతాను.
------
ఎంతకాలం ప్రయాణించినా
ఎడమెడం గానే :
ఆకాశంలో చుక్కల్లా.
------
ఆడదీ మగాడూ :
రెండే పాత్రలతో
ఎన్ని నాటకాలు !
------
వెన్నెలా
వెల్లగోడా :
ఒకర్ని మించి ఒకరు.
------
వర్షపు దారం :
ఇది తెగదు
దుఃఖంలా
------

Friday, January 6, 2012

వలసపాకల హైకూలు (5/12)

పాత స్మృతుల్ని రాల్చి
కొత్తవి తొడిగితే బావుణ్ణు :
చెట్టులా.
------
ఉదయించే చంద్రుడి బెలూన్ :
తాటిమోవ్వుకి తగిలి
పగుల్తుందని భయం.
------
ఎండకే
మెరుగు పెడుతుంది
వెల్లగోడ.
------
సందేహిస్తూ ఉదయిస్తాడు :
పిట్టల పాట విన్నాక
వెనెక్కి పోలేడు సూర్యుడు.
------
కిటికీ
ఎక్కడుంటే
అక్కడాకాశం.
------
పైన ఉరిమే మబ్బులు
కింద తరిమే సముద్రం :
మధ్య సన్నటి తెరచాప.
------

Thursday, January 5, 2012

వలసపాకల హైకూలు (4/12)

అర్ధరాత్రి చీకట్లో
కుక్కలు పలకరించుకుంటున్నాయి :
మనిషోక్కడే ఏకాకి.
------
సంజేవేళ :
పెరట్లో గేదెలు
చీకట్లో కరిగిపోయాయి.
------
లోకులతో కన్నా
తనతో తాను బతకడం
చాలా కష్టం.
------
తెల్లకాగితం చూస్తే జాలి.
కవిత్వమెక్కుతుందో
కిరాణా లిస్టు ఎక్కుతుందో .
------
తమ ప్రతిబింబాల్ని తాము
లంఘిస్తున్నారు జనం :
రోడ్డు నిండా పడేలు.
------
రాత్రికి
ఎన్నో దీపాలంకరణలు :
పగటికి సూర్యుడోక్కడే.
------

Monday, January 2, 2012

వలసపాకల హైకూలు (3/12)

కుక్క నన్ను చూసి
ప్రేమతో తోకూపింది :
నాకూ తోకుంటే బావుణ్ణు.
------
చీకట్లో మెరిసే
వింత కీటకం
ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ.
------
దేనికోసం బతకడం?
పూలనడిగి
తెలుసుకో !
------
కాకు లేగిరిపోయాయి
నల్లటి నిశ్శబ్దాన్ని
వదిలి.
------
పగలు కురిసిన వానకు
రాత్రి రోడ్డు
ఎం మెరిసిందని !
------
తన దీపం వెలిగించుకుని
కారు వెడుతోంది :
రెట్టింపు చీకటి వదుల్తూ.
------

వలసపాకల హైకూలు (2/12)

ఆకుల చాటున మినికే దీపం :
కాస్త వెలుగూ,
కాస్త చీకటీ.
------
బైట వాన
లోపల వాన :
విముక్తి లేదు.
------
కాకి ఆశాజీవి.
ఉదయం కాకమునుపే
ఉదయాన్ని ఆహ్వానిస్తుంది.
------
కప్పల బెక బెక :
వానలో తడిసిన
అనుభూతి.
------
చంద్రుడి నిండుసున్నా :
మనస్సులో దిగుళ్ళ పక్కన
సున్నాలు చేరుస్తుంది.
------
సంజెవేళ.
దీపాలు వెలిగించారు :
ఎవరి దీపం వారిది.
------