ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Saturday, November 3, 2012

శ్రీ స్మైల్ చేసిన ఇంటర్‌వ్యూ

(1988లో ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం. తేదీ గుర్తులేదు)

ప్ర: మిమ్మల్ని స్పృశించిన సాహిత్య ప్రభావాలేమిటి? అవేమైనా మీకు మార్గనిర్దేశం చేసాయా?

జ: నా ఎనిమిదో ఏట కృష్ణశాస్త్రి గారి పాటల్ని విన్నాను. సీతా అనసూయలు పాడగా, అప్పుడే నాకు స్వర్గలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి. కృష్ణశాస్త్రి గారిని మొదటిసారి అప్పుడే చూట్టం. భూలోకానికి దిగి వచ్చిన గంధర్వుడిలా ఉండేవాడాయన. తరువాత శ్రీశ్రీ కవిత్వంతో పరిచయం. పత్రికల్లో అక్కడక్కడా వచ్చినవి కత్తిరించి దాచుకునేవాణ్ణి. ఆ రోజుల్లోనే చలం, కుటుంబరావుల తుఫానులో చిక్కుకున్నాను. నా క్షితిజ రేఖ క్రమంగా విస్తరించి టాగోర్‌ని, జయదేవుడు మొదలైన వైష్ణవ కవుల్నీ, వాళ్ళ సోదరులైన సూఫీ కవుల్నీ ఆవరించింది. ఇంగ్లీషు కవుల్లో మొదట నన్ను ఆకర్షించిన వారు ఆడేన్, స్పెండర్, డే లూయీ, మెక్‌నీస్‌లు. అక్కణ్ణించి నా దృష్టి కాంటినెంట్ మీదికి గెంతి, ఫ్రెంచి సింబలిస్టు కవులమీదికీ, లోర్కా, మొదలైన స్పానిష్ కవుల మీదకీ, రిల్కే వంటి జర్మన్ కవులపైకి ప్రసరించింది. ఆ తర్వాత ఎంతో మంది కవులు ఏయే దేశాల వాళ్ళు నన్ను ఆకర్షించారో చెప్పడానికి సమయం చాలదు.
ఇక మార్గ నిర్దేశమంటారా? మన పూర్వ కవుల్నించి నేర్చుకోవలసింది ఎలా రాయాలో కాదు. ఎలా రాయకూడదో ముఖ్యంగా నేర్చుకోవాలి. నేను కృష్ణశాస్త్రి గారి లాగే రాస్తే ఇక నేనెందుకు?


ప్ర: చాలామంది కవులకి వృద్ధులైపోయినా బాల్యం వదలదు. అంటే అప్పటి జ్ఞాపకాలు వాటి ప్రభావాలూనూ. మీ బాల్యంలో ఏవైనా సంఘటనలు ప్రగాఢమైన అనుభూతిని మిగిల్చాయా? అలాంటి అనుభూతి మీ కవిత్వాన్ని ఎలా ఉద్దీపింపజేసింది?

జ: నా బాల్యం ఎంతో ఆనందమయంగా, ప్రేమ మయంగా గడిచిపోయింది. ఆ ఆనందంతో, ప్రేమతో, అమాయకత్వంతో, అద్భుతంతో నా కవితా ప్రపంచాన్ని నింపాలని అప్పట్నుంచి నా ప్రయత్నం. నా బాల్యం గోదావరి తీరంలోనూ, పంట కాలువల గట్లపై, కొబ్బరి తోటల నీడల్లోనూ గడిచింది. మా అమ్మమ్మ ఒళ్ళో కూచుని గోదావరిపై లాంచీలో ప్రయాణం చెయ్యటమూ, వెన్నెల రాత్రులు వెండి ఇసుకలో చెడుగుడూ, ఉప్పాట ఆడుకోవటమూ, కొబ్బరాకులపై వెన్నెల వయొలిన్లు, నిశ్శబ్ద సంగీతం వాయిస్తుంటే ఆరు బయట నిద్రలోకి జారటమూ, చెరువంచున గంటలకొద్దీ కూచుని జలాంతర్లోకాల అద్భుతాన్ని తిలకించటమూ, గాలి జోరుకి వంగిన పడవలో అంచున కూర్చుని రయ్యిన వెనక్కి పోయే నీళ్ళని వేళ్ళతో చీలుస్తూ గోదావరి దాటటం - చిన్నతనపు ఆనందాలూ, అద్భుతాలూ ఎన్నటికీ మరువలేను.


ప్ర: సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో స్తబ్ధత ఏర్పడిందని కొందరు సాహిత్యకారులు అభిప్రాయపడుతున్నారు కదా? మీ ఉద్దేశ్యం ఏమిటి?

జ: స్తబ్ధత ఎక్కడిది? ఈ మధ్య ప్రతిభావంతులైన యువకవులు చాలా మంది వచ్చారు. మనం స్తంభించిపోయామని నేననుకోను.


ప్ర: కవిత్వంలో అస్పష్టత గురించి మీ ఉద్దేశం ఏమిటి?

జ: అస్పష్టత గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా వాళ్ళ దృష్టిలో ఉన్నది ambiguity (బహుళార్థకత్వం) అస్పష్టత వేరు, ambiguity వేరు. ambiguity వ్యంగ్యవైభవాన్ని సూచిస్తుంది. కవిత్వం అనేక అర్థాల నీడల్ని పరుస్తుంది. ప్రతి కవితలోనూ దిగే కొద్దీ లోతులు తగుల్తుంటాయి. దీన్ని ambiguity అంటారు. ఇది కవిత్వానికి ప్రాణం. అస్పష్టత చేతకాని తనానికి సంబంధించిది. భాషని ప్రయోగించడం చాతకాకపోతే అస్పష్టత సిద్ధిస్తుంది మన కవులెవరూ చాతకాని వారనుకోను. ఎవరిలోనూ నాకు అస్పష్టత కనిపించలేదు. వేగుంట మోహన్‌ప్రసాద్ కవిత్వంలో అస్పష్టత ఉందని కొందరు విమర్శకులు అనగా విన్నాను. అది అస్పష్టత కాదు. సంక్లిష్టత(complexity). సర్రియలిస్టు కవిత్వం అవచేతనలోంచి పైకుబికే సంసర్గ భావాల సమాహారం. ఈ పద్ధతి మనకు కొత్త. కొత్త వాటిని, మన అలవాట్లకు వింతైన వాటిని కొట్టి పారేయటం మనవాళ్ళ దుర్గుణం. అస్పష్టత, ambiguity భేదాన్ని మన విమర్శకులు ఇకనైనా గ్రహిస్తారని ఆశిస్తున్నాను.


ప్ర: పాఠకుడు కవి ఎత్తుకు ఎదగాలా? కవే పాఠకుడి స్థాయికి దిగాలా? మీ ఉద్దేశమేమిటి?

జ: ఇద్దరూ కలిసి భాష స్థాయికి ఎదగాలి. తనకు ఉపయోగించే భాషనిమలచుకోలేని వాడూ, ఆ భాషని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని వాడూ, ఆ భాషని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని వాడూ, వీరిద్దరూ కవిత్వం రాయడానికీ, ఆస్వాదించడానికీ అనర్హులు. గణితశాస్త్రం, భౌతికశాస్త్ర్అం లాంటి ఏ విజ్ఞానశాస్త్రమైనా, సంగీతం, చిత్రలేఖనం లాంటి ఏ కళైనా అందులో కృషి చేసి కనీస పరిజ్ఞానం సంపాదించిన వాళ్ళకి కాని అర్థం కావే? ఒక్క కవిత్వం మాత్రం జనసామాన్యానికి ఏ అర్హత లేకుండానే అర్థం కావాలనడంలో నాకర్థం కనిపించడం లేదు. పాఠకుడిలో కనీసం సహృదయత ఉండాలి కదా?


ప్ర: మరి కవిత్వం చదవడానికి, అర్థం చేసుకోవడానికి కొంత నేపథ్యం ఉండాలనుకుంటే కవిత్వం పరిధి చాలా పరిమితం అయిపోయినట్టే కదా?

జ: ఔను. ఏ శాస్త్రానికి, కళకైనా దాని పరిధులు పరిమితమే. ఆ పరిధిలో ఉన్నంత సేపే అది శాస్త్రం కానీ, కళ కానీ అనిపించుకుంటుంది. కవిత్వం వల్ల కొంపలు కాల్తాయి. విప్లవాలు వస్తాయి అని మీరనుకున్నట్టయితే నిరాశ కోసం సిద్ధపడండి. కవిత్వం పాఠకుల చైతన్యంపై చాలా సున్నితంగా పని చేస్తుంది. అది చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది. ఫలానా దారినే నడవమని ఒకరు చెబితే వినడు మనిషి. అది తనకు తోచాలి. తన దారేదో తను నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయానికి కవిత్వం తోడ్పడుతుంది.


మరొకటి : కవిత్వం జీవిత విలువల్ని వెలికిదీసి ప్రతిష్ఠిస్తుంది. ఈ విలువలు ఒక సాహిత్యానికే కాదు. జీవిత రంగాలన్నిటికీ సంబంధించినవి. వీటిని పరిగ్రహించటం వల్ల రాజకీయాలు కూడా క్షాళమౌతాయి. రాజకీచకులు సాహిత్యం నించి నేర్చుకుని బాగుపడవలసింది చాలా ఉంది.


ప్ర: మార్క్సిజం, తత్సంబంధమైన కవిత్వం మింగుడు పడని మాత్ర అయిందేమిటి? మార్క్సిజంలో కవిత్వం ఇమడదనా, కవిత్వంలో మార్క్సిజం ఉండకూడదనా?

జ: కార్ల్ మార్క్స్‌తో కానీ, అతని రాజకీయ సిద్ధాంతాలతో కానీ నాకు వైరమేమీ లేదు. వచ్చిన చిక్కంతా మార్క్స్‌ని అభినవ భగవంతుడుగానూ, అతని సిద్ధాంతాలని అభినవ మత మౌఢ్యంగానూ మార్చిన మార్క్సిస్టులతోనే. మనల్ని దారి తప్పించడానికి ఉన్న మతాలు చాలు. కొత్తమతం అవసరం లేదంటున్నాను. మార్క్స్ సూత్రాలు నిరపేక్ష నిశ్చాయకాలు (absolutely certain). శాస్త్రం మొదలు కళ వరకు అన్ని రంగాలకి తిరుగులేకుండా వర్తిస్తాయని మార్క్సిస్టులు పిడివాదం చేస్తారు. విజ్ఞాన శాస్త్రీయ సూత్రాలు నిశ్చాయకాలని శాస్త్రమే అనదు. పిడుక్కీ బియ్యానికీ ఏకమంత్రంగా ఉపయోగించే అటువంటి సార్వత్రిక సూత్రాలెక్కడా లేవు. మతమౌఢ్యంలో తప్ప. కనుక ఈ మార్క్సిస్టు క్లెయిం నేనొప్పుకోను.

మార్క్సిస్టు కవిత్వం, నాన్-మార్క్సిస్టు కవిత్వం వేరువేరుగా ఉంటాయని నేననుకోను. ఏ కవిత్వమైనా కవి వైయక్తిక అనుభవంలో ఉద్భవించాల్సిందే. నిజమైన కవిత్వం మార్క్సిస్టు రచించినా, నాన్-మార్క్సిస్టు రచించినా నాకు ఆదరణీయమే. ప్రాథమిక మానవ అనుభవానికి దిగేటప్పటికి అంతా ఒకటే. అంతా మనుషులే.

ఐతే నేనడిగేది మార్క్సిస్టులు తెలుగు కవుల మస్తిష్కాలపై రాజ్యం చేస్తున్న కాలంలో, అనగా 1950-70 మధ్య అంత చచ్చు కవిత్వం ఎందుకు పుట్టుకొచ్చిందని? అది మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంత లోపమా? ఆ కవిత్వాలు రాసినవారు దొంగ మార్క్సిస్టులైనా అయి ఉండాలి. లేదా దొంగ కవులైనా అయి ఉండాలి. అది వాళ్ళనే నిర్ణయించుకోమంటున్నాను.


ప్ర: చుట్టూ సమాజ పరంగా ఎన్నో సమస్యలున్నాయ్ కదా, వాటి ప్రభావం వ్యక్తి మీద తప్పకుండా ఉంటుంది కదా, వైయక్తికమైన అనుభూతులకి అంతగా చలించి వాటికి కవిత్వంలో పలికించే కవి ఎంతో దారుణమైన సమాజ పరిస్థితులకి చలించకుండా ఉండడం సాధ్యమా?

జ: సాధ్యం కాదు. ఐతే కవి ప్రతిస్పందనని అతని వ్యక్తిత్వం, మానసిక వాతావరణం, చేతనా(sensibility), సొంత అనుభవాలూ కలిసి నిర్ణయిస్తాయి. జీవితం తన ముందు నిలిపే సమస్యలకి కవుల ప్రతిచర్య (reaction) ఒక్కొక్క యుగంలో ఒకలా ఉంటుంది. సామాజిక ప్రతిబంధకాలపై, దుర్మార్గాలపై తిరగబడి స్వేచ్ఛని కోరిన భావకవులు విరహవ్యంజకమైన భావకవిత్వం రాశారు. ఫ్రాన్స్‌లో నాజీ దురాక్రమణ సమయంలో resistanceకి చెందిన ఫ్రెంచి కమ్యూనిస్టు, సర్రియలిస్టు కవులు ప్రణయ గీతాలు రచించి, కవాతు పాటలుగా పాడుకున్నారు. వాళ్ళ ప్రేయసి స్వాతంత్ర్యానికి ప్రతీక. కనుక ప్రాపంచిక సంఘటనలకి కవి స్పందించే విధం చాలా సున్నితంగా, పరోక్షంగా mysteriousగా ఉంటుంది. ఈ విషయం కవికే వదిలివేయాలి. నువ్విలా రాయి, అలా రాయి అని కవిని శాసించడం హాస్యాస్పదం. బ్రహ్మాండం బద్దలయ్యే సంఘటన్అలకి బ్రహ్మాండం బద్ధలయే కవిత్వం పుడ్తుందని ఆశించడం అమాయకత్వం. మనకి స్వాతంత్ర్యం సిద్ధించి నలభై ఏళ్ళయింది. ఇంత గొప్ప విషయం మీద చక్కగా ఒక్క మంచి కవిత ఇంతవరకూ పుట్టిందా? చూపించండి చూద్దం. కనక, కవి ప్రతిస్పందన ఎన్నడూ డైరక్టుగా ఉండదు. ప్రత్యక్షానుభవం కవి యొక్క unconsciousలో మునిగి , మరో రూపంలో పైకి తేలుతుందని అనుకోవాలి. “ఈ సమస్య మీద నువు ఇలా రాయి, అలా రాయి” అని రాజకీచకులు కవుల్ని శాసించటం చూస్తే నాకు నవ్వొస్తుంది.


ప్ర: మీరు యువకుడిగా మార్క్సిజం ప్రభావంలోకి వచ్చారని ఓసారి చెప్పారు. మరి ఇప్పుడు ఏ దారీ చూపించని సిద్ధాంతంగా అది మిమ్మల్ని ఏమైనా నిరాశపర్చిందా?

జ: ఔను.


అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున తా
నెక్కిన పారని గుర్రము
క్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!


ప్ర: మార్క్సిస్టు భావాలున్న కొందరు మంచి కవిత్వం రాస్తున్నారంటారా?

జ: రాస్తున్నారు.


ప్ర: అయితే, కవిత్వంగా వాళ్ళు రాసింది మీకు నచ్చినప్పుడు, రాసిన దాంట్లో మార్క్సిజం ఉంటే మాత్రం ఏమైంది?

జ: ఏమీ కాలేదు. నాకు కావలసింది హృదయ స్పర్శి ఐన మంచి కవిత్వం. అది ఎవరురాసినా ఆనందిస్తాను. నాకు మార్క్సిజం మీద కోపం లేదని మీకు ముందే చెప్పాను.


ప్ర: ఎవరి కవిత్వాన్ని వాళ్ళు చెప్తారు. వేరు వేరు కవిత్వాలకి వేరు వేరు చదువరులుంటారు. పూర్వం నుంచి ఇప్పటి వరకు వచ్చిన వివిధ కవిత్వాలు ప్రతిపాదించిన భావాలని అందరూ ఒకే రకంగా ఆమోదించలేరు కదా. భక్తి కవిత్వాన్ని ఒకరు ఒప్పుకుంటే, మరొకరు ఒప్పుకోరు. అలాగే శృంగార కవిత్వం, ప్రబంధ కవిత్వాల విషయంలో కూడా ఆమోద తిరస్కారాలు ఎప్పుడూ ఉంటాయి కదా. అలాంటప్పుడు కావలసిందల్లా కవిత్వమే అని అనడం సబబవుతుందా?

జ: సబబే. నేను అజ్ఞేయవాదిని. (agnostic) ఐనా, నేను టాగోర్ కవిత్వాన్నీ, సూఫీ కవిత్వాన్నీ, వైష్ణవ గీతాల్నీ ఆస్వాదించగలను. మార్క్సిస్టుల్లో సహృదయులైన వాళ్ళు వాటిని తిరస్కరించరనే అనుకుంటున్నాను. ఎందుకంటే మానవత్వపు అడుగుపొరల్ని తాకే గుణం కవిత్వానికి ఉంది. ఆ లోతుల్లోకి దిగాక మనుషులంతా ఒకటే. సిద్ధాంత భేదాలు అంత దూరం వేళ్ళు చాపలేవు.


ప్ర: సరే, సమాజంలో ఒక వ్యక్తిగా మీ దృక్పథం ఏమిటి?

జ: ఆర్థిక, సాంఘిక అసమానతలు లేని సమాజాన్ని నేను ఆశిస్తున్నాను. చైనాలో వాళ్ళు ఇటీవల సాధించిన ఫలితాలు చూస్తే నాకాశ్చర్యం వేస్తుంది. మనం ఎందుకు చెయ్యలేమా అనిపిస్తుంది.


ప్ర: మీ వ్యాసాలు, విమర్శలు చదివితే, ఎంతో స్పష్టంగానే కాక మీరు గొప్ప వచనం రాస్తారని తెలుస్తుంది. విమర్శ విషయానికొస్తే నిష్పక్షపాత దృష్టిని ఒకటి విమర్శకుడికి ఉండాలంటారా? ఒక విషయాన్ని వివిధ కోణాల్నుంచి చూడవచ్చుననుకుంటే ఒక కోణంలో చూట్టమే రైటనీ తతిమ్మా పద్ధతులు తప్పనీ చెప్పడం కంటే, అన్ని కోణాల్లోంచి దృశ్యాల్ని చూడటం మంచిది కదా?

జ: నేననేది అదే. ఈ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు. మార్క్సిస్టులని.


ప్ర: ఇంగ్లీషులో ఉన్న సాహిత్య విమర్శకు దీటైన విమర్శ మనకు ఉన్నదా?

జ: లేదు. బాగా అభివృద్ధి చెందిన ఇంగ్లీషు మాట అటుంచండి. మనకన్నా ఆర్థికంగా వెనుకబడి ఉన్న పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో వస్తున్న విమర్శ లాంటిదైనా మనకు లేదు.


ప్ర: ప్రస్తుతం పత్రికల్లో వస్తున్న కవిత్వం చదువుతున్నారు కదా?
జ: హింసాత్మక, భూతాత్మక కథలు వెయ్యటం మొదలెట్టాక పత్రికలు చదవటం మానేశాను.


ప్ర: ఈ మధ్య కాలంలో శివారెడ్డి, గోదావరి శర్మ, చినవీరభద్రుడు, అఫ్సర్, రవూఫ్, శిఖామణి, త్రిపురనేని శ్రీనివాస్ ఇలా ఎందరో యువకులు పత్రికల్లో ప్రచురించడమే కాకుండా సంకలనాలు కూడా తెచ్చారు. వీరి గురించి మీ ఉద్దేశ్యమేమిటి?

జ: వీళ్ళంతా నాకు ఇష్టులు, మంచి ప్రతిభావంతులు.


ప్ర: స్త్రీలు అడపాదడపా రాసినా, తెలుగులో కవిత్వ రంగం చిత్రంగా మగవాళ్ళకే పరిమితమైనట్లుగా కనిపిస్తోంది. ఎందువల్లనంటారు?

జ: నా చిరకాల అనుమానం నిజమేనన్న మాట. మొదట్నుంచి నా అనుమానమేమిటంటే ఆడవాళ్ళకి మానసికంగానూ, శారీరకంగానూ, మగ వాళ్ళ కన్నా ఆనందించే capability ఎక్కువని, అందుకనే వాళ్ళు కవిత్వం రాయలేకపోతున్నారు. ఎందుకంటే, కవిత్వోద్భవానికి కావలసింది మానసికమైన అశాంతి. మనస్సులో కీకారణ్యాలు విస్తరిస్తేనే కాని, కవిత్వ వ్యాఘ్రం అందులో సంచరించదు. పోన్లెండి. వాళ్ళనైనా సుఖపడనివ్వండి!


ప్ర: మీరు ముస్లింగా, ఒక మైనారిటీ మతస్తునిగా సమాజంలోనూ, సాహిత్యరంగలోనూ ఎలా ఫీలవుతున్నారు?

జ: మతం గురించి, కులం గురించి ఆలోచన నాకెప్పుడూ రాలేదు. నేను మొదట్నించీ అందర్లో ఒకణ్ణిగా, తెలుగువాణ్ణిగా ఫీలవుతూ వచ్చాను. నా పని నేను చేసుకుంటూ, ఎవరితోనూ ఏ బిరుదు కోసమూ అవార్డుకోసమూ పోటీ పడలేదు. కనుక, నా మైనారిటీ మతం నాకు handicap కాలేదు. కాని, ఉద్యోగావకాశాల కోసం మెజారిటీ కులాలతో పోటీకి దిగిన ఈ తరం ముస్లిం కుర్రవాళ్ళని చూస్తే జాలివేస్తుంది. మైనారిటీ మతం కావటం వల్ల ముస్లిం కుర్రవాళ్ళకి చాలా అన్యాయం జరుగుతోందనిపిస్తుంది.


ప్ర: చెట్టు నా ఆదర్శం, మృత్యు వృక్షం, చిలకలు వాలిన చెట్టు, ఇలా చెట్టుని దృష్టిలో పెట్టుకు కవిత్వం రాశారు. చెట్టు మీకు అంత ఆదర్శం ఎందుకైనట్టు?

జ: నేను చెట్టుని చాలా చోట్ల ప్రతీకగా ఉపయోగించుకుంటున్నాను. ఐతే, అన్ని చెట్లూ ఒకటి కాదు. “చెట్టు నా ఆదర్శం”లో చెట్టు భూమిలో నాటుకుని ఆకాశంలో విస్తరిస్తుంది. దానికి స్థిరమైన పునాదీ, ఎగిరే స్వేచ్ఛా రెండూ ఉన్నాయి. కనుకనే అది విరులు తాల్చగలిగింది. అందుకని, అది నా ఆదేశమైంది. “మృత్యువృక్షంలోది భయంకరమైన తల క్రిందులు చెట్టు. ఇది ఆకస్మాత్తుగా మొలిచి, జ్ఞాపకాల కొమ్మల్నీ, గాఢానుభవాల ఊడల్నీ వెనక్కి పీల్చేసుకుంటుంది. “చిలకలు వాలిన చెట్టు” కవిత్వానికి ప్రతీక. మంచి కవిత్వంలో నవనవోన్మేషమైన ఎర్రటి చిలకముక్కుల్లా చూసే కొద్దీ కొత్త అర్థాలు స్ఫురిస్తూనే ఉంటాయి. కనుక నేను రాసింది చెట్ల గురించి కాదు. నా గురించి, నాకు సంబంధించిన వివిధ విషయాల గురించి రాసుకున్నాను. చెట్టు ఎప్పటికప్పుడు మారిపోయే ప్రతీక. ప్రతి పద్యంలోనూ ఒక కొత్త చెట్టు మొలుచుకొచ్చింది. అన్ని చెట్లూ ఒకటే ననుకుంటే నా పద్యాలు అర్థం కావు. ఏ పద్యానికాపద్యం చదువరి మనస్సులో కొత్తగా నిర్మించవలసిందే.


ప్ర: మీ తమ్ముడు వజీర్ రహ్మాన్ గురించి ఏమైనా చెప్తారా? ఆయన మరణం వల్ల తెలుగు కవిత్వం ఒక మంచి కవిని కోల్పోయిందనుకుంటున్నా. సరే ఆయన ప్రచురించని కవిత్వం ఏమైనా ఉందా? కవిగా వజీర్ రహ్మాను గురించి మీ అభిప్రాయం?

జ: వజీర్ రహ్మాన్ గొప్ప భావుకుడు. చాలా ఆవేశపరుడు. అంతరాళాల్లోంచి తన్నుకొచ్చినట్టుగా, spontaneousగా ఉండేవి అతని పద్యాలు. అతనికి బలమైన ఇష్టాయిష్టాలుండేవి. తనకు నచ్చనిది దేనితోనూ రాజీ పడేవాడు కాదు. ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ భాషల్లో బాగా చదివేవాడు.

అతని చివరి పుస్తకం “సాహసి” ప్రచురించిన రెండు నెలల్లోనే చనిపోయాడు. అతని ప్రచురించని తెలుగు పద్యాలున్నాయని అనుకోను. కాని, తనవీ, చలానివీ, నావి కొన్ని కవితలు ఇంగ్లీషులోకి అనువదించాడు. వాటికి చక్కని ఉపోద్ఘాతం కూడా రాశాడు. ఇవన్నీ కలిపి పుస్తకంగా తేవాలని అతని ఉద్దేశం.

త్యాగరాజు కృతులమీద పుస్తకం రాయాలనుకునేవాడు. అది నెరవేరలేదు. అతను నిపుణుడైన ఫోటోగ్రాఫర్ అనే సంగతి చాలా మందికి తెలీదు. సినిమాటోగ్రఫీ అధ్యయనం చేశాడు. అత్యాధునికమైనసినిమా తీయాలనే కోరిక చాలా సార్లు వెలిబుచ్చాడు. భారతీయ, పాశ్చాత్య సంగీతాల్లో అతనికి మంచి అభిరుచి ఉండేది. ఇదికాక, అతను డిజైనర్ కూడాను. ‘సాహసీకీ, నా కవిత్వంలో నిశ్శబ్దానికిఈ అట్టలు అతనే డిజైన్ చేశాడు.


ప్ర: మీ పూర్వీకులెవరన్నా కవిత్వం రాసేవారా? తెలుగు కాకపోతే ఉర్దూలోనన్నా?

జ: మా తాతగారు వజీరుద్దీన్ ఉర్దూ, పార్సీ భాషల్లో కవిత్వం రాసే వారు. ఆయన పేరే వజీర్‌కి పెట్టారు. మా మాతామహులు ఖాసింఖాన్ గారు తెలుగు, సంస్కృతాల్లో నిష్ణాతుడు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారికి మిత్రుడు. ఇంజరం గ్రామంలో మా తాతగారి ఇంట్లో వెంకటశాస్త్రిగారు ఒక సందర్భంలో శతావధానం ప్రదర్శించారు. ఈ తాతగారినించే నాకు తెలుగు భాషలో అభిరుచి సంక్రమించింది.


ప్ర: ఉమర్ ఆలీషా కవిగారు మీకు బంధువా? ఆయనకి కవి శిష్యులు చాలామంది ఉండేవారని విన్నా. ఆయన గురించి ఏమన్నా విశెషాలు చెప్పగలరా?

జ: ఉమర్ ఆలీషా కవిగారితో మాకు బంధుత్వం ఉంది. ఆయన తెలుగు, సంస్కృతం, ఉర్దూ, పార్శీ భాషల్లో గట్టి పండితుడు. ఉమర్ ఖయ్యాం రుబాయీలు నేరుగా పార్శీ నించి తర్జుమా చేసాడు. స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయాల్లోఈయన ప్రముఖ పాత్ర వహించాడు. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అంటే అప్పటి పార్లమెంటులో, ఈయన మెంబర్‌గా చాలాకాలం ఉన్నాడు.

వీరి కుటుంబానికి సంబంధించిన గురుపీఠం వీరి తాతలకాలం నించీ ఉంటుండేది. ఈయన తరానికి వీరే గురువులు. ఈయన శిష్యులు పిఠాపురం తాలూకాలో విస్తరించి ఉన్నారు. అందరూ దాదాపు హిందువులే.

ప్ర: మీకు, వజీర్ రహ్మాన్ గారికి సంగీతం అంటే చాలా ఇష్టం అని విన్నాము. ఇద్దరి దగ్గరా మంచి రికార్డ్ కలెక్షన్ ఉండేదట! మీరు ప్రత్యేకంగా ఇష్టపడ్డ సంగీతకారులెవరు?

జ: శాస్త్రీయ సంగీతం అంటే మా ఇద్దరికీ ఆసక్తి ఉండేది. రికార్డులు కలెక్ట్ చెయ్యడం నేను ప్రారంభించాను. కొంత కాలమయాక, కవిత్వం అసూయాపరురాలైన భార్యవంటిదనీ, వేరే ఉపపత్నుల్ని సహించదని తెలుసుకున్నాను. అలాగే ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ భాషల అధ్యయనం కూడా నా ఏకాగ్రతకి భంగకరమవుతుందని తెలుసుకుని అదీ మానేశాను. నా రికార్డు కలెక్షన్ ఇచ్చేశాను. అతను దాన్ని పెంచి పెద్దది చేశాడు. నేను పోగు చేసినవి అరుదైన హిందుస్తానీ, కర్ణాటక రికార్డులు. అతనికి పాశ్చాత్య సంగీతంలో అభినివేశం ఉండేది. పాశ్చాత్య సంగీతం, శాస్త్రీయం, అశాస్త్రీయం, చాలా రికార్డులూ, టేపులూ చేర్చి ఈ సమాహారాన్ని పెంచాడతను. అతనికి స్టీరియో సిస్టం నిర్మించి ఇచ్చింది ఎవరో తెలుసా? మలయాళమహాకవి కుమార అసాన్ కొడుకు.


ప్ర: చలం గారిని మీరు కలిసే ఉంటారు. మీ తమ్ముడు వజీర్ రహ్మాన్ ఆయన అల్లుడు కదా? చలం గురించి మీ impressions ఏమిటి?

జ: తిరువణ్ణామలై వెళ్ళి చలం గారిని రెండుసార్లు కలిశాను. ఆయన మొహంలో గొప్ప శాంతి కనిపించింది నాకు. చచ్చుప్రశ్నలు వేసి ఆయన్ని చికాకు పెట్టబుద్ధవలేదు. వరండాలో పాత గ్రాంఫోన్ కనిపిస్తే సైగల్ రికార్డులు పెట్టి వింటూ కూచున్నా. ఆయన వరండాలోకొచ్చి నా కెదురుగా కూచుని సంగీత మాధుర్యంలో ములిగిపోయాడు. మాట్లాడకుండా రెండు గంటల సేపు కూచున్నాం. మా ఇద్దరి తరపునా సైగల్ మాట్లాడాడు.

చలంగారంత నిజాయితీ ఉన్నవాడు నాకు గాంధీ గారొక్కరే కనిపిస్తాడు. గాంధీ గారి లాగా ఈయన చెప్పిందే ఆచరించాడు. ఈయన కూతురు చంపకా, మా తమ్ముడూ పెళ్ళి చేసుకుంటామని ఆయన అనుజ్ఞ అడిగారు. “పెళ్ళెందుకూ? పెళ్ళి చేసుకుంటే కాని కలిసి ఉండకూడదా?” అన్నాడీయన! చలంగారికి వివాహవ్యవస్థంటే కోపం. అన్ని అనర్థాలకీ వివాహం మూలమని ఆయన ధృఢాభిప్రాయం. కూతురి విషయంలో కూడా ఆయన జంకలేదు!


ప్ర: ఈ మధ్య ప్రఖ్యాతి పొందిన, మంచి కవిత్వమే రాసిన కొందరు కవులు, తాము యుగకవులమనో, మహాకవులమనో అనుకుంటూ ఉండడం, ఈ సందర్భంగా అప్పుడప్పుడు చర్చలు జరగడం చూస్తున్నాం కదా. ఈ విషయంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?

జ: మన కవులకు ఇంకా కుర్రతనం వదల్లేదన్నమాట! కవిత్వానికి దోహదమిచ్చినంత మేర కవుల్లో పసితనం ఉండడం మంచిదే! “సదా బాలకు”డని నేను టాగోర్‌ని అన్నాను. కాని హద్దు మీరితే నవ్వుల పాలవుతామని కూడా తెలుసుకోవాలి.


ప్ర: నవలల్లో ప్రముఖంగా క్రైం, మోతాదు మించిన సెక్స్, మంత్రాలు, తంత్రాలు, పుర్రెల్లో పాములు - bizarre గా కనిపిస్తున్న ధోరణి మీరు గమనించారా? ఇది సినిమాలకి కూడా పాకింది. అమాయక జనుల్ని మరీ అజ్ఞానంలోకి తోస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ధోరణిని సహృదయులైన రచయితలు, కవులు ఉధృతంగా నిరసించాల్సిన అవసరం లేదా? వార్తా పత్రికల పాత్రని ఈ విషయంగా మీరు ఎలా అంచనా వేస్తారు?

జ: మీరన్నట్టు అమానుషమైన హింసతో, జుగుప్సాకరమైన్ క్రైంతో, మోతాదుకు మించిన సెక్స్ తో పాఠకుల్ని ఆకర్షించి లాభాలు గడించాలనే దురాశ పత్రికలవాళ్ళలో హెచ్చు పెరిగినట్లు కనిపిస్తోంది. దీనివల్ల వ్యక్తికీ, సంఘానికీ ఎంత ద్రోహం జరుగుతుందో వాళ్ళు గమనించినట్టు లేదు. అన్నిటికన్నా ప్రమాదం హింసని గొప్పగా ప్రదర్శించటం. దీనివల్ల జనాల అభిరుచులు వల్గరైజ్ అవుతాయి. వాళ్ళ అనుభూతి(feeling), చేతనా(sensibility) మొద్దుబారుతాయి. ఇటువంటి కథలు చదివే వ్యసనానికి లోనైనవారు క్రమంగా జంతుస్థితికి దిగజారే ప్రమాదముంది. చేతన మొద్దుబారితే విచక్షణా జ్ఞానం కూడా అడుగంటుతుంది. ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించినట్టు లేదు. సామాజిక స్పృహ అని కరవాలం తిప్పే రచయితల సంఘాలేం చేస్తున్నాయి? లాభాల కోసం తలపెట్టిన ఈ పోటీలో పాల్గొంటున్న పత్రికలకి అడుక్కి తప్ప మరో మార్గం లేదు. పాఠకుల్ని ఆకర్షించటం కోసం ఒకర్ని మించి ఒకరు హింసనీ, నేరాన్నీ, అమానుషప్రవర్తననీ, glorify చేయవలసి ఉంటుంది. వీళ్ళ ధనాశకి సామాన్య పాఠకులు బలి అవుతున్నారు. మానవత్వ నాశనానికి కారణమైన ఈ యజ్ఞానికి హోతలైన పత్రికాధిపతుల ధనాశని, స్వార్థపరత్వాన్నీ ఖండిస్తున్నాను.

శ్రీ సతీష్ చందర్ చేసిన ఇంటర్వ్యూ


(చెట్లు తమవేళ్ళతో ప్రహరీ గోడల్ని కూల్చేస్తున్నాయ్. లోపల తెరిచిన హృదయాల్లా వెల్లకిలా పడుకొన్న సిమెంటు సోఫాలు. వాటి మధ్య నుంచి నడిచిపోతే - ఓ పాత కాలం పెంకుటిల్లు. వరండాలో నిలబడితే ఎవరో వచ్చి లోపల కూర్చోమన్నారు. విశాలంగా వున్న కుర్చీలో కూర్చొని చూస్తే ఎదురుగా ఉన్నా టీపాయ్ పిల్లల కోడిలా ఉంది. కింద మరో నాలుగు పిల్ల టీపాయ్‌లు ఉన్నాయి. గోడమీద కృష్ణశాస్త్రి బోసినోరు విప్పకుండా నవ్వుకుంటున్నాడు. బాధను రుద్దినట్టే ప్రపంచం మీద ఆనందాన్ని కూడా రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో నడయాడే సరుగుడు చెట్టులా ప్రక్క గదిలోంచి వచ్చారు ఇస్మాయిల్. సముద్రపు గట్టున వున్నట్లనిపించింది. - వచ్చిన పని చెప్పాను. ప్రశ్నలు మూటగట్టుకొచ్చారా? అన్నారు. లేదు వాటంతటవే పుడతాయి అన్నాను. తన గదిలోకి తీసుకువెళ్ళారు. )

ప్ర. మీరు కవిత్వం ఎందుకు రాస్తారు?
జ. (నవ్వుతూ) ఎందుకు రాస్తాను? రాయకుండా వుండలేను కనుక రాస్తాను.

ప్ర. ఎందుకు రాయకుండా వుండలేరు?
జ. స్వీయానుభవాల్ని అర్థం చేసుకునేందుకు చేసే ప్రయత్నమే కవిత్వం. ఐతే ఇందుకోసమే కవిత్వం రాయాలా? మరో విధంగా ఇది సాధ్యం కాదా? అంటే కాదనిపిస్తుంది. ఇటువంటి అనుభవం మరొక విధంగా అభివ్యక్తం కాదు కనుక. కవిత్వం ద్వారానే అది సాధ్యం కనుక. కవిత్వమే రాయాలనిపిస్తుంది.

ప్ర. అనుభవం, అనుభూతి రెండూ ఒకటేనా?
జ. కాదు. అనుభవ పదాన్ని ఇంగ్లీషులో experience అనే అర్థంలోనూ, అనుభూతి అనే పదాన్ని feeling అనే అర్థంలోనూ వాడుతున్నాం. అనుభవాన్నించి కవిత్వం పుడుతుంది. కవిత్వ ప్రతిఫలం పాఠకునిలో రేకెత్తే అనుభూతి.

ప్ర. మిమ్మల్ని అనుభూతి కవుల్లో లెక్కవేస్తారు కదా? మీరు అనుభూతి కవేనా?
జ. అనుభూతి కవిత్వమనే పేరు మొదట తిట్టుగా వాడారు రాజకీయ కవులూ, విమర్శకులూ. నిజానికి కవిత్వానికి లేబిల్స్ అంటించడం నాకిష్టం ఉండదు. ఆలోచన నుంచి తప్పించుకొనే మార్గాలు లేబిల్స్. అర్థం చేసుకొనే కష్టానికి పాల్పడకుండా, తేలిగ్గా కొట్టిపారెయ్యడానికి లేబిల్స్ ఉపయోగిస్తారు. ‘బూర్జువా, శ్రామికవర్గం, రివిజనిస్టు లాంటి లేబిల్స్ అంటించి ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మానేయవచ్చు. లేబిల్స్ ఉపయోగించడం నాకిష్టం లేదు. అందుకనే నా కవిత్వానికి పేరు పెట్టనీయలేదు.

ప్ర. ఐతే మీ కవిత్వం అనుభూతి కవిత్వంలోకి రాదన్నమాట?
జ. శ్రీకాంత శర్మనీ, శ్రీమన్నారాయణనీ, నన్నూ అనుభూతి కవులంటున్నారు. అందరం తలోరకంగా రాస్తున్నాం. అందరి కవిత్వాన్ని గుదిగుచ్చి ఒకలాంటిదేనని ఎలా చెబుతాం? మా కవిత్వానికి అంత దగ్గిర పోలికలున్నాయా? (ఆలోచనలో పడ్డారు). ఒక విధంగా చూస్తే మేమందరమూ ఇమీడియట్ ఎక్స్‌పీరియెన్స్‌కి అంటే ప్రత్యక్ష అనుభవానికి రియాక్టయి రాస్తున్నాం. అంతమాత్రాన ట్రేడ్ మార్క్ లేబిల్ చీట్లు మా వీపుల మీద అంటించక్ఖర్లేదు.

ప్రస్తుతం తయారవుతున్న కవిత్వాన్ని రెండు రకాలుగా విశాలంగా వర్గీకరించవచ్చుననుకుంటాను. poetry of ideas (అభిప్రాయ కవిత్వం), poetry of experience (అనుభవ కవిత్వం). నా కవిత్వంలో అభిప్రాయాలు ముఖ్యం కాదు. అది ప్రబోధాత్మకంగా ఉండదు. నేనే విధమైన statements చెయ్యను. నేను కవిత్వాన్ని అనుభవించి రాస్తాను.

ప్ర. అంటే, experiencesలో ideas అంతర్లీనంగా వుండవంటారా?
జ. అంతర్లీనంగా వుంటాయి. అనుభవం ముఖ్యం. ఆ అనుభవాన్ని వ్యక్తం చేసే ప్రయత్నమే కవిత్వం. ఈ అభివ్యక్తి తన ఇంద్రియాలను స్పర్శించే పదచిత్రాల ద్వారా జరుగుతుంది.
ప్ర. కేవలం అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారన్నారు కదా! అలాంటప్పుడు అది కవిత్వమౌతుందా?
జ. కేవలం అభిప్రాయాలుంటే అది కవిత్వం కాదు.

ప్ర. అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం - కవిత్వమని ఒప్పుకుంటారా?
జ. వాటిల్లో కవిత్వం అనిపించుకునేవి చాలా తక్కువగా ఉన్నాయి. రాజకీయ అభిప్రాయాల పొలిమేరలు దాటి కవి వైయక్తిక అనుభవాన్ని స్పర్శించిన చోట్ల కవిత్వం ఉద్భవించింది.

ప్ర. శ్రీశ్రీ గారి ప్రతిజ్ఞ ఉందనుకోండి. లండన్ అభ్యుదయ కవుల మేనిఫెస్టో చదివాక రాసింది కదా. అంటే అభిప్రాయాల మీద రాసింది. మీరు దాన్ని కవిత్వం కాదంటారా
జ. దాన్లో కవిత్వేతరమైంది చాలానే ఉంది. అలాంటివి తీసేస్తే శ్రీశ్రీ గొప్ప కవిత్వం చాలా రాశాడు.

ప్ర. రాజకీయాలు జీవితంలో భాగమేగా? అప్పుడు అనుభవంలో రాజకీయాలు కూడ మిళితమై ఉన్నట్లేగా?
జ. అవును.

ప్ర. అప్పుడు కవిత్వంలో పరోక్షంగా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయిగా?
జ. కవిత్వమనేది కవికీ, ప్రపంచానికీ మధ్య ఏర్పడే సంబంధం. కవి చేతనా (sensibility), భౌతికమైన విషయాలు ఒకదాని మీద ఒకటి రియాక్టయితే కవిత్వం పుడుతుంది. అటువంటప్పుడు విప్లవం వర్ధిల్లాలి, వర్గరహిత సమాజం ఏర్పడాలి అంటే కవిత్వమెలా అవుతుంది? అవి అభిప్రాయాలే అవుతాయి. అందులో కవి చేతనకీ సంబంధమేమీ లేదు.

ప్ర. మీ “చిలకలు వాలిన చెట్టు” కవితా సంకలనంలో “కవిత్వం” అనే ఖండిక ఉంది. అందులో సుందరి ఇచ్చిన విత్తనాన్ని నాటితే పుట్టిన మొక్క మహావృక్షమైతే ఆ వృక్షమెక్కి మళ్ళీ అదే సుందరిని అన్వేషించినట్లు రాశారు. ” కళ కళ కోసం” అన్న భావంతో అలా రాశారా?

జ.”కళ కళ కోస”మని కాదు. అందులో కవిత్వ బీజం ఉద్భవించడం, అది పెరగడం, అది తాల్చే చరమరూపం దాని వల్ల కలిగే ప్రయోజనమూ - ఇవన్నీ గమనిస్తే చాలా అద్భుతంగా (miraculous) తోస్తాయి. అంచాతనే కాశీ మజిలీ కథ గుర్తుకొచ్చింది. సుందరిని కవి వెతుక్కూ వెడతాడంటే కవిత్వం ఎప్పుడూ అన్వేషణే అని నా అభిప్రాయం. కవిత్వం అనే అద్భుతాన్ని అభివ్యక్తం చేయటానికి కాశీ మజిలీ కథ symbol గా తీసుకున్నాను.

ప్ర. అంటే, ఇక్కడ కవిత్వానికి ఫలితం ఏమై ఉంటుంది?
జ. ఫలితం అన్వేషణ. కవిత్వం ఎప్పుడూ అన్వేషణే ప్రతి అన్వేషణా కొత్తగానే ఉంటుంది. అంచేత, ప్రతి కావ్యమూ కొత్తగానే ఉంటుంది.

ప్ర. మీరు కవిత్వాన్ని ” poetry of ideas”, “poetry of experience” అని రెండు రకాలుగా వర్గీకరించారు. ఐతే, ఐడియాలను కూడా తమ ఎక్స్పీరియన్స్‌లోకి తెచ్చుకొని మంచి కవిత్వం రాస్తున్నవాళ్ళు ఇప్పుడెవరైనా ఉన్నారా? అదే, మీరు చెప్పినట్లు, శ్రీ శ్రీ లాగా రాసేవాళ్ళు, లేక అందరూ నినాదాలే రాస్తున్నారంటార?
జ. ఎందుకు లేరు? ఐతే, వారు ఎక్కువభాగం నినాదప్రాయంగానే రాస్తున్నారు. కాని మంచి కవిత్వం రాస్తున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఐతే వీళ్ళలో ఎక్కువమంది ఒకే ఐడియాకు కట్టుబడి, రాసిందే రాయడం వల్ల, వీళ్ళ కవిత్వంలో పునరుక్తి(repetition) ఎక్కువ కనిపిస్తుంది.

ప్ర. ఎందుచేతంటారు?
జ. ఒకే ఐడియాను ఎన్ని విధాలుగా చెప్పగలరు? అందుకని వీళ్ళలో చాలా మందిలో రిపిటీషన్ కనిపిస్తుంది. కొత్తదనం ఉండదు. కవికి స్వేచ్ఛ అవసరం. కవి మనసుని ఎగరనివ్వాలి. భావనని మార్క్సిస్టు పంజరంలో పెట్టి బంధించకూడదు.

ప్ర. మార్క్సిస్టు దృక్పథంలో కవిత్వం రాస్తున్నవాళ్ళు ఎక్కడున్నా ఇలాగే ఉంటారా? మీరు చెప్పింది విదేశీ కవులకు కూడా వర్తిస్తుందా? ఉదాహరణకి జర్మన్ కవి బ్రెహ్ట్ ఉన్నాడు. అతని కవిత్వంలో రిపిటీషన్ కనిపిస్తుందా?
జ. పార్టీ రాజకీయాల కన్నా కవిత్వమే బ్రెహ్ట్‌కి ముఖ్యం. తనకు నచ్చని చోట కమ్యూనిస్టు పార్టీని వ్యతిరేకించడానికి అతడు జంకలేదు. రాజకీయ అభిప్రాయాలకు అంతగా కట్టుబడలేదు. మన శ్రీ శ్రీ కి కూడా మహాప్రస్థానం గేయాలు రాసేనాటికి అంత నిబద్ధత లేదు. అది అతని మానసిక స్వేచ్ఛ నుంచి, తిరుగుబాటు తత్వం నుంచి పుట్టుకొచ్చాయి. ఈ విషయం మర్చిపోకండి.

ప్ర. అంటే, నిబద్ధత పాలు ఎక్కువైనప్పుడు కవిత్వాంశ తగ్గుతుందన్నమాట?
జ. అవును. అలా జరగడం చూస్తున్నాం.
( ఇంకా చెబుతారని ఎదురుచూస్తే, ఆయన అడగని ప్రశ్నకి సమాధానమివ్వడానికి ఉపక్రమించారు.)
జ. నేను కవిత్వంలో ఒక ముఖ్యమైన పని చేయడానికి పూనుకున్నాను. భాషని శుభ్రపరచడానికి ప్రయత్నించాను. చాలా మాటలకు మాసిన రంగులు, పాత వాసనలు ఉంటాయి. అలాంటి మాటల్ని కవిత్వంలో వాడలేదు. పాత కావ్యాల్లోనివి, పురాణాల్లోని పదాలు, సమాసాలు, పేర్లూ, కథలూ నా కవిత్వం జోలికి రాకుండా జాగ్రత్తపడ్డాను.
నా స్వంతమైన, సరికొత్త అనుభవాల్ని వ్యక్తపరచటానికి, వ్యావహారికప్రపంచంలోని సరికొత్త మాటల్నే కోసుకొచ్చి వాడుకున్నాను.

ప్ర. శ్రీ శ్రీ అలాంటి పాత పదాల్నే ఎక్కువగా వాడారంటారా?
జ. శ్రీ శ్రీ కవిత్వంలో పాత వాసన చాలా ఉంది. అందుకే అతని కవిత్వం ఛాందసపండితులకు కూడా నచ్చుతుంది.

ప్ర. ఇలా భాషను శుభ్రపరచే ప్రయత్నం చేసిన వాళ్ళలో మీరే తెలుగులో ఆద్యులా?
జ. మొదట చలం ఆ ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో నేను చలాన్ని అనుసరించాలనుకుంటున్నాను.

ప్ర. మీరు “చెట్టు” ఇస్మాయిల్‌గా పాపులర్ అయ్యారు. అసలు చెట్టుకూ, మీకూ ఇంత గట్టి సంబంధం ఎలా ఏర్పడింది?
జ. చెట్టంత అందమైన వస్తువేముంది? చెట్టు ఉపయోగపడ్డట్టుగా ఏది ఉపయోగపడుతుంది? చెట్టు పూలు పూస్తుంది. అంత అందమైన పని అదొక్కటే చేయగలదు. అందుకే “చెట్టు నా ఆదర్శం”లో అన్నాను.
“ధరను చొచ్చి, దివిని విచ్చి, విరులు తాల్చు తరువు”
వేర్లు సంప్రదాయానికి, కొమ్మలు స్వేచ్ఛా చింతనకి ప్రతీకలు.

ప్ర. సంప్రదాయం అంటే ఏ సంప్రదాయం?
జ. సారస్వత సంప్రదాయం.

ప్ర. గతంలో మనకి మంచి కవిత్వం వచ్చిందంటారా?
జ. (నవ్వి) వెనక్కి యాభై ఏళ్ళు దాటితే కవిత్వం ఎక్కడుంది? నన్నయ, తిక్కన లాంటి వారున్నారనుకోండి. వాళ్ళు బాగానే రాశారు. బాగా రాయటం వేరు, కవిత్వం రాయటం వేరు. వాళ్ళల్లో అక్కడక్కడ కవిత్వపు మెరుపులు మెరుస్తుంటాయి.

ప్ర. మీ కవిత్వం మీద మన తెలుగు కవుల ప్రభావం ఏమైనా ఉందా?
జ. నా మీద ఇద్దరి ప్రభావం ఉంది. ఒకరు కృష్ణశాస్త్రి. మరొకరు శ్రీ శ్రీ. కవి కాదలచినవాడు నేర్చుకోవలసింది అనుకరించటం కాదు. ఎలా రాయాలో నేర్చుకోవాలి. అంతకంటే, ఎలా రాయకూడదో నేర్చుకోవాలి.

ప్ర. చూడబోతే మీరు ఎలా రాయకూడదో ఎక్కువగా నేర్చుకున్నట్టున్నారే?
జ. (నవ్వి) నేనెలా రాయాలో, ఎలా రాయకూడదో ఎక్కువగా నేర్చుకున్నది కృష్ణశాస్త్రి నుంచే. అలాగే నాకు స్పానిష్ కవి లోర్కా అంటే ఇష్టం. జర్మన్ కవి రిల్కే అన్నానూ. ఇంకా చాలా మంది యూరోపియన్ కవులు నాకిష్టులు. ఈ మధ్య అమెరికన్ కవులకవిత్వాన్ని కూడా డిస్కవర్ చేశాను. ఇంగ్లాండ్లో యేట్స్, ఆడెన్, హ్యూ, ప్లాత్ వంటి మంచి కవులున్నా అమెరికన్ కవులే నాకు ఎక్కువ నచ్చుతున్నారు. వ్యావహారిక భాషలో రాస్తూ, వచనంలో ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళూ. నాలాగే అనుభవాత్మకమైన కవిత్వం రాస్తున్నారని అనిపించింది. ఐతే వాళ్ళని చదవకమునుపే ఇటువంటి ప్రయోగాలతో, ఇటువంటి కవిత్వం రాశాను కనుక వాళ్ళ ప్రభావం నా మీద ఏ మాత్రమూ లేదూ.

ప్ర. అమెరికన్ కవుల్లో ఎవరు మిమ్మల్ని బాగా ఆకర్షిస్తారు?
జ. విలియం కార్లోస్ విలియంస్, రాబర్ట్ ఫ్రాస్ట్, డెనిస్ లెవర్‌టాప్, రిచర్డ్ ఎబర్‌హార్ట్, రిచర్డ్ విల్బర్, లూయీ సింప్సన్.

ప్ర. భారతీయాంగ్ల కవులు ఎలా రాస్తున్నారిప్పుడు?
జ. మంచి కవిత్వమే రాస్తున్నారు. పార్థసారథి, రామానుజన్, నిసిం ఎజ్కియేల్, కొళాట్కర్, జస్సావాలా, దారూవాలా, ప్రీతిష్ నంది మొదలైన వాళ్ళు, ఐతే తెలుగులో లాగా వీళ్ళెవరూ సాహిత్యేతర ప్రయోజనాలకోసం రాయడం లేదు. తెలుగు దేశంలో కవిత్వం రాజకీయ ఊబిలో దిగబడిపోయింది. మన కవులకి కవిత్వానికి సంబంధించిన విషయాలకన్నా కవిత్వేతర విషయాల మీదే ఎక్కువ ఆసక్తి.

ప్ర. ఇప్పుడు రాస్తున్న యువకుల్లో శుద్ధకవిత్వం ఎవరు రాస్తున్నారు?
జ. రవూఫ్ బాగానే రాస్తున్నాడు. అతని “అంతర్నేత్రం” చూశారు కదా. అలాగే శిఖామణి, “మువ్వల చేతికర్ర” లో మంచి కవితలున్నాయి. గోదావరిశర్మ మంచి కవిత్వం రాస్తున్నాడు. అఫ్సర్ బాగా రాయగలడు నిబద్ధత సడలించుకోగలిగితే. శేషేంద్ర కొడుకు వనమాలి బాగానే రాస్తున్నారు.

ప్ర. శేషేంద్రంటే గుర్తొచ్చింది. ఆయన కవిత్వంలో అస్పష్టత ఉందంటారు, నిజమేనా?
జ. శేషేంద్ర కవిత్వంలో అస్పష్టత కంటే నాకు రిపిటీషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఆయన కవిత్వంలో చాలా కవితలు ఒకేలా ఉంటాయి. ఫిక్స్‌డ్ అయిడియాస్ వల్లననుకుంటాను.

ప్ర. వేగుంట మోహన ప్రసాద్ గారి మాటేమిటి?
జ. “చితి - చింత”లో చాలా మంచి కవితలున్నాయి. ఆయన సర్రియలిస్టు కవితలు నాకర్థం కావు.

ప్ర. తెలుగులో సర్రియలిస్టు కవిత్వం ఎలా ఉంటోంది?
జ. తెలుగులో సర్రియలిస్టు కవిత్వం రాసినవాళ్ళలో మొదటివాడు శ్రీ శ్రీ. అతనివి చాలావరకు అనువాదాలే. పోల్ ఎల్వార్, అంద్రె బ్రేతో లాంటి కవుల రచనల్ని అనువదించారు. ఐతే వాళ్ళది శుద్ధ సర్రియలిజం కాదు. శుద్ధ సర్రియలిజం ఫ్రాన్స్ లోనే నిలవలేదు. ఐతే, సర్రియలిస్టు ఉద్యమం ఒక మేలు చేసి పెట్టింది. భావనని ఆకాశమంత విశాలం చేసింది. “అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్” కు ఆస్కారం కలిగించింది. దాని ప్రయోజనం అంత వరకే. కానీ, మన మోహనప్రసాద్ మాత్రం శుద్ధ సర్రియలిజంలోకి వెళ్ళిపోతున్నాడు. కవిత్వంలో మానసిక విశృంఖలత పనికిరాదు. కవిత్వం ఒక ఆర్గనైజ్‌డ్ ఆక్టివిటీ. కంట్రోల్ వదిలేస్తే కవిత్వం దెబ్బతింటుంది.

ప్ర. కవిత్వం రాజకీయాలకు ఉపయోగపడుతుందా?
జ. ఉపయోగపడదు. కవిత్వం వల్ల ఒక్క వోటు కూడా రాదు.

ప్ర. రష్యా, చైనా విప్లవోద్యమాల కాలంలో పోరాటానికి ఉత్తేజితులై కొందరు కవిత్వం రాశారు. అది కవిత్వమని ఒప్పుకుంటారా?
జ. రష్యాలో కమ్యూనిస్టులైన కవులూ, కమ్యూనిస్టులు కాని కవులూ కూడా మంచి కవిత్వం రాశారు. అలెక్సాండర్ బ్లోక్, మయకోవ్‌స్కీలు విప్లవాన్ని సమర్థించారు. మయకోవ్‌స్కీ నిబద్ధత ఉన్నప్పటికంటే నిబద్ధత లేనప్పుడే మంచి కవిత్వం రాశారు. అతను చివర్లో విప్లవం పట్ల అసంతృప్తి చెందాడు. అతని ఆత్మహత్యకి అదే కారణమంటారు. కమ్యూనిస్టులు కాకుండా గొప్ప కవిత్వం రాసినవాళ్ళను సోవియట్ ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టింది. అన్నా అఖ్మతోవా, మెండెల్‌స్టాం, సవటయేవా, బోరిస్‌పాస్టర్‌నాక్ - వీళ్ళు నానా హింసలు పడి, అద్భుతమైన కవిత్వం రాశారు.

ప్ర. కొత్తగా కలాలు పట్టుకొని కవిత్వం రాస్తున్నవాళ్ళకి సూచన లాంటిది ఏమైనా చేస్తారా?
జ. ఏం చెబుతాను. బలవంతంగా రాయొద్దంటాను. రాయకుండా ఉండలేకపోతేనే రాయమంటాను. కవిత్వం బుద్ధి వల్ల కలగదని గ్రహిస్తే చాలు. మినీ కవిత్వం రాస్తున్న యువకవులు చమత్కారమే కవిత్వం అనుకుంటున్నారు. చమత్కారం వేరు, కవిత్వం వేరు. కవిత్వం చేతన (sensibility) కి సంబంధించినది. బుద్ధి(reason)కి కాదు. అంచేత, కవిత్వాన్ని కవిత్వం రాసుకుంటుంది. let the poem write itself.

....... జనవరి 18, 1988 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమయింది

ఇస్మాయిల్ గారి గురించి ఇతరుల అభిప్రాయాలు


ఇస్మాయిల్ గార్ని తలుచుకోగానే తక్షణం గుర్తొచ్చేవి ఆయన ఆకుపచ్చ అక్షరాలే. శిధిల నేత్రాలు అనే నా కవిత అచ్చులో చూసి ఇది తెలుగు పద్యంలా లేదుఅంటూ మెచ్చుకుంటూ రాశారాయన. అఫ్సర్
ఆయన చిన్నతమ్ముడు వజీర్ రెహ్మాన్, నలుగురు అన్నదమ్ముల్లో ఆఖరివాడు మరణించిన కొంతకాలానికి ఆయన మూడో తమ్ముడు చనిపోయారు. అప్పుడు ఇస్మాయిల్ గారు ఉత్తరం రాస్తూ ఈ వరస కింది నుంచి మొదలైనట్టుంది. మనకి ఆట్టే దూరం లేదు అన్నారు. అన్నట్టుగానే అదే వరుసలో మరణాలు జరిగాయి స్మైల్
ప్రజాతంత్రలో నా విస్మృతికవిత అచ్చుకాగానే కవిత నచ్చిందని చెపుతూ రాసిన ఉత్తరంతో పాటు ఇంకెక్కడా ఖాళీ దొరకనట్టు అనంతపురం వెళ్లారేమిటి? అక్కడసలే గాడిదలు ఎక్కువ అంటూ ఓ చెణుకు. ఇస్మాయిల్ గారు అనంతపురం కాలేజీలో పనిచేసారు కల్పనా రెంటాల
పతంజలి శాస్త్రి కి ఇస్మాయిల్ గారు తమ కుమారుని పెళ్ళికి ఆహ్వానిస్తూ వ్రాసిన ఉత్తరం ధర్మపత్ని సమేత: ఇస్మాయిల్ కవి: స్వపుత్రస్య పరిణయ మహోత్సవం....... అంటూ సరదాగా సంస్కృతంలో సాగుతుంది.
ఆయన నాకు రాసిన కార్డు (26-10-2003) ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడ్తున్నట్టు అనిపించింది. నా ఆరోగ్యం కూడా నన్ను మర్చిపోయింది. చాలా జబ్బుపడ్డానుఅని యాకూబ్
మేం (ఉభయులం) స్వేచ్ఛా భావుకులం, అభయులం, నిత్యబాలలం, నిత్యసంతోషులం, మాకులం విమల విశ్వశాంతి కులం, మంచి జీవన శిల్పులం, నాకు ఇస్మాయిల్ అంటే ఇష్టమంత ఇష్టం -- పి.వి. నరసింహారావు
అతని ప్రతికవితలోను ఒక మనోహరత్వాన్ని, ఒక హృదయరంజకత్వాన్ని అనుభవించాకనే నేను ఆయన మొదటి కావ్యాన్ని ప్రచురించాను - సోమసుందర్
తనకు పోటీగా ఎన్ని ప్రబల కవి సిద్దాంతాలు ఉన్నా, తనదైన వాదాన్ని కడదాకా నిలిపిన గొప్ప కవి, కవిత్వాన్ని మానవతా ప్రబోధ సాధనంగా మహోన్నత శిఖరాలపై నిలిపాడు ఇస్మాయిల్ -- సి.నా.రె.
సాదీ మహాకవి ఒక మాటంటాడు " జ్ఞానవంతులకు పచ్చని చెట్టులోని ఒక్కొక్క ఆకు ఒకో దివ్యజ్ఞాన ప్రపంచంలాగ కనిపిస్తుందని" , నిజంగా ఈ మాటలకు నూటికి నూరు పాళ్లూ సరిపోయే తెలుగు కవి ఇస్మాయిల్ మాత్రమే -- శిఖామణి
ఒక రుషిలాగ, సూఫీ కవిలాగ, ఒక హైకూగా ఇస్మాయిల్ బతికాడు. తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్య చరిత్ర పుటల మీద పచ్చని సంతకంలా ఇస్మాయిల్ పది కాలాలు పదిలంగా ఉంటాడు - ఎండ్లూరి సుధాకర్
ఈయన సదా బాలకుడిగా లోకాన్ని చూసాడు, నిత్య నూతనుడిలా జీవించాడు -- స్మైల్
వెయ్యి సంవత్సరాల సాహిత్య జీవితంలో తెలుగులో ఇలాంటి కవి మరొకరు లేరు - వేల్చేరు నారాయణరావు
ఇస్మాయిల్ ఎందుకు విశిష్టకవి అయ్యారంటే, ఏ వ్యాసం ద్వారానో, విస్తృతమైన నవలద్వారానో, కధ ద్వారానో, వార్తా కధనం ద్వారానో చెప్పదగిన ఆవేశకావేషాలను, సిద్దాంత చర్చలను, ఒక నిలువెత్తు పద్యంలా పోతపొయ్యటానికి ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
నేను పెద్ద సాహిత్య విమర్శకుడిని కాదు కాని, శ్రీశ్రీ తర్వాత తెలుగు కవిత్వాన్ని మరో మలుపు దాటించిన వాడు ఇస్మాయిల్ అని నేను గట్టిగా నమ్ముతాను -- సి. ధర్మారావు.
సాదా సీదాగా ఉండే ఇస్మాయిల్ కవిత్వానికి అంతశక్తి ఎక్కణ్ణించి వచ్చిందంటే నిబద్దత లేకపోవడమే ఆయన కవిత్వ శక్తికి కారణంఅని ఆయన (అఫ్సర్ తండ్రిగారు) లెనిన్ అన్నమాటని గుర్తుచేసేవారు -- అఫ్సర్

ఆణిముత్యాలు


ఇస్మాయిల్ గారు వివిధ సందర్భాలలో వెలువరించిన అభిప్రాయాలు
క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ, వాటి స్పందనలూ, జీవితాన్ని జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం?
అనుభూతి ఎప్పుడూ వైయక్తికమే. అనుభవ వస్తువు ఒకటైనా, ఎవరి అనుభూతి వారిది. అది ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఒకరి అనుభూతిలా మరొకరి అనుభూతి ఉండదు. ఈ నవనవోన్మేషమైన అనుభూతిని ఆవిష్కరించటమే కవి కర్తవ్యం
కవి అనుభవాల్ని తనలో ఇంకించుకుని, అంతర్దర్శి ఐననాడే మంచి కవిత్వం జనిస్తుంది.
అనుభూతులు శబ్ద ప్రపంచానికి చెందినవి కావు. ఈ నిశ్శబ్దాన్ని శబ్దంలోకి ప్రవేశపెట్టటమే కవిత్వం విశిష్ట లక్షణం. కవిత్వానికి శబ్దమెంత ముఖ్యమో నిశ్శబ్దం కూడా అంతే.
పదచిత్రమనేది ఐంద్రియకం (sensuous). ఇంద్రియ జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. హేతుబుద్ధికి సంబంధించింది కాదు. లోతైన అనుభూతుల్నీ(feelings), భావాల్నీ(emotions) ఆవాహించే శక్తి పదచిత్రానికుంది.
లేబిల్స్ ఉపయోగించడం నాకిష్టం లేదు. అందుకనే నా కవిత్వానికి పేరు పెట్టనీయలేదు
ప్రస్తుతం తయారవుతున్న కవిత్వాన్ని రెండు రకాలుగా విశాలంగా వర్గీకరించవచ్చు ననుకుంటాను. poetry of ideas (అభిప్రాయ కవిత్వం), poetry of experience (అనుభవ కవిత్వం).
మినీ కవిత్వం రాస్తున్న యువకవులు చమత్కారమే కవిత్వం అనుకుంటున్నారు. చమత్కారం వేరు, కవిత్వం వేరు.
కవిత్వం వల్ల కొంపలు కాల్తాయి. విప్లవాలు వస్తాయి అని మీరనుకున్నట్టయితే నిరాశ కోసం సిద్ధపడండి. అది చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది. ఫలానా దారినే నడవమని ఒకరు చెబితే వినడు మనిషి. అది తనకు తోచాలి. తన దారేదో తను నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయానికి కవిత్వం తోడ్పడుతుంది.
బ్రహ్మాండం బద్దలయ్యే సంఘటనలకి బ్రహ్మాండం బద్ధలయే కవిత్వం పుడ్తుందని ఆశించడం అమాయకత్వం.
ప్రతిదేశంలోనూ అభ్యుదయం పేరనో, విప్లవం పేరనో రచయితల సంఘాలు ఏర్పరచి, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడని సాహిత్యం పనికిమాలినదని యువ రచయితలకు నూరి పోసి వాళ్ల చేత నినాద ప్రాయమైన శుష్కరచనలు రాయించి పార్టీ ప్రచారం చేయించుకొంటున్నారు. సాహిత్యంలో రాజకీయ కాలుష్యాన్ని మొదట్నించీ ఎదిరిస్తూ వచ్చాను. కమ్యూనిష్టు ప్రభావం వల్ల ఎంతో మంది యువరచయితలు, జబ్బుపడి సాహిత్యపరంగా శవ ప్రాయులయ్యారు. ఆ అకవిత్వ కల్మషం దేశమంతా అలముకొంది. ఈ వెల్లువ ఇంకా తగ్గినట్టు లేదు. దీనికి వ్యతిరిక్తంగా, అంటే సాహిత్యంలో స్వేచ్ఛకోసమూ, రచయితల వ్యక్తి ప్రాధాన్యాన్ని ఉగ్గడిస్తూనూ, నలభైయ్యేళ్ల బట్టి పోరు సాగిస్తున్నాను.
కవిత్వం హృదయ సంబంధి. ఆలోచనా వ్యవస్థ బుద్ధికి సంబంధించినది. కవిత్వాన్ని బుద్ధి (Reason) శాసించలేదు.దాని సామ్రాజ్యమే వేరు.
కవిత్వమనేది కవి సంపూర్ణ అస్తిత్వంలోంచి ఉద్భవిస్తుంది. నేను బ్రాహ్మణుణ్ణి లేదా దళితుడిని అని జీవితాన్ని కుంచింపజేసుకున్నవాడు కవిత్వమేం రాయగలడు?
జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని. ఈ విధంగా మన చేతనని సుసంపన్నం చేస్తుంది కవిత్వం.

-ఇస్మాయిల్ గారి రచనలు, అవార్డులు/రివార్డులు

ఇస్మాయిల్ రచనలు
1. చెట్టు నా ఆదర్శం
2. 
మృత్యువృక్షం
3.
చిలకలు వాలిన చెట్టు
4. 
రాత్రి వచ్చిన రహస్యపు వాన
5.
బాల్చీలో చంద్రోదయం
6.
 కప్పల నిశ్శబ్దం
7.
రెండో ప్రతిపాదన (అనుసృష్టి)
8. 
కరుణ ముఖ్యం
9. 
కవిత్వంలో నిశ్శబ్దం
10.
పల్లెలో మా పాత ఇల్లు
-
చివరి మూడు రచనలలో, మొదటి రెండూ సాహితీ విమర్శనా వ్యాస సంపుటులు, చివరది ఆయన మరణానంతరం, అభిమానులు వెలువ రించిన కవితాసంకలనం. (హైపర్ లింకులు కలిగిఉన్న పుస్తకాల పేర్లపై క్లిక్ చేసినట్లయితే ఆ పుస్తకాలను ఈమాట వారి ఆర్చైవులలో చదువుకొనవచ్చును)
అవార్డులు/రివార్డులు
•1989లో ఇస్మాయిల్ గారి షష్టిపూర్తి, రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి గారి చేతులమీదుగా జరగటం ఒక గొప్ప విశేషం.
•1999
లో కళాసాగర్ వారి విశిష్ట పురస్కారాన్ని అందుకొన్నారు
•15-6-2003
హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చెట్టంత కవికి పిట్టంత సత్కారంపేరిట ఇస్మాయిల్ అభినందన సభ జరిగింది.
కవిత్వంలో నిశ్శబ్దం అన్న సాహిత్య వ్యాసాలకు తెలుగు విశ్వవిద్యాలయం వారు అవార్డు నిచ్చారు.
చివరగా

కీర్తి శేషుడైన కవి
కాలతీరాన
కాసేపు పచార్లు చేసి
గులకరాయొకటి
గిరవాటేసి
తిరిగి వెళ్లిపోయాడు
-
అన్న ఆయన కవితావాక్యాలలోని కవి ఎవరనేది ఇన్నాళ్లకు అర్ధం అయ్యింది. ఆయన ఎవరో కాదు ఇస్మాయిల్ గారే.
చెట్టు నా ఆదర్శం అని ప్రకటించుకొన్న ఇస్మాయిల్ గారి కవిత్వం తెలుగు సాహిత్య చరిత్ర లో చిరస్థాయిగా నిలుస్తుంది.
ఆయన సాహిత్య శకటాన్ని ఎక్కడ ఆపారో దాన్ని అక్కడి నుండి కొనసాగించటం తదుపరి కర్తవ్యం, భుజానికెత్తుకోవలసిన ఇంకొక పని - ఆయన ఎంతో ప్రేమతో, ఓపికతో నెరవేర్చినదే ఎందరో సదా బాలకుల రాకకు అనుకూలంగా దారిని సుగమం చేయటం - అన్న తమ్మినేని యదుకుల భూషణ్ గారి మాటలు స్మరించుకొందాం.

Acknowledgements

1. Md.
రెహ్మాన్ లెక్చరర్, కాకినాడ (ఇస్మాయిల్ గారి బంధువు)
2.
అంతర్జాలంలో పైన ఉటంకింపబడిన లింకులలోని ఇస్మాయిల్ గారి వివిధ రచనలు
3.
సలాం ఇస్మాయిల్ వ్యాస సంపుటి
4. Tribute to Ismail –DVD by Indraganti’s Family
*************************************************************************
మరిన్ని ఫొటోలతో ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవొచ్చు.

ఇస్మాయిల్ గారి పరిచయం

ఇస్మాయిల్ గారు 26 మే, 1928 న జన్మించారు. వీరు కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేసారు. 25 నవంబర్, 2003 న ఆయన అనంత నిశ్శబ్దం లోకి జారిపోయారు. కవిగా, విమర్శకునిగా ఇస్మాయిల్ గారు పోషించిన పాత్ర తెలుగు సాహితీవనంలో నిలువెత్తు పొగడచెట్టై పరిమళాలు చిందిస్తూనే ఉంటుంది. ఆయన రచించినవి పదిపుస్తకాలే కావొచ్చు, అన్నీ కలిపి ఓ మూడు, నాలుగొందల పేజీల సారస్వతమే అవ్వొచ్చు, కానీ వాటి ముద్ర మాత్రం తెలుగు సాహిత్యంపై ఏ నాటికీ చెరగనిది.
ఇస్మాయిల్ కవిత్వం
ఇస్మాయిల్ గారనగానే రెండు విషయాలు చాలామంది స్మరణకు వస్తాయి. మొదటిది “’చెట్టు నా ఆదర్శంఅన్న ఇస్మాయిల్, రెండవది ఆయన ఆంధ్రదేశానికి పరిచయం చేసిన హైకూ. ఇస్మాయిల్ కవిత్వ భాష విశిష్టమైనది. క్లిష్టపదాలు, పొడుగు వాక్యాలు ఉండవు. ఛందస్సులు, లయ శయ్యల వంటివి కనపడవు. అయినప్పటికి ఈయన కవిత్వం ఒక అనుభూతిని పదచిత్రాల ద్వారా పఠితకు ప్రసారం చేసి అతనూ అనుభూతి చెందేలా చేస్తుంది, అదీ ఎంతో నిశ్శబ్దం గా.
సౌందర్యారాధన, మానవత్వంపై విశ్వాసం, స్వేచ్ఛాశీలత, ప్రకృతి ఉపాసన ఆయన కవిత్వానికి కాన్వాసు. మన దైనందిక విషయాలను, చిన్న చిన్న అనుభవాల్నీ, అపుడపుడూ ప్రకృతి కరుణించే సుందర దృశ్యాలకు, కరుణ తాత్వికలను అద్ది కవిత్వంగా మలచి మనకందించారు. ఇస్మాయిల్ కవిత్వంలో ఇజాలు, వాదనల వంటి శృంఖలాలు కనిపించవు. కేవలం కవిత్వం మాత్రమే వినిపిస్తూంటుంది. జీవితోత్సవాన్ని ఎన్నికోణాల్లో ఆనందించవచ్చో అన్ని కోణాల్నీ ఆయన తన కవిత్వంలో ఆవిష్కరించారు. అందుకనే ఇస్మాయిల్ గారి పుస్తకాలను వరుసగా చదువుతున్నపుడు ఇతివృత్త సంబంధమైన మొనాటనీ కనిపించదు.
ఆయన కవిత్వంలో పదచిత్రాల సౌందర్యం పరిమళిస్తూంటుంది. పదచిత్రాల్ని ఎవరైనా కల్పన చేయగలరు. కానీ ఒక దృశ్యాన్ని నలుగురూ చూసే దృష్టితో కాక కొత్తగా దర్శించి దాన్ని పదచిత్రంగా మలచటం ఇస్మాయిల్ గారికే చెల్లింది. ఒక్కోసారి ఈయన ఇలా ఎలా చూడగలిగారబ్బా అని విస్మయంతో ఆశ్చర్యపడక తప్పదు. ఈ క్రింది ఉదాహరణలను చూస్తే అర్ధం అవుతుంది ఆయన విలక్షణ వీక్షణం.
ఎక్కడెక్కణ్ణించో ఎగిరి వచ్చిన కాకులు చింతచెట్టులో నల్లగా అస్తమిస్తాయి /
ప్రణయక్రీడలో మన అంగాల పాచికల్ని మహోద్రేకంతో విసిరి నక్షత్రాల పావుల్ని రాత్రల్లా నడిపించాం గుర్తుందా!” /
కిటికీలోంచి చూస్తే వెలుతురునిండిన బెజ్జాలతో పిల్లం గోవిలా ఊళవేసుకుంటూ దూసుకుపోతోంది రైలు /
తొలిసంజె నారింజని ఎవరు ఒలిచేరు, తెలిఎండ తొనలను ఎవరు పంచారు /
ఊగుతోంది వేయి పిర్రల సముద్రం /
మూగిన బంధుమిత్రులు మోసుకుపోయి అతణ్ణి విత్తనంలా పాతారు /
భూమి బుగ్గపై చల్లటి నవ్వు సొట్టలా బావి /
ఉదయాలు అనాది నుంచీ సూర్య శిశువును ఎన్నివిధాలుగా ఎగరేసి పట్టుకొన్నాయో/
నీడల విసనకర్రను విప్పి ఎండలో సేదదీరుస్తుంది చెట్టు
—–
ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కవితలనన్నీ టైప్ చెయ్యవలసి ఉంటుంది. ఎన్ని పదచిత్రాలు, ఎన్నెన్ని సునిశిత దృశ్యాలు.

బుద్దిగా ప్రేమించుకోక
యుద్దమెందుకు చేస్తారో
నాకర్ధం కాదు.
-
పై వాక్యాల సారాంసమే ఇస్మాయిల్ కవిత్వమూ, జీవితమూను. జీవితానందాల్ని గానం చేసే కవికి, వానిని పాడుచేసే మనుష్యులను చూస్తే ఇలాకాక వేరెలా అనిపిస్తుందీ!

తనని బాధిస్తున్న ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చకచక ఎటో నడిచిపోయింది (ఆత్మహత్య)
-
ఆత్మహత్యకు ఎంత అద్బుత నిర్వచనం. ఈ గుప్పెడు వాక్యాలలో, ఒక అమ్మాయి జీవితంలో ఓడి పోవటం, తద్వారా ఎదుర్కోవలసి వచ్చిన సామాజిక వివక్ష, నిత్యం ముల్లై బాధించిన ఈ ప్రపంచాన్ని ఇక ఏమాత్రమూ తప్పించుకోలేని దోషిగా నిలబెట్ట టమూ ఎంతగొప్పగా ఇమిడి పోయాయి.
సెలయేరా సెలయేరా
గలగలమంటో నిత్యం
ఎలా పాడ గలుగుతున్నావు?
చూడు, నా బతుకునిండా రాళ్లు
పాడకుంటే ఎలా?
- జీవితంలోని కష్టాలను కప్పిపుచ్చు కొని ఆనందంగా ఉండక తప్పదు అని ప్రవచించే ఈ కవితే ఇస్మాయిల్ గారి జీవితాదర్శం. ఆయనకు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా చిరు నవ్వు ను, సంతృప్తిని వీడ లేదంటారు సన్నిహితులు. అందుకేనేమో ఓ కవితలో ఇలా అన్నారు.

నేను డబ్బు సంపాదించలేదని
మా ఆవిడ సణుగుతుంది.
డబ్బెందుకు?
కిటికీ లోంచి వాలి టేబుల్ పై పుస్తకాన్ని, పెన్నుని
ఇంకు స్టాండుని మంత్రించే సూర్యకిరణం ఖరీదెంత!
ఎంత డబ్బు పెడితే దొరుకుతుంది.
సూర్యకిరణాలు, చంద మామలు, సాయింత్రపు కలువలూ, పక్షుల కిలకిలలు, నదిలోనీడలు, గదిలో కాంతులు, ఆకాశపు దీపాలు, ఇవీ ఇస్మాయిల్ కవితాలోకపు డబ్బులు. వారి సతీమణిని మరో కవితలో వర్ణించిన తీరు చాలా హృద్యంగా ఉంటుంది.
మా ఆవిడ ఒక చేత్తో ఆకాశాన్ని ఎత్తిపట్టుకొంటుంది
ఒక చేత్తో భూమిని బుజ్జగిస్తుంది.
ఒక పిట్టచేత్తో కన్నీటి బీజాల్ని ఏరుకుంటుంది.
ఒక సెలయేటి చేత్తో బండల్ని నిమిరి ఓదారుస్తుంది……
నా ఇల్లు, నా సంసారం అనుకుంటూ నిత్యం శ్రమించే ఇల్లాలిని ఇంతకన్నా గొప్పగా వర్ణించే వాక్యాలు తెలుగు సాహిత్యంలో లేవు అంటే అతిశయోక్తి కాదు.
ఇస్మాయిల్ గారు తన పద్యాల్ని తెరుచుకొన్న పద్యాలు అన్నపుడు, మిగిలిన వారివి మూసుకొన్న పద్యాలా అంటూ తెలుగు సాహిత్యవిమర్శనా లోకంలో కొంత అలజడి రేగింది. అలా అన్నప్పుడు ఇస్మాయిల్ గారి ఉద్దేశ్యం ఒక కవిత చదవగానే పాఠకుడు ఆ పద్యానికి కంటిన్యూ అవుతారనీ, అంటే అతను కవితను తనంతట తానుగా కొనసాగించుకొనే అవకాశం ఉంటుందని. అలాంటి ఓపెన్ నెస్ఈయన కవితలలో ఉండి పాఠకుల కల్పనా శక్తికి పని కల్పించటం ద్వారా అవి మరింతగా వారి హృదయంలోకి ఇంకటం జరుగుతుంది.
స్త్రీవాద కవిత్వాన్ని ఇస్మాయిల్ గారు అహ్వానించలేదన్న అపవాదు వారిపై ఉంది. కానీ నిజానికి ఆయన ఉద్దేశ్యం కవిత్వం ప్రకృతిని ప్రతిబింబిస్తుందనీ, స్త్రీ ప్రకృతికి దగ్గర కనుక వారికి కవిత్వం వ్రాసే అవసరం రాకపోవచ్చుననీ మాత్రమే అన్నారు. ఆ తరువాత వచ్చిన స్త్రీవాద కవిత్వాన్ని చూసిన ఆయన, కవిత్వం అనేది అంతర్గతకల్లోలాల వల్ల జనిస్తుంది, ఈనాడు స్త్రీలకు కూడా ఈ మానసిక అశాంతి తప్పటం లేదన్న మాట అని అభిప్రాయ పడ్డారు.

(ఈ వ్యాసం బొల్లోజు బాబా గారి బ్లాగ్ లోనిది, వారికి కృతజ్ఞతలు)