ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Monday, February 27, 2012

పు ఆద్ రిఫ్ ఖా గారి రచన - "ప్రయాణం"


ఎక్కణ్ణించి వచ్చావని అడక్క
విచిత్ర భాషల్లోకి, విచిత్ర ద్వీపాల్లోకి
ప్రయాణించినట్లు
కలలు కననీ.
పునరాగమన పద్యాన్నయా న్నేను,
విదేశ వసంతాలకు పునరాగమనం.

ఎక్కణ్ణించి వచ్చావని అడక్క.
నా చేతుల్ని కాస్సేపు కలలు కననీ.

యూసుఫ్ ఆల్ఖాల్ గారి రచన -"ఇక చాలు, అందామె"


ఇక చాలు, అందామె.
నా పెదిమలపై బాధ
నా గుండెల్లో బాధ
నా నిలువెల్లా బాధ.
ఇక చాలు
దీప మార్పేసి పడుకో,
ఉదయ కాంతి పై మరకలు తేలుతున్నాయి.

నేను నిద్రపోతాను
నాతో ప్రపంచం నిద్రపోతుంది.
మనల్ని మేలుకొలిపే స్వప్నాలు లేవు.
స్వప్నాల మరణమే మనల్ని మేలుకొలుపుతుంది.

మేలు కొలు పంటే
అరణ్యాలు దగ్ధమవటం.

Monday, February 20, 2012

విట్టర్ బిన్నెర్ గారి రచన - "చీనా వేదాంతి"


సరే, వాళ్ళ చేతిలో ఓడిపోయాం ;
ఐతే నే మైంది?
టీ వచ్చింది, తాగు.
మరో తొమ్మిది వంద లేళ్ళలో
వాళ్ళూ ఓడిపోతారు
మ రొకళ్ళ చేతిలో.

సుజాతా భట్ గారి రచన - "పేడ పిల్ల"


మా ఇంటి ముందు రోడ్డు మీద
గుండ్రటి వెడల్పాటి తట్టలో
పేడకుప్ప లెత్తుకునే పిల్ల
మాటిమాటికి నా తలపు కొస్తుంది.
ఆమె నడుమూ చేతులూపే తీరూ,
పేడ వాసనా, దుమ్ము వాసనా,
ఉతికిన బట్టల వాసనా,
కాకి రెక్కలు దులిపిన దుమ్ము వాసనా,
(ఈ వాసనే వేరు !)
ఆ పిల్ల పేడ ఎత్తేటప్పుడు
పేడకడి వాసనా -
విడివిడిగా, ఒక్కసారిగా
ముప్పిరిగోనే ఈ వాసనలన్నీ
మాటిమాటికి నా తలపు కొస్తాయి.
ఐతే, నా కవిత్వంలో ప్రతీకగా
ఆమెని వాడుకోవటం నా కిష్టం లేదు.
అలాగని, ఆ పిల్లని మరవలేను.
పుష్టిగా వున్న పేడకడి నెత్తేటప్పుడు
ఆమె బుగ్గలపై మెరిసే
శక్తీ, మహత్తుల గురించి
వివరించి ఎవరికీ చెప్పలేను.

Friday, February 17, 2012

జీబనానంద దాస్ గారి రచన - "బనలతా సేన్"


సహస్ర సంవత్సరాలు సంచరించాను పృధివీ పదాల్లో,
సింహళ సముద్రం మొదలు నిశీదాంధకార మలయ సాగరం వరకు
పరిపరి చోట్ల పరిభ్రమించాను; అశోక బింబిసారుల ధూసర జగతిని
సైతం సందర్శించాను; సుదూర అంధకారంలో విదర్భ నగరాన్నీ;
ఈ పరుగులతో, జీవన జలధి క్రక్కే నురుగులతో
క్లాంతున్ని, నాకు సుంత శాంతి నిస్తుంది నాటూరి బనలతా సేన్.

దిగంత ప్రాంత తమోక్రాంత విదిషా నిశలు ఆమె కేశాలు;
శ్రావస్తీ శిల్ప మామో వదనం; సముద్ర మధ్యంలో
చుక్కాని విరిగి దారి తప్పిన నావికుడు
దాల్చిని ద్వీపాంతరంలో హరిత శాద్వలాల్ని దర్శించినట్లు
అంధకారంలో ఆమెను దర్శించాను : 'ఎక్కడున్నావు ఇంతకాలం?'
అందామో, కులాయాల వంటి కన్ను లార్చి, బనలతా సేన్.

దివసాంతాన మంచురాలే మెత్తటి శబ్దంతో
సంధ్య ప్రవేశిస్తుంది; సూర్యగంధాన్ని దులుపు కుంటుంది డేగ;
పృధివీ వర్ణాలు పాలిపోయాక, మిణుగురులు
జాజ్జ్వల్యమానమైన కధ లల్లుతాయి; పక్షులు గూళ్ళకీ,
నదులు మూలాలకీ చేరుకుంటాయి; జీవన ఖాతాలు మూతపడతాయి.
మిగిలింది అంధకారం; ఇక వేళైంది నిను చేరేందుకు,
నాటూరి బనలతా సేన్.

Sunday, February 5, 2012

శ్రీనివాస్ రాయప్రోల్ గారి రచన - " ముసలి వాళ్ళవటం గురించి "

ముసలి వాళ్లయ్యే పద్ధతి ఒకటుంది
చెట్లు ముసిలి వయే పద్ధతి :
పగల్నించి రాత్రికి ప్రయాణం చేస్తాయి
ప్రశ్నించే మన కళ్ళ కోసం
రుతువుల్ని నమోదు చేస్తూ,
పరివేదనలో, పచ్చదనంలో
తాము మాత్రం మారకుండా,
స్థిరంగా,

ఆడవాళ్ళ పద్దతిలో కాదు,
పళ్ళల్లో బంగారం, కళ్ళల్లో మెరుపు,
భూత కాలపు భ్రమల మెరుపు,
జ్ఞాపకాల మెరుపూ,
ఆత్మవంచనా, కామవాంఛలతో నిండి,
చదునైన మొహాల మీద
చంద్రకాంతి లాగ.

చెట్లకి మల్లె వృద్ధాప్యంలో
సంపదలు విసర్జించకుండా,
పసర్లని అంతరంగంలో ప్రక్షిప్తం చేస్తూ,
పసుపు పచ్చటి క్రమంలో
ముసిలితనం తాలుస్తూ,
చెట్టు లాగ,
ఆడవాళ్ళ లాగ.

Saturday, February 4, 2012

శ్రీనివాస్ రాయప్రోల్ గారి రచన - "మేజా మీద నారింజ''

మహాగని వైశిష్ట్యాన్ని
తాల్చింది

వసంతంలో
వృక్షానికి వేలాడే
భావం కాదు

హరితంగా
నగ్నంగా
దాని దేహం
గ్రీష్మ బాహువు.

పసుపుగా మెల్లగా
స్త్రీ - సన్నిహితంగా
సంధ్యాకాశం వంటి
చరమక్రమం కాదు

నదీ ప్రవాహాన్ని
అడ్డుకునే
రాతి
కోణాకార
కాంక్ష.

Thursday, February 2, 2012

శ్రీనివాస్ రాయప్రోల్ గారి రచన - "నేడు"

నా కలం బరువెక్కిపోయింది :
వెనకాడుతున్న మాటల సంకెళ్ళని ఈడుస్తూ,
లేని దానికి అర్ధం ఆపాదించటానికి ప్రయత్నిస్తూ,
అది కాగితం మీద పాకలేకుండా వుంది.
నేడు
జీవిత కార్యక్రమంలో
పూర్తిగా మునిగిపోయాను,
సంసారాన్ని పోషించటం,
భార్యని ప్రేమించటం,
స్నేహితుల్తో కబుర్లూ,
లేదా సూన్యంలోకి చూస్తూ పచ్చిక మీద కూచోటం.

నన్ను మండించిన అగ్ని ఏమైంది?
పొలిమేరల్లో గంతు లేస్తూ
నా చేతికి చిక్కని ఆ మాట లే మయాయి?
ప్రేమ కోసం వీధులన్నీ వెతికిన
ఆ లోపలి మనిషి ఏ మయాడు?
మృదుత్వంతో నన్ను దగా చేసిన
ఆ చేతు లే మయాయి?