సహస్ర సంవత్సరాలు సంచరించాను పృధివీ పదాల్లో,
సింహళ సముద్రం మొదలు నిశీదాంధకార మలయ సాగరం వరకు
పరిపరి చోట్ల పరిభ్రమించాను; అశోక బింబిసారుల ధూసర జగతిని
సైతం సందర్శించాను; సుదూర అంధకారంలో విదర్భ నగరాన్నీ;
ఈ పరుగులతో, జీవన జలధి క్రక్కే నురుగులతో
క్లాంతున్ని, నాకు సుంత శాంతి నిస్తుంది నాటూరి బనలతా సేన్.
దిగంత ప్రాంత తమోక్రాంత విదిషా నిశలు ఆమె కేశాలు;
శ్రావస్తీ శిల్ప మామో వదనం; సముద్ర మధ్యంలో
చుక్కాని విరిగి దారి తప్పిన నావికుడు
దాల్చిని ద్వీపాంతరంలో హరిత శాద్వలాల్ని దర్శించినట్లు
అంధకారంలో ఆమెను దర్శించాను : 'ఎక్కడున్నావు ఇంతకాలం?'
అందామో, కులాయాల వంటి కన్ను లార్చి, బనలతా సేన్.
దివసాంతాన మంచురాలే మెత్తటి శబ్దంతో
సంధ్య ప్రవేశిస్తుంది; సూర్యగంధాన్ని దులుపు కుంటుంది డేగ;
పృధివీ వర్ణాలు పాలిపోయాక, మిణుగురులు
జాజ్జ్వల్యమానమైన కధ లల్లుతాయి; పక్షులు గూళ్ళకీ,
నదులు మూలాలకీ చేరుకుంటాయి; జీవన ఖాతాలు మూతపడతాయి.
మిగిలింది అంధకారం; ఇక వేళైంది నిను చేరేందుకు,
నాటూరి బనలతా సేన్.
No comments:
Post a Comment