ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Sunday, November 11, 2012

కవిత్వంలో నిశ్శబ్దం



శబ్దం నించి ప్రపంచం ఉద్భవించిందని ఒక పురాణగాధ చెబుతున్నా, పూర్వ మీమాంసకులూ, నైయాయికులూ శబ్ద శక్తి గురించి కూలంకషంగా తర్కించినా, ప్రాచ్య దేశాల్లో ఆధ్యాత్మిక అనుభూతి కొచ్చేసరికి మౌనానికే ఎక్కువ ప్రాముఖ్యమిస్తో వచ్చారు. సత్తా, అనగా యథార్థం, అనిర్వచనీయమైందనీ, ‘నేతి నేతీ అనగా ఇది కాదు, ఇది కాదూ అని చెప్పవలసిందే కాని, ఇదని చెప్పటానికి వీల్లేదనీ ఉపనిషత్తుల్లో కొన్ని భాగాలు. బ్రహ్మ జ్ఞానం ప్రత్యక్షమైంది (ఇమ్మెదీతె) కనుక, వ్యావహారిక పరిధుల్లో ఇమడదనీ, అందువల్ల అనిర్వచనీయమనీ అద్వైతులు. ఆత్మకీ, వాస్తవానికి మధ్య తెరల్లాటివి మాటలు; వాస్తవాన్ని ఎలా ఆవిష్కరించగలవు? అనే సంశయం ఇక్కడ ద్యోతకమౌతోంది. అనాది నించి కవుల్ని తెలిసో, తెలీకో వేధిస్తున్న మౌలిక ప్రశ్న ఇదని గుర్తించాలి. దేవుడున్నాడా? లేడా వంటి ప్రశ్నల గురించి  బుద్ధుడు నిశ్శబ్దం ప్రకటించాడు. జెన్‌ (Zen) సంప్రదాయంలో జ్ఞారోహణ చేసేకొద్దీ మాటలు పలచబడిపోయి, సంపూర్ణ జ్ఞాన సిద్ధిలో నిశ్శబ్దమొక్కటే మిగులుతుంది. చైనాలో టావోయిష్టులు ( Taoists ) కూడా జ్ఞానికీ నిశ్శబ్దానికి తాదాత్మ్యం పాటిస్తారు.
పాశ్చాత్య సాంప్రదాయం ఇలా కాదు. అది పూర్తిగా శబ్దనిష్ఠమైంది.’ In the beginning was the word ‘ అని సువార్త. ఆదిలో శబ్దముంది.గ్రీకుల నియో ప్లటోనిక్‌ సంప్రదాయంలో దీన్ని ‘ logos ‘ అన్నారు. సర్వ జ్ఞానాన్ని శబ్ద శాసనంతో బంధించడం వీళ్ళ ఆశయం. మధ్య మధ్య నిశ్శబ్దంలోకి జారుకున్న Stylites, Desert Fathers, Trappists, St.John of the Cross  వంటి వాళ్ళున్నా, శబ్దం సకల జ్ఞానాన్నీ శాసించగలదనే వీళ్ళు అభిప్రాయ పడ్డారు.
ఐతే, పదిహేడో శతాబ్దంలో గాలి మళ్ళింది. న్యూటన్‌ లైబ్నీజులు కాలిక్యులస్‌ ని సృష్టించాక, గణితం శాస్త్ర భాషగా ప్రభుత చేపట్టింది. భౌతికానుభవానికి చెందిన చాలా క్షేత్రాలు శబ్దం అధికారాన్నించి చేజారటం మొదలెట్టాయి. సైన్స్‌ అభివృద్ధి చెందేకొద్దీ విషయ వివరణకు సామాన్య భాష పనికిరాకుండా పోతోంది. శాస్త్ర జ్ఞానానికి గణితం పరిభాష కావటమొక్కటే కాదు; గణిత భాషని సామాన్య భాషలోకి మార్చటం కూడా అసాధ్యంగా పరిణమించింది. ఆధునిక గణితంలో కనిపించే చాలా functions, relations, spaces  మొదలైన వాటికి మన ఇంద్రియానుభవంలో సమానాంతరాలు లేవు. Quantum, indeterminacy principle, relativity constant  వంటి విషయాల గురించి సామాన్య భాషలో మాట్లాట్టమే హాస్యాస్పదం. ఆధునిక జ్ఞాన సీమని గణితం ఎంత విస్తృతంగా ఆక్రమించుకుందంటే, అది పరస్పర సంబంధంలేని రెండు సంస్కృతులుగా చీలిపోయిందని C.P.Snow  వంటి పండితులు ఇటీవల గోలపెట్టారు. ఇవి ఒకదానికొకటి లంకెలేని సైన్సూ, హ్యుమానిటీస్‌ ఒక దానిలో పండితుడైనవాడు రెండవ దాన్లో తప్పకుండా పామరుడౌతున్నాడు. ఇటువంటి పామర పండితులతో ప్రపంచమంతా నిండిపోయిందని అతని గోల.
ఈ నవ్య గణితం ప్రభావం దర్శన శాస్త్రంలో మొట్టమొదటి సారిగా స్పినోజ్‌ రచించిన Ethics  లో కనిపిస్తుంది. గణిత శాస్త్రంలో లభ్యమయ్యే నిశ్చాయకత, సంగతత్వం తత్వ శాస్త్రంలోకి దింపాలని అతని ఆశయం. అందుకని, తత్వ భాషని శబ్ద గణితంగా మార్చటానికి ప్రయత్నించాడు. తన గ్రంధాన్ని Analytic Geometry  లాగే సిద్ధాంతాలు, నిర్వచనాలు, నిదర్శనాలు, ఉప సూత్రాలు ( axioms,definitions,demonstrations and corollaries )గా తీర్చి దిద్దాడు. దీని ఫలితమేమిటంటే, ఈ శబ్దాల అద్దాల మేడలో చిక్కుకుని నిజాలేవో, ప్రతిబింబాలేవో తెలిసికోలేక పోయింది తత్వశాస్త్రం. ఈ మయ సభలో ప్రవేశించిన వాళ్ళకి గోడలకీ గుమ్మాలకీ తేడా తెలీదు.
ఈ శబ్దాల సుడిగుండాన్నించి తత్వాన్ని మొదటిసారిగా తప్పించటానికి ప్రయత్నించినవాడు విట్‌ గెన్‌ స్టైన్‌ పదానికీ యదార్థానికీ అసలు సంబంధముందా అని కూపీ తియ్యటం మొదలెట్టాడు. ఇతని అన్వేషణకి పర్యవసానమేమిటంటే, యదార్థానికి సంబంధించిన చాలా క్షేత్రాల గురించి తత్వం మాట్లాట్టానికి వీల్లేదని. నీతి శాస్త్రం, అతి భౌతిక శాస్త్రం లాంటివి అవచనీయాలు. కొన్ని విషయాల్లో మినహాయించి మిగతా వాటిల్లో భాషకి నిశ్శబ్దమే శరణ్యం.
ఆనుభవిక ప్రపంచంలోఈ విధంగా నిశ్శబ్దం విస్తరించుకుని భాష కుంచించుకు పోతుంటే, కవిత్వంలో నిశ్శబ్దాన్ని వెనకనెట్టే ప్రయత్నాలు పందొమ్మిదో శతాబ్దంలో మొదలెట్టాయి. Blake, Dostovisky, Nietzsche, Freud  రచనల్లో కవులకి ఇంతకి మునుపెరుగని మానసిక అగాధాలు, శక్తులూ గోచరించాయి. ఈ కొత్త అనుభవాల్ని వచించటానికి పాత మాటలూ, పాత ఛందస్సూ పనికి రావు. సింబలిస్టు కవులు Rimbaud, Mallarme  కొత్త మూసల్లో పోసేందుకు వీలుగా భాషనీ, వ్యాకరణాన్నీ కరగబెట్టారు. పదాలకి మంత్ర శక్తి ఆపాదించాలని వీరి యత్నం. మంత్రోచ్చాటనలాగే పద్యం కూడా నిద్ర పోతున్న భూతాల్ని మేల్కొలపాలని వీళ్ళంటారు.
దీంతోనే మరో ఆశయం వీళ్ళకి. కవిత్వాన్ని తన సరిహద్దును అతిక్రమింప చేసి సంగీత పట్టం కట్టించాలని. కవిత్వం కన్నా సంగీతం ఉన్నత స్థాయికి చెందిన కళ అని వీళ్ళ అపోహ. ఎందుకంటే, ఏ ఉపకరణాల అవసరమూ లేకుండానే సంగీతం ప్రత్యక్షానుభూతి కలిగించగలదు; రెండోది సంగీతం సంగీతమే. అది మరిదేనిలోకీ అనువదించబడదు. ఈ రెండు కారణాల వల్ల సాహిత్యం కన్నా సంగీతమే గొప్పదని వాళ్ళు నమ్మారు. అర్థాలతో అవసరం లేకుండా వట్టి శబ్దాల వల్లే కవిత్వనుభూతి కలిగించటానికి ఫ్రెంచి కవులు Verlaine, Valery , జర్మన్‌ కవి Rilke  ప్రయత్నించారు. కానీ వీళ్ళ యత్నాలు అట్టే ఫలవంతమైనట్టు కనిపించదు. కవిత్వమూ సంగీతమూ కానిది మరోటేదో పుట్టింది. వీళ్ళ అనుకరణలు మన శ్రీ శ్రీ కవిత్వంలో చూడొచ్చు.
సరే, సంగీతం కలిగించే ప్రత్యక్షానుభూతి వంటి అనుభూతిని కలిగించే ప్రయత్నంలో కవిత్వం విఫలమయ్యింది. ఐతే, కవిత్వం చేసే పనేమిటి? ప్రత్యక్షానుభూతిని కలిగించటం కాదా? ఫ్రెంచి సింబలిస్టులు ఈ విషయాల గురించి లోతుగా ఆలోచించినట్టు తోచదు.
మన చుట్టూ ఉన్న అనుభవిక ప్రపంచాన్ని ఆవిష్కరించటమే కవిత్వ లక్ష్యం. దీనికై సాధనాలు శబ్దాలు లేక మాటలు. మాటలు మన మనస్సు సృష్టించినవి. అనుభవాలు పంచేంద్రియాలకు సంబంధించినవి. మాటలు అనుభవాన్ని యథాతధంగా అనుసరిస్తున్నాయని గ్యారంటీ ఏమిటి? సామాన్య భాష అనుభవాన్ని ఆవిష్కరించక పోగా, ఆచ్ఛాదించటం తరచూ చూస్తుంటాం. అనుభవాన్ని అనుభవంగానే ప్రత్యక్షం గా అందించటం కవిత్వం పని. అంటే, మనం సృష్టించుకున్న కొన్ని శబ్దాలలోకి మనల్ని ఆవరించిఉన్న మహా నిశ్శబ్దాన్ని, అనుభవిక మహా ప్రపంచాన్ని, ప్రవేశ పెట్టటం కవిత్వ లక్ష్యమన్న మాట. ఈ పని కవిత్వం ఎలా నిర్వహిస్తోంది? మాటలు మనస్సు కల్పించుకున్నవి. అనుభవాలు ఇంద్రియాలకు సంబంధించినవి. మనకు ఐదు ఇంద్రియాలున్నాయి. ఇవే మన అనుభవ జ్ఞానానికి మూలాలు. దీన్ని ప్రత్యక్ష జ్ఞానమంటారు. మనస్సు వల్ల కలిగేది పరోక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానాన్ని పరోక్ష మైన శబ్దాల్లోకి ఎలా దించటమన్నది ప్రశ్న. శబ్దాల్లోకి నిశ్శబ్దాన్ని ప్రవేశపెట్టటమెలా?
దీనికై కవిత్వం ఉపయోగించే సాధనాలు పదచిత్రాలు. వీటినే ప్రతీకలంటారు. వీటి వివిధ ప్రక్రియలే రూపకాది అలంకారాలు. పదచిత్రాలు అమూర్త ( abstract ) భావాలు కావు. మూర్త( concrete ) విషయాలు. ఇవి మన ఇంద్రియాల్ని తాకి, ఐంద్రియక అనుభూతుల్ని మేల్కొలుపుతాయి. మాటల కందని సంశ్లిష్టమైన అనుభవాలతో జటిలమైన అనుభవిక ప్రపంచం ఈ పద చిత్రాల మార్గం ద్వారా మన అనుభూతి ఆవరణలోకి ప్రవేశించ గలుగుతోంది. కవిత్వంలోకి విశాలమైన జీవితాన్ని ఆహ్వానించే కిటికీలన్నమాటి ఇవి. మన గది కిటికీలు ఆకాశాన్ని ఆహ్వానించినట్టు.
ఉదాహరణ ఒకటిస్తాను. William Carlos Williams  అనే అమెరికన్‌ కవి వృద్ధాప్యం గురించి రాసాడు. వృద్ధాప్యమనగానే, ప్రస్ఫుట దర్శనంలేని సామాన్య బుద్ధికి తోచే ఊహలు ఒకలా ఉంటాయి. తేజస్సులేని కళ్ళూ, తెల్లబడిన జుత్తూ కనిపిస్తాయి. కాని, పారదర్శి ఐన కవికి వృద్ధుల్లోనూ జీవం, ఉత్సాహం, అందమూ కనిపించవచ్చు. ముసలితనమూ, చురుకూ ఈ రెండూ మిళితమైన సంశ్లిష్ట అనుభవాన్ని వ్యక్తపరిచేందుకు కవికి కొత్త పదచిత్రాలు కావలసి వచ్చాయి. హేమంతమూ, హిమమూ అంటే సరిపోదు.
ఈ పద్యంపేరు ‘ To Waken An Old Lady ‘. ముసిలావిడికి మేలుకొలుపులు.
Old age is
a flisht of small
cheeping birds
skimming
bare trees
above a snow glaze.
Gaining and failing
they are buffeted
by a dark wind -
but what?
On harsh weedstalks
the snow
is covered with broken
seed husks.
And the wind tempered
by a shrill
piping of plenty.
అర్థం మాత్రమే చెపుతాను: ముసలితనమంటే  కిచకిచ లాడుతూ, మంచుతెర పైని ఆకుల్లేని చెట్ల మీదుగా ఎగిరే పిట్టలు. చీకటి  గాలుల తాకిడికి లేస్తో, పడుతో ఎగురుతున్నాయి. ఐతేనేమి? మొరటుమోళ్ళ మీద పిట్టగుంపు కూర్చుంది. చుట్టూరా మంచుమీద గింజలపొట్టు. సమృద్ధి నిండిన కూజితాలతో గాలి వెచ్చబడింది.
ఇంత జటిలమైన అనుభూతి సామాన్య భాషకు అందదు. దాని పరిధి కావలి నిశ్శబ్ద, ఆనుభవిక ప్రపంచంలోనిదిది. ఈ అనిర్వచనీయాన్నీ, నిశ్శబ్దాన్నీ కావ్యంలోకి ప్రవేశపెట్టాలంటే కిటికీలూ, గుమ్మాలూ అవసరం. ఇవే పదచిత్రాలు. ఇవి లేకపోతే కావ్యం మూసుకుపోయి, చదువరికి ఊపిరాడదు. ఒక ముసలి కవికి ముసలి ప్రేయసి యెడల కల ప్రేమ, tendreness  వ్యక్త పరచటానికి సామాన్య భాషకు మాటల్లేవు. ఇటువంటి అనుభూతులు శబ్ద ప్రపంచానికి చెందినవి కావు. ఈ నిశ్శబ్దాన్ని శబ్దంలోకి ప్రవేశపెట్టటమే కవిత్వం విశిష్ట లక్షణం. కవిత్వానికి శబ్దమెంత ముఖ్యమో నిశ్శబ్దం కూడా అంతే.


వేయి పిర్రల సముద్రం



(స్మైల్‌ కి తత
ఈ పద్యం మీకిష్టం కనుక)
ఊగుతోంది వేయిపిర్రల సముద్రం
ప్రియా, నిర్ణిద్రం
లాగుతోంది స్మృతినౌకను ఉప్పాడకు
ప్రియా, నీ జాడకు
మొగ్గి చూస్తోంది రెప్పలేని కన్ను
ప్రియా, మిన్ను
సిగ్గు లేని సాగరం వర్తించు నగ్నంగా
ప్రియా, ఉద్విగ్నంగా
పాదుకొన్నాయి మనలో కడలిఊడలు
ప్రియా, మన నాడులు
ఈదు నిశ్శబ్దపు చేపలు రొదనిచీలుస్తో
ప్రియా, నను పిలుస్తో
నురుగులుకక్కే సాగరతీరాన
ప్రియా, రతీవరాన
విరగనితరగలం మనంమాత్రం
ప్రియా, విచిత్రం
ఎండ్రకాయల్ని తోలే ఏటవాలు సూర్యుడు
ప్రియా, అనార్యుడు
పండువంటి నీమేను స్పృశిస్తాడు
ప్రియా, కందిస్తాడు
అల్లుతోంది అలలపై చంద్రుని సాలీడు
ప్రియా, తనగూడు
అందుకో ఆహ్వానం ప్రవేశించు జాలంలో
ప్రియా, ఇంద్రజాలంలో
చుట్టుకుపోయిన నరాలతో
ప్రియా, కరాలతో
పెట్టుతోంది సంద్రం నిరంతరం రొద
ప్రియా, విను దానిసొద
చుట్టుకుపోయే శంఖాన్నడుగు
ప్రియా, ఎదనడుగు
చూరుకింద చుట్టుకునే హోరుగాలి చెప్పదా
ప్రియా, మనకథ విప్పదా
వేగలేను కడలిమ్రోల అహరహం
ప్రియా, నీ విరహం
ఊగుతోంది వేయిపిర్రల సముద్రం
ప్రియా, నిర్ణిద్రం.
కాకినాడ
23-9-1970

ప్రేమ రెండు రకాలు



ఏకైక మహాప్రేమ
ఒక్కొక్క జీవితపు ని
సర్గాన్ని మహానదిలా
శాసిస్తుంది.
ఏకాకి బాటలల్లే
నా కానబతుకులోన
జరతారు వాగులెన్నో
జతపడ్డాయి.
మెరపువేళ్ళు తన్ని జల
ధరము మొలచి తలకిందుగ
పాడే పిట్టలతో
పాదపమువలె శ్రమదీర్చు.
మెయిలింజను నంటి, నది
పయనించు నొకేదారి.
పట్టాలు లేని ఝరులు
పరుగులిడు స్చేచ్ఛగా,
మళ్ళునింపి నదినేసే
గళ్ళదుప్పటీ బతుకు
వేగలేను బొత్తిగా.
జరతారు వాగులతో
పరదానై సరదాగా
ఊగెద చిరుగాలిలో.
కాకినాడ,
1964

ఔఆఒఊ ఓఖజఊ, కఖచ జఆఘ



మోహానికీ
మోహరానికీ
రవంతే తేడా.
ప్రేమికుడికీ
సైనికుడికీ
ఒకటే ఏకాగ్రత!
ప్రియుడి కంటికొసని
ప్రేయసి నిత్యం జ్వలిస్తే
జవాను తుపాకి తుదని
శత్రువు నిశ్చలంగా నిలుస్తాడు.
స్మరరంగంలో లేచే సుడిగాలే
సమరరంగంలో పిడికిలి బిగిస్తుంది.
కోరికల తుఫానుకి
కొంకర్లు తిరిగే నరాలచెట్టులా
సంకుల సమరంలో
వంకర్లుపోయిన ముళ్ళకంచెలూ మెషీన్‌గన్లూ.
మృత్యుభంగిమలకి
రత్యంతభంగిమలకి
వ్యత్యాసం ఉందంటారా?
ఉవ్వెత్తుగా లేచిపడి
ఉద్రేకపు చివర్ల
బిగుసుకునే దేహాలకి కారణం
భావప్రాప్తా, అభావమా?
ఐతే,
బుద్ధిగా ప్రేమించుకోక
యుద్ధాలెందుకు చేస్తారో
నాకర్థం కాదు.
31220, 1971

గురుత్వం



గోడమీది నీడల్లా తత
గురుత్వాన్ని మరచి
ఎండపొడల బంతులతో
ఇటూఅటూ పరచి తత
ఊహలను అతీతముగ
ఉంచుగోరు మనము.
కాని గోడపైని నీరు
కారు తడివసనము
వలె దిగలాగు దిగులుగా
ఇల చీకటి కేంద్రానికి.
ఏప్రిల్‌ 1967

కాలవొడ్డున షికార్లు



(స్నేహితుడు బిట్ర మోక్ష లక్ష్మీ నరసింహస్వామికి రాసిన ఉత్తరం)
జ్ఞాపకముందా మోక్షం!
కనీస పక్షం
మన కాలవగట్టు షికార్లు
దినాల చివర్లు.
సంధ్యాద్వయాన్ని తూస్తో
ములుచూపు రస్తా తత
ఒకటి నభాన, యేటి
కరాన మరోటి,
గాజుల గలగలతో మొరసి
రంగులతో మెరసి,
ఎగిరే సంజగాలిపడగ
తూలిపడగ
కాలవలో మాత్రం
సంధ్యా సూత్రం
చీకట్లను చీలుస్తో
నిలుచు జ్వలిస్తో.
ఇవాళ మన దోస్తీ
ఒక్కణ్ణీ మోస్తి.
కాకినాడ
ఏప్రిల్‌ 1964