ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Thursday, November 1, 2012

దాహం

వేసవి గాడ్పులకి
దాహపు ఖర్జూరచెట్టు
యెడారి గొంతులో
అమ్ములపొదిలా
విచ్చుకుని
గరగరలాడుతోంది.

చల్లటి నీళ్ళు
గొంతు దిగుతోంటే
ఎంత హాయి.
ఇంకా తాగాలనుంటుంది కాని
కడుప్పట్టదు.

ఇప్పుడు __
నీకు వచ్చిన స్వర్గం
కోరుకొమ్మంటే,
అంతులేని మంచినీళ్ళూ
అంచుల్లేని దాహమూ
పుష్పకములాంటి పొట్టా
కోరుకొంటాను.

ఆ యెడారిలో
బారలేసుకొంటో
ఒంటెనై
సూర్యుడిబంతిని
సూటిగా ఎగరేసి,
దాహపు నావలు
వికసించే
మంచినీళ్ళ సముద్రంగా,
పొడుగాటి కాళ్ళని
తెడ్లు వేసుకుంటో
యెడారి ఓడగా,
అ ల ల ల ల ల లు గా,
ఊగుతో
ప్రయాణిస్తాను.

14-7-74

వర్షాల్లో కాలేజి

కలత నిద్దరోయే చెరువుల
కళ్ళు తెరిపించి,
చేతులెత్తేసిన చెట్లకు
కర్తవ్యం బోధించే వాన
మా కాలేజికి రాత్రంతా
మహోపన్యాసం దంచినట్టుంది.

పొద్దున వెళ్ళి
చూద్దును కదా
కాలేజి పునాదుల్నించి
వేలాడుతున్నాయి నీడలు
మెరిసే నీళ్ళలో
మెల్లిగా కదుల్తో.

కాలేజి నిజస్వరూపం
కళ్ళెదుట నిలిచినట్టుంది :
పంచరంగుల దారాలు వేలాడుతో
మగ్గంపై సగం నేసిన తివాచీలా ఉంది.

నాయుడుగా రే కాంతులతో
నేయాలనుకున్నారో కాలేజిని
ఇప్పుడు బోధపడింది నాకు.
బిగుసుకున్న మన హృదయాల్లోకి
గగనపు లోతులు దింపాలనీ,
తెరిచికొన్న పసికళ్ళల్లో
తెలిమబ్బులు నడిపించాలనీ.

కుంటినీడ వంటి కుర్రతనానికి
నీటిరెక్కల్ని అతికించాలనీ,
నాయుడుగారనుకునుంటారు.

నాయుడు గారి రంగుల తివాచీ
నేత సగంలోనే ఆగింది.
ఇవాళ కాలేజికి నిండా
ఎగజిమ్మిన కాంతులు
ఇంకిపోయి, చివరికి
ఏ మూల గుంటలోనో
తారకం గారి కళ్ళల్లో
నాయుడు గారి జ్ఞాపకంలా
తళుక్కుమంటాయి కావును.

5-10-1975

ఫ్యాను కింద లోకం

ఎరుపెక్కిన కన్నులతో
ఎండ పొంచుంది బైట,
నా గదిలో మంచంపై
ఈగలా అంటుకుని
కప్పుకేసి చూస్తో
కదల్లేని నేను.

కదల్లేని నాపైన
కదలాడే సాలీడు
పలుకాళ్ళు ఆడిస్తో
తలకిందులు ఫ్యాను,
తన మాయాజాలంలో
తగుల్కున్న బందీని.

తగుల్కున్న బందీని
ఎగతాళిగ పిలుస్తో
కటి ఊపే గోడమీది
క్యాలెండరు తార
కృత్రిమావేశం తప్ప
కదలికలేని గది.

కదలిక లేని గది బైట
అదయార్కుని వాడికి
తెగిపడిన పగటి బంటి
ఎగరలేని డిప్పల్లా
భూవియత్తులు రెండూ
జీవముడిగి పడుతున్నాయి.

జీవముడిగి పడుంటే
చేతనా ప్రపంచం,
విపరీత చేష్టలతో
వెక్కిరిస్తున్నాయి జడాలు :
తలకిందులు ఫ్యాను కింద
తలకిందులు లోకం.

24-4-72

సృష్టి



ఆడదీ, మగాడు

ఏమి సృష్టి !
ఒకళ్ళ ఆనందాన్ని కొకళ్ళు
పత్తీ, మంటలా.

ఆడదీ, మగాడు
ఒకళ్ళ నాశనానికొకళ్ళు
పత్తీ, మంటలా.

ధనియాల తిప్ప (ముమ్మిడివరం తాలూకా)


అంతా ఒక తెల్ల కాగితం.

అందులో ఒక మూలగా
ఒక అడ్డుగీతా
ఒక నిలువు గీతా -
తెరచాప ఎత్తిన పడవ.

కిందిది నదీ
పైది ఆకాశమూ
కావొచ్చు.

3.10.1983

రెప్పల్లా ఆకాశాన్ని

రెప్పల్లా ఆకాశాన్ని 
కప్పుతాయి చెట్లు,
రెప్పవేయని ఆకాశాన్ని
ఎప్పుడేనా చూశారా?
గుండ్రంగా విప్పారి
గుండ్రాతి చక్రంలా
గిరగిరా తిరుగుతో
అరగతీస్తుంది జగాన్ని.
చెట్ల సాయం లేకుండా
చేరువకెలా వస్తాయి.
నింగీ నేలా? ఏ
అంగాలతో కావలించుకుంటాయి?
పులకరింపుల పిట్టలు
కిలకిల మంటో గెంతగా
తరుహస్తాలతో
పలకరించుకుంటాయి.
భూమ్యాకాశాల
రమ్యప్రణయమంటే
కాపవ్యసనపు
కారుమెయిళ్ళు కమ్మిన
వానాకాలపు
కోనసీమ కొబ్బరితోటల
పురుష సౌందర్యం
గురుతుకొస్తుంది నాకు.
జడివానల వేళ్ళకొనల
పడెల గుండెలపై మీటి
మొలక చనుమొనల్ని
పొటమరింప చెయ్యగా,
జూలెగరేస్తో
నేలని కుమ్ముతాయి
మైథున సంరంభంలో
మైమరచిన కొబ్బరితరులు.
మాన్సూను కోరికలు
మాటు మణిగాక
సన్నటి పంటకాలవల
నున్నటి నడుములు
ఉబ్బుకు లేచే
మబ్బు నీడల్తో పిటపిటలాడతాయి :
ఈనటానికి సిద్ధపడుతుంది
కోనసీమ.

Friday, September 28, 2012

మృత్యు వృక్షం


ఒక రోజు
మృత్యు వృక్షం
వ్యత్యస్తంగా
తలకిందుగా మొలిచింది.
మూగిన బంధుమిత్రులు
మోసుకుపోయి అతణ్ణి
విత్తనంలా
పాతారు.


జనాల
మనో గగనంలో
చాపుకున్న
జ్ఞాపకాల కొమ్మల్నీ
గాఢానురాగాల
ఊడల్నీ
వెనక్కి పీల్చేసి
ఈ మృత్యుబీజం
ఏమీ తిరిగివ్వదు.