ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Friday, November 2, 2012

ఆత్మహత్య

తనని బాధిస్తున్న
ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చక చకా
ఎటో నడిచిపోయింది.

25-9-75

శ్రావణ మంగళవారం

శ్రావణ మంగళవారం
సాయంత్రం
ఒకానొక మబ్బు డస్టరు
అకస్మాత్తుగా ప్రవేశించి
భూమ్మీది వెర్రి రంగుల్నీ పిచ్చిగీతల్నీ
పూర్తిగా తుడిచేసి,
మెరిసే వానసుద్దముక్క పట్టుకొచ్చి
వీధుల్లో కళ్ళనీ
రోడ్లపై పడెల్నీ
లోకంలో కాంతినీ
వెయ్యిపెట్టి గుణించేసి
చెయ్యూపి వెళ్ళిపోయింది.

అప్పుడు
చప్పుడు కాకుండా
శ్రావణ మంగళవారం
చక్కా వచ్చి,
వీధుల్లో
విలాసంగా తేలే
పేరంటపు అమ్మాయిల
పిపాళి కళ్ళపడవల్నిండానూ,
తడిసిన చెట్లపై
తళతళలాడే
ఆకుల దోనెల్నిండానూ,
అద్దాల బొట్టుల్లా మెరుస్తో
పిల్లల్ని ఆహ్వానించే
నీళ్ళ పడెల్నిండానూ
వింతగా పెరిగిపోయిన
కాంతిరాశుల్ని నింపి,
ఆనందపు తెరచాపలెత్తి
అనంతకాలంలోకి వదిలింది.
ఎరుపెక్కే
ఇవాళ్టి సంధ్యకానీ
నలుపెక్కివచ్చే
నిరాశాంధం కానీ
నా మనస్సులో
ఆనందపు తెరచాపలెత్తి
అనవరతం సాగిపోయే
ఈ కాంతిపడవల్ని
ఆర్పలేవనుకుంటాను.

12-8-73

ముసురు

ఎవరూ ఎరగని
ఏదో కాయలా
బరువుగా నా మెదడు చెట్టుని
పెరుగుతోంది ఈ ముసురు.

నింగికి చాపుకున్నవాణ్ణి
కుంగతీస్తోంది నేలకి,
అంగుడులేని గుడ్డికన్నులా
ఆకాశాన్ని మింగింది.

ఈ అంధఫలమేమిటో
ఎందుకు పనికొస్తుందో తెలీదు
చివరికిది పగిలి
అవని అంతా

వేయినేత్రాలతో మొలిచినందాక
వేయి ఆకాశాలతో రెపరెపలాడినందాక

12-9-75

ఇస్మాయిల్ పురస్కారం 2012


ప్రియమైన మిత్రులకు,
కొద్ది మంది మిత్రులతో ఏర్పడిన ‘ఇస్మాయిల్ మిత్ర మండలి’ గత మూడు సంత్సరాలుగా తెలుగులో వస్తున్న ఒక మంచి కవితా సంకలనానికి ‘ఇస్మాయిల్ కవితా పురస్కారాన్ని’ అందిస్తోంది.  2011 సంవత్సరానికి ‘బి.వి.వి.ప్రసాద్’ వ్రాసిన ‘ఆకాశం’ పుస్తకానికి ఈ పురస్కారం లభించింది. ది. 04.11.12 న సాయంతం 04.30 గంటలకు రోటరీ హాలు, కల్పన సెంటర్, కాకినాడలో ఈ పురస్కార సభ జరుగుతుంది.

అందరికీ ఆహ్వానం
అభినందనలతో,
మిత్రమండలి


చార్లీ చాప్లిన్

నా చిన్నపుడు కడు పుబ్బించే
నవ్వుమాత్ర లిచ్చి
జీవిత జ్వరాన్ని మాన్చేవాడు.
ఇప్పుడు విషాద
కషాయ మిచ్చి
నయం చేస్తున్నాడు.

ఏ వయస్సుకి ఏ మందివ్వాలో
ఈ విదూషకుడికి తెలుసు.

20.3.1985

పికాసో

పికాసో చిత్రమైన
అచిత్ర కారుడు,

అతడు గీసింది కన్నా
చెరిపింది ఎక్కువ:

మన కళ్ళ మీది కటకటాల్ని
కుంచెతో చెరిపేశాడు.

అప్పట్నించీ మన కళ్ళు
ఎగరటం నేర్చుకున్నాయి.

11.10.1983

Thursday, November 1, 2012

యాస్మీన్‌ కంఠం



యాస్మీన్‌ నీ కంఠం

తెల్లారి లేస్తూనే
పిట్టలా పైకెగిరి
ఉదయవృక్షానికి
చిటారు కొమ్మని
రెక్కలల్లాడిస్తో
ఉయ్యాలలూగుతుంది.
అప్పటికి
నా కళ్ళు
రెక్కలు రాని పక్షుల్లా
తలగడల మైదానంలో
టపటపా కొట్టుకుంటుంటాయి.

యాస్మీన్‌ నీ కంఠం
బరువుగా బంగారుగా
పారే
మధ్యాహ్నపు సెలయేట్లో
ఎక్కడో అడుగున
సన్నగా గొంతెత్తే
గులకరాయి.

యాస్మీన్‌ నీ కంఠం
రెక్కలు ముడుచుకున్న
వయొలిన్‌లా
రాత్రులు
గూటికి చేరుకుని
తారస్థాయిలో
కొత్తస్వరాలని
నిద్దట్లో
పొదుగుతుంది.

యాస్మీన్‌ నీ కంఠం!

24-10-72